Published : 28 Jun 2022 00:47 IST

పడవే.. పుస్తకాలయం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నీళ్లన్నా, పడవ ప్రయాణమన్నా మనకు బోలెడు ఇష్టం కదూ! కానీ, పుస్తకాలు చదవమంటే మాత్రం అంతగా ఆసక్తి చూపం. అందుకే, పిల్లలకిష్టమైన పడవనే లైబ్రరీగా తీర్చిదిద్దారు. అన్ని వయసుల వారికి అవసరమైన పుస్తకాలనూ అక్కడ ఉంచారు. ఇంతకీ ఆ బోట్‌ లైబ్రరీ ఎక్కడుందో, దాని విశేషాలేంటో చదివేయండి మరి..

డిశా రాష్ట్రంలో భితార్కనికా జాతీయ ఉద్యానవనం ఒకటి ఉంది. భారతదేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులుగా ఆ ప్రాంతానికి పేరుంది. అక్కడి సరస్సులో మొసళ్ల సంఖ్య చాలా ఎక్కువ. వాటి అవసరాల కోసం ఇన్నాళ్లు ఉపయోగించిన పడవ పాడైపోవడంతో నిరుపయోగంగా మారింది. దాంతో ఆ పార్కు అధికారులతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ఓ ఆలోచన వచ్చింది. వృథాగా మూలకు చేరిన పడవను బోట్‌ లైబ్రరీగా మార్చేశారు. ఇటీవల జూన్‌ 5న పర్యావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ గ్రంథాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు.

1500 పుస్తకాలు

పుస్తకాలు చదివేందుకు వచ్చేవారు పడవలోకి ఎక్కేందుకు వీలుగా మెట్లతో సహా లోపల షెల్ఫ్‌లను ఏర్పాటు చేశారు. లైట్లు, ఇతర వసతులతో ఇంటీరియర్‌ను సైతం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. మూడు నుంచి అయిదేళ్ల వయసు పిల్లల కోసం బొమ్మలూ, కార్డ్‌ గేమ్‌ల పుస్తకాలు.. అయిదు నుంచి పదేళ్ల వారికి చారిత్రక, నీతి కథలు.. 10 నుంచి 15 సంవత్సరాల వారి కోసం ఎన్‌సైక్లోపీడియా, పర్యావరణం, సైన్స్‌కు సంబంధించినవి.. ఇలా మొత్తంగా దాదాపు 1500 పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. పదిహేనేళ్ల పైవయసు వారి కోసం కూడా కొన్ని బుక్స్‌ ఉన్నాయి.

అన్ని రోజుల్లోనూ తెరిచే..

ఈ బోట్‌ లైబ్రరీని వేసవి సెలవులతోపాటు మిగతా అన్ని రోజుల్లోనూ తెరిచే ఉంచుతారట. ప్రస్తుతం జాతీయ పార్క్‌కు వచ్చే సందర్శకులు, వారి పిల్లలతోపాటు ప్రతి ఆదివారం రెండు, మూడు పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు చదివే అవకాశం ఇస్తున్నారు. పుస్తక పఠనం ఆవశ్యకత తెలియజేసేలా చుట్టుపక్కల ఉన్న స్కూళ్లలోని విద్యార్థులకు వివిధ పోటీలూ నిర్వహిస్తున్నారు. పిల్లలతోపాటు యువకులకు పర్యావరణ పరిరక్షణపైన అవగాహన కల్పించడంతోపాటు వారికి ప్రకృతితో అనుబంధం ఏర్పరచాలని తామంతా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇటువంటి వినూత్న లైబ్రరీలు పిల్లలను చదివించేలా చేస్తాయనీ ‘బోట్‌ లైబ్రరీ’ రూపకర్తలను స్థానికులు అభినందిస్తున్నారట. మనమూ తరగతి అంశాలతో పాటు నచ్చిన పుస్తకాలనూ చదివేద్దాం ఫ్రెండ్స్‌..


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని