అడ్డంకులున్నా.. లక్ష్యం దిశగా..!

హలో ఫ్రెండ్స్‌.. మనకు నీళ్లలో ఆడుకోవడమన్నా, ఈత కొట్టడమన్నా భలే సరదా కదూ! ఈ ఎండాకాలంలో అయితే ప్రత్యేకంగా స్విమ్మింగ్‌ తరగతులకూ వెళ్తుంటాం.

Updated : 23 May 2023 05:06 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు నీళ్లలో ఆడుకోవడమన్నా, ఈత కొట్టడమన్నా భలే సరదా కదూ! ఈ ఎండాకాలంలో అయితే ప్రత్యేకంగా స్విమ్మింగ్‌ తరగతులకూ వెళ్తుంటాం. పూల్స్‌లో అయితే ఎంచక్కా సేదతీరతాం కానీ.. నదులు, సముద్రాల దగ్గర మాత్రం కాస్త భయపడతాం. ఓ నేస్తం మాత్రం అన్ని ప్రతికూలతలనూ అధిగమించి.. ఏకంగా రికార్డే సాధించాడు. ఇంతకీ తనెవరో,ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

చెన్నైకి చెందిన లక్ష్యయ్‌కు ప్రస్తుతం 11 సంవత్సరాలు. మనం చిన్న చిన్న పనులకే బద్దకిస్తుంటాం. కానీ, ఈ నేస్తానికి చిన్నప్పటి నుంచే బుద్ధిమాంద్యం ఉన్నా.. ఆసక్తి మేరకు పట్టుదలతో ఈతలో పట్టు సాధించాడు. ఇటీవల మెరీనా బీచ్‌ వద్ద 15 కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడు గంటల 18 నిమిషాల్లోనే ఈదేశాడు. ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకున్నాడు.

ప్రతిభను గుర్తించి..

లక్ష్యయ్‌కు మూడు సంవత్సరాల వయసున్నప్పుడే, తను ఏదో సమస్యతో బాధపడుతున్నాడని తల్లిదండ్రులు గుర్తించారు. ఓ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే, బుద్ధిమాంద్యం ఉన్నట్లు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌ పూల్‌లో తమ కుమారుడు ఉత్సాహంగా ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఆ సమయంలోనే తనకు ఈత నేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్లగానే.. లక్ష్యయ్‌ను ఓ శిక్షణ కేంద్రంలో చేర్పించారు. ఆసక్తి ఉండటంతో అతి తక్కువ సమయంలోనే ఈత కొట్టడంలో రకరకాల పద్ధతులతోపాటు వాటిలోని మెలకువలూ నేర్చుకున్నాడు.

పోటీల్లో పాల్గొంటూ..

కోచిలో నిర్వహించిన ఈత పోటీల్లో మొదటిసారి పాల్గొన్న లక్ష్యయ్‌.. రెండు కిలోమీటర్ల దూరాన్ని వంద నిమిషాల్లో పూర్తి చేశాడు. అదే స్ఫూర్తితో గతేడాది పుణెలో జరిగిన పోటీల్లోనూ పాల్గొని, మూడు గంటల 33 నిమిషాల్లో 5 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా చేరుకున్నాడు. ఇటీవల అదే దూరాన్ని కేవలం రెండు గంటల 40 నిమిషాల్లో పూర్తి చేశాడు. బాలుడిలోని ప్రతిభను గుర్తించి.. నదులు, సముద్రాల్లో ఈదేలా శిక్షకులు ప్రాక్టీస్‌ చేయించారు. అలా ఇటీవల నీలాంకరై కాల్వ నుంచి మెరీనా బీచ్‌లోని కన్నగి విగ్రహం వరకూ 15 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల 18 నిమిషాల్లో ఈదేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు సైతం లక్ష్యయ్‌ ఘనతను నమోదు చేసుకున్నారు. స్విమ్మింగ్‌తోపాటు పియానో వాయించడం కూడా నేర్చుకుంటున్నాడు.

ప్రోత్సహిస్తేనే అద్భుతాలు..

పెద్దల అభిప్రాయాలను పిల్లలపై రుద్దకుండా.. వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, అందుకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరని లక్ష్యయ్‌ వాళ్ల తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘పిల్లలతో ఎక్కువ సమయం గడపండి.. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోండి..’ అంటున్నారు. నేస్తాలూ.. చదువుతోపాటు ఇష్టమైన రంగంపైన శ్రద్ధ చూపితే.. ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన లక్ష్యయ్‌ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని