వినండి.. వినండి..!

హలో ఫ్రెండ్స్‌.. నాలుగేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు? - వచ్చీరాని మాటలతో తెగ అల్లరి చేస్తూ.. అప్పుడప్పుడే బడికి వెళ్లడం ప్రారంభిస్తుంటారు.

Published : 02 Jun 2023 00:39 IST

హలో ఫ్రెండ్స్‌.. నాలుగేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు? - వచ్చీరాని మాటలతో తెగ అల్లరి చేస్తూ.. అప్పుడప్పుడే బడికి వెళ్లడం ప్రారంభిస్తుంటారు. కానీ, ఓ నేస్తం మాత్రం ఆ వయసులోనే కేవలం మాటలే కాదు పాటలతో ఏకంగా ఓ రేడియో కార్యక్రమాన్నే నిర్వహిస్తోంది. తనెవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి..

పాకిస్థాన్‌కు చెందిన అమతుల్లా హమీద్‌ వయసు నాలుగు సంవత్సరాలు. వయసు చిన్నదే అయినా, తన ప్రతిభ మాత్రం అద్భుతమనే చెప్పాలి. కేవలం నాలుగేళ్ల 59 రోజుల వయసులోనే ‘యంగెస్ట్‌ బ్రాడ్‌కాస్ట్‌ రేడియో ప్రజెంటేటర్‌’గా ప్రపంచ గుర్తింపు సాధించింది. ఇటీవల ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించింది.

ఎలా ప్రారంభమైందంటే..

మొట్టమొదటిసారిగా గతేడాది ఏప్రిల్‌ 14న హమీద్‌ కార్యక్రమం రేడియోలో ప్రసారమైంది. అసలు ఇంతకీ తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. హసన్‌ అనే వ్యక్తి ద్వారా.. ఈ హసన్‌ ఎవరూ అంటే.. మగవారిలో ‘యంగెస్ట్‌ బ్రాడ్‌కాస్ట్‌ రేడియో ప్రజెంటేటర్‌’. ఈయన 4 సంవత్సరాల 70 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. స్థానిక ఎఫ్‌ఎం ఛానల్‌లో హసన్‌ ఒక షో నిర్వహించేవారు. హమీద్‌కు రెండేళ్ల వయసున్నప్పటి నుంచే అతడితో కలిసి షోకి వెళ్లేదట. అలా చిన్నప్పటి నుంచే రేడియో స్టూడియా పరిసరాలు, అందులోని వస్తువులూ తదితర అంశాలపైన ఓ అవగాహన ఏర్పరచుకొంది.

వీక్లీ షో..

అలా హసన్‌ స్ఫూర్తితో హమీద్‌ కూడా రేడియో జాకీగా ప్రయాణం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఓ వీక్లీ షోను విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతేకాదు.. తన పేరు మీదే ఆ షోకు ‘ది అమతుల్లా షో’ అని పేరు పెట్టారు. ఒక రేడియో ప్రోగ్రాంను నడిపించాలంటే మాటలు కాదు కదా.. మన హమీద్‌ మాత్రం సబ్జెక్టుల్లో ఆసక్తిగా అనిపించే అంశాలతోపాటు కథలు, పద్యాలు చెబుతోంది. మధ్యమధ్యలో తన షోకు అతిథులను ఆహ్వానిస్తూ, ప్రేక్షకుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ కూడా తీసుకుంటోంది. వీటన్నింటినీ చూసుకుంటూనే.. కంప్యూటర్‌, ఇతర సామగ్రి సాయంతో పాటలను ప్లే చేయాల్సి ఉంటుంది. దీనికి సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమే మరి.

అదొక్కటే కాదు..

వారానికోరోజు రేడియో జాకీగా పనిచేసే ఈ నేస్తం.. మిగతా రోజుల్లోని ఖాళీ సమయాల్లో కరాటే నేర్చుకుంటోందట. బొమ్మలు కూడా చాలా చక్కగా గీయగలదు. ప్రత్యేకంగా వీడియోలు రికార్డు చేస్తూ, వాటిని తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేస్తుంటుంది. ఇంత చిన్న వయసులోనే గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకోవడంతో హమీద్‌తోపాటు తల్లిదండ్రులూ ఎంతో సంతోషపడుతున్నారట. నిజంగా ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని