చదవగలం.. పంటలూ పండించగలం!

హలో నేస్తాలూ.. ప్రైవేటు బడుల్లో చదివే వారు ఉదయాన్నే పుస్తకాల బ్యాగ్‌తోపాటు లంచ్‌ బాక్స్‌ కూడా తీసుకెళ్తుంటారు కదా! మరి, ప్రభుత్వ బడుల్లో చదివే చాలామంది పిల్లలకు అంత స్తోమత ఉండదు కాబట్టి ప్రభుత్వమే రోజూ మధ్యాహ్నం వారికి భోజనం పెడుతుంది.

Updated : 24 Jun 2023 05:06 IST

హలో నేస్తాలూ.. ప్రైవేటు బడుల్లో చదివే వారు ఉదయాన్నే పుస్తకాల బ్యాగ్‌తోపాటు లంచ్‌ బాక్స్‌ కూడా తీసుకెళ్తుంటారు కదా! మరి, ప్రభుత్వ బడుల్లో చదివే చాలామంది పిల్లలకు అంత స్తోమత ఉండదు కాబట్టి ప్రభుత్వమే రోజూ మధ్యాహ్నం వారికి భోజనం పెడుతుంది. ఈ విషయం మీకూ తెలిసే ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. ఓ రాష్ట్రంలోని అధిక శాతం పాఠశాలల్లో విద్యార్థులే స్వయంగా కూరగాయల తోటలను పెంచుతున్నారట. ఆ వివరాలే ఇవీ..

న దేశంలోని అతి చిన్న రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. అక్కడ మొత్తం 1,247 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 635 బడుల్లో ‘న్యూట్రిషన్‌ గార్డెన్స్‌’ని పెంచుతున్నారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులే ఆ కూరగాయల తోటలకు సంబంధించిన పనులన్నీ చూసుకుంటారట.

పిల్లలదే బాధ్యత..

పాఠశాలలంటే చదువు మాత్రమే కాకుండా.. ఇతర రంగాల్లోనూ విద్యార్థులను తీర్చిదిద్దే కేంద్రాలుగా మారుస్తున్నారు. అందులో భాగంగా ఆటపాటలతోపాటు గార్డెనింగ్‌ కూడా ఓ అంశంగా నేర్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేవలం 121 బడుల్లోనే ‘న్యూట్రిషన్‌ గార్డెన్స్‌’ ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు అయిదింతలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంలో భాగంగా గోవా రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయల కోసం తోటలు పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు బడుల్లో మొక్కలు నాటి, ఆ దిగుబడులతోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారట.

వారానికి రెండు గంటలు

అలాగని విద్యార్థులు పాఠాలు వినకుండా, ఈ తోట పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారేమోననే అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదా? కానీ, వారానికి రెండు గంటలు మాత్రమే ఈ తోట పనికి కేటాయిస్తున్నారట. విత్తనాలు నాటడం దగ్గర్నుంచి, పాదులను శుభ్రం చేయడం, నీళ్లు పట్టడం తదితర పనులన్నీ పిల్లలే స్వయంగా ఎంతో ఉత్సాహంగా చేస్తుంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాసేపు ప్రకృతిలో గడుపుతుండటంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడంతోపాటు శారీరక శ్రమకూ అవకాశం కలుగుతోందట. కేవలం కూరగాయలే కాకుండా పండ్ల మొక్కలూ పెంచుతున్నారు. మన దగ్గరున్న బడుల్లోనూ కూరగాయల తోటలున్నా.. ఆ సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. నేస్తాలూ.. అందుకే మనం కూడా సమయం దొరికినప్పుడల్లా పచ్చదనం పెంచేందుకు కృషి చేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు