రికార్డుల వరస.. ఎందులోనో తెలుసా?

దుబాయ్‌కి చెందిన సయీద్‌ రషీద్‌కు అయిదు సంవత్సరాలు. ఈ పేరు ఇదివరకు విన్నట్లు గుర్తొస్తుంది కదా.. అవును.. ఈ నేస్తాన్ని ‘యంగెస్ట్‌ పర్సన్‌ టు పబ్లిష్‌ ఎ బుక్‌’గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ గుర్తించడంతో ఆ వివరాల గురించి ఇటీవల మనం చదువుకున్నాం.

Published : 15 Jun 2023 00:21 IST

హలో ఫ్రెండ్స్‌.. స్కూళ్లో జరిగే ఏదైనా పోటీలోనో, పరీక్షలోనో బహుమతి పొందేందుకు ఎంతో కష్టపడతాం. అలాంటిది ప్రపంచ రికార్డు సాధించడమంటే మాటలు కాదు కదా.. మరి రెండుసార్లంటే.. అదీ అయిదేళ్లలోపు నేస్తం అయితే..! ఆ చిన్నారి ప్రతిభకు ఎవరైనా అబ్బురపడాల్సిందే.. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

దుబాయ్‌కి చెందిన సయీద్‌ రషీద్‌కు అయిదు సంవత్సరాలు. ఈ పేరు ఇదివరకు విన్నట్లు గుర్తొస్తుంది కదా.. అవును.. ఈ నేస్తాన్ని ‘యంగెస్ట్‌ పర్సన్‌ టు పబ్లిష్‌ ఎ బుక్‌’గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ గుర్తించడంతో ఆ వివరాల గురించి ఇటీవల మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ బాబే మొదటి దానికి కొనసాగింపుగా మరో పుస్తకం రాశాడు. ఈసారి ‘యంగెస్ట్‌ పర్సన్‌ టు పబ్లిష్‌ ఎ బుక్‌ సిరీస్‌ (మేల్‌)’గా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కేశాడు. కేవలం నాలుగు సంవత్సరాల 238 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు.

ఏనుగు, ఎలుగుబంటి..  

రషీద్‌కు చిన్నప్పటి నుంచే కార్టూన్‌ పుస్తకాలు చదవడం, వాటిల్లోని బొమ్మలను మళ్లీ గీసే అలవాటు ఉండేదట. అదే క్రమంగా ఇష్టంగా మారింది. అలా కల్పిత పాత్రలతో ‘ది ఎలిఫెంట్‌ అండ్‌ ద బియర్‌’ పేరిట మొదటి పుస్తకాన్ని రాశాడు. ఇంతకీ అందులోని కథేంటంటే.. సముద్ర తీరానికి పిక్నిక్‌కి వెళ్తుందో ఏనుగు. అక్కడ దానికి ఓ ధ్రువపు ఎలుగుబంటి కనిపిస్తుంది. అది తనవైపే వస్తున్న ఏనుగును చూసి కాస్త భయపడుతుంది. కానీ, తీరా దగ్గరకు వచ్చాక స్నేహంగా మాట్లాడుతుంది. అలా అవి రెండూ మిత్రులవుతాయి.

బుక్‌ ఫెయిర్‌లో..

మొదటి కథకు కొనసాగింపుగా ‘మై ట్రూ ఫ్రెండ్‌’ పేరిట రెండో పుస్తకం రాశాడా నేస్తం. అందులో ఆ ఏనుగు తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఓ గొయ్యిలో పడిపోతుందట. వెంటనే ధ్రువపు ఎలుగుబంటి వచ్చి, దాన్ని కాపాడుతుంది. అలా వాటి మధ్య స్నేహం మరింత బలపడుతుందని తన కథలో వివరించాడు. గిన్నిస్‌ నిబంధనల ప్రకారం కనీసం వెయ్యి పుస్తకాలు అమ్మితేనే వాళ్లు పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో అబుదాబీలో జరిగిన ఓ బుక్‌ ఫెయిర్‌లో ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు చేసి మరీ తండ్రి సహాయంతో పుస్తకాలను విక్రయించాడు.  

సహాయ గుణం..

తన పుస్తకాలు పిల్లల్లో దయతోపాటు సహాయ గుణం పెంపొందించేలా తీర్చిదిద్దాడు. ఈ బాబు వాళ్ల అక్క కూడా ఎనిమిది సంవత్సరాలకు పుస్తకం రాసి ‘యంగెస్ట్‌ పర్సన్‌ టు పబ్లిష్‌ ఎ బైలింగ్వల్‌ బుక్‌ సిరీస్‌ (ఫిమేల్‌)’గా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేసింది. ‘తమపై తమకు నమ్మకం ఉండేలా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. అప్పుడే వారు అద్భుతాలు చేయగలరు’ అని ఈ బాబు తల్లిదండ్రులు చెబుతున్నారు. నిజంగా ఈ నేస్తం గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు