ఊరు ఊరంతా ఉరిమే ఉత్సాహం!

ఆ ఊరిలో బాలికలందరూ బాక్సింగ్‌లో ధీరులే. రింగులో దిగితే చిరుతలే. ఇక అమ్మాయిలందరూ వీరవనితలే. బరిలో దూకితే కొదమసింహాలే. పంచ్‌ల వర్షం కురిపిస్తే పతకాల సునామీనే. 

Updated : 10 May 2023 04:29 IST

ఆ ఊరిలో బాలికలందరూ బాక్సింగ్‌లో ధీరులే. రింగులో దిగితే చిరుతలే. ఇక అమ్మాయిలందరూ వీరవనితలే. బరిలో దూకితే కొదమసింహాలే. పంచ్‌ల వర్షం కురిపిస్తే పతకాల సునామీనే. ఇంతకీ ఆ ఊరి పేరు ఏంటి, వాళ్లకు బాక్సింగ్‌ మీద ఎందుకు ఆసక్తి ఏర్పడింది అంటే...!!

బిహార్‌లోని చిన్న గ్రామమే దిగ్వారా. కానీ, ఆ రాష్ట్రంలో ఈ ఊరి పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈ ఊరిలోని చాలా మంది  బాక్సింగ్‌లో రాణిస్తున్నారు. దిగ్వారాలో బాక్సింగ్‌ క్లబ్‌ ఉంది. ఇక్కడ వందల సంఖ్యలో బాలికలు ప్రతిరోజూ చెమటోడుస్తూ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటారు.

‘హమారీ’ కోమ్‌!!

మేరీ కోమ్‌ను ఆదర్శంగా తీసుకుని ఈ గ్రామంలోని బాలికలు బాక్సింగ్‌లో ఆరితేరుతున్నారు. ఆమెలాగే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని, ఏదో ఒకరోజు కచ్చితంగా భారత్‌ తరఫున బంగారు పతకం గెలవాలని ఆశయంగా పెట్టుకున్నారు.  దానికి తగ్గట్లుగా కృషి కూడా చేస్తున్నారు. తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నారు.

ఉదయాన్నే ప్రారంభం....

ఉదయం అయిదున్నర అయిందంటే చాలు బాలికందరూ జాగింగ్‌ చేసుకుంటూ... ఊరికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాక్సింగ్‌ క్లబ్‌కు చేరుకుంటారు. వీరికి కోచ్‌ ధీరజ్‌ ఖాన్‌ తన వంతు సాయం చేస్తున్నారు. గతంలో జూనియర్‌ నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, ఈ ఊరికి చెందిన ప్రియాంక రజత పతకం, వర్ష కాంస్య పతకం సాధించారు. ఇది దిగ్వారా బాలికల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అసలు ఈ ఊరి వాళ్లకు బాక్సింగ్‌ను పరిచయం చేసింది ప్రియాంక వాళ్ల అక్క జూలీ!

చిన్నా పెద్దా తేడా లేదు...

ప్రస్తుతం దిగ్వారాలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ బాక్సింగ్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు. గతంలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు తమ అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపిద్దామా అని తొందరపడేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. బాక్సింగ్‌లో రాణించి జాతీయ స్థాయిలో పతకాలు తేవాలని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. కష్టనష్టాలను లెక్కచేయకుండా వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. రానున్న రోజుల్లో దిగ్వారా బాలికలు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని మనమూ మనసారా కోరుకుందామా నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు