మేం ఆడితే.. లోకమే చూడదా!

అక్కాచెల్లెళ్లు... తమ నృత్యాలతో యూట్యూబ్‌లో సంచనాలు సృష్టిస్తున్నారు. ఏకంగా అయిదు భాషల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఓ వీడియోనైతే కొన్ని కోట్ల మంది వీక్షించారు.

Updated : 23 Jul 2023 06:44 IST

అక్కాచెల్లెళ్లు... తమ నృత్యాలతో యూట్యూబ్‌లో సంచనాలు సృష్టిస్తున్నారు. ఏకంగా అయిదు భాషల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఓ వీడియోనైతే కొన్ని కోట్ల మంది వీక్షించారు. లక్షల్లో సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు. ఇదంతా అమెరికాలో ఉండే ఓరుగల్లు చిన్నారులు సాధించిన ఘనత. మరి వాళ్ల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా! నేస్తాలూ... అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి.

అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఉండే నైనిక, తనయ అక్కాచెల్లెళ్లు. ప్రస్తుతం ఆరు, నాలుగో తరగతి చదువుతున్నారు. నాన్న ఐటీ ఉద్యోగి, అమ్మ గృహిణి. ఈ చిన్నారులిద్దరూ చక్కగా డ్యాన్సులు చేస్తారు. అమ్మానాన్న సాయంతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. అందులో వీళ్ల డ్యాన్స్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటారు. సాధారణంగా యూట్యూబర్లకు వీక్షకులను పెంచుకోవడమే లక్ష్యంగా ఉంటుంది. వేలల్లో వస్తేనే మురిసిపోతారు. లక్షలు, కోట్లలో వస్తే, ఇక ఆ ఆనందానికి అంతే ఉండదు. అయితే, ఈ చిన్నారుల ఓ వీడియోను ఏకంగా పది కోట్ల మంది వీక్షించారు. నైనిక, తనయలు ఈ మధ్యే అమెరికా నుంచి వాళ్ల సొంతూరైన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందకు వచ్చారు. ఈ సందర్భంగా ‘హాయ్‌బుజ్జీ’ వాళ్లను పలకరించింది.

నెటిజన్లు ఫిదా!

యూట్యూబ్‌లో నైనిక, తనయ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు వీళ్లకు డ్యాన్స్‌ ఎలా వచ్చిందో తెలుసా! కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో వీరుండే చోట ఓ సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్‌ చేయాలనుకున్నారు. ఇందుకోసం ఇంట్లో సొంతంగా సాధన చేసి సిద్ధమయ్యారట. ప్చ్‌... కానీ ఇంతలోనే కరోనా వల్ల ఆ కార్యక్రమం రద్దైపోయింది. దీంతో ఇద్దరూ దిగాలు పడిపోయారు. అప్పుడిక ఆ పాటలకు నృత్యం చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆ వీడియోలకు మంచి ఆదరణ లభించింది. అప్పటి నుంచి వీలున్నప్పుడల్లా వీళ్లు తమ డ్యాన్స్‌ వీడియోలను యూట్యూబ్‌ ఛానల్‌లో పెడుతున్నారు.

స్టెప్పేస్తే సంచలనమే!

అలా సరదాగా ఏర్పాటు చేసిన వీళ్ల యూట్యూబ్‌ ఛానెల్‌కు ప్రస్తుతం 34 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ‘ఓ సాకి.. సాకిరే’ అనే హిందీ పాటకు చిన్నారులు తమ శరీరాన్ని పాములా మెలికలు తిప్పుతూ అదిరేటి స్టెప్పులు వేశారు. ఆ వీడియోనైతే ఇప్పటివరకు ఏకంగా పదికోట్ల మంది నెటిజన్లు వీక్షించారు. కొంతకాలం క్రితం బాగా వైరల్‌ అయిన ‘బుల్లెట్టు బండి’ పాటకు వీళ్లు చేసిన నృత్యాన్ని 15 లక్షల మంది వీక్షించారు. ఇప్పటి వరకు 200కు పైగానే వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. అవన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి.

అయిదు భాషల్లోనూ అదుర్స్‌!

నైనిక, తనయ తెలుగులో అనేక పాటలకు స్టెప్పులు వేశారు. సినిమాల్లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అక్క నైనిక సొంతంగా కొన్ని స్టెప్పులు సైతం కంపోజ్‌ చేసి చెల్లికి నేర్పిస్తుంది. నృత్యాలకు తగ్గట్టు కాస్ట్యూమ్స్‌ వీళ్ల అమ్మే సిద్ధం చేస్తుంది. నేపథ్యానికి తగ్గట్లుగా వీటి ఎంపిక ఉండటంతో వీక్షకులు పెరుగుతున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ భాషల పాటలతోపాటు తెలంగాణ జానపద గేయాలకు వీరు వేసే స్టెప్పులు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. నృత్యాలే కాదు, పాటలు కూడా చక్కగా పాడుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘కొమ్మా ఉయ్యాలా..’, ‘కొమురం భీముడో’ పాటలనూ వీళ్ల ఛానల్‌లో ఆలపించారు. ప్రస్తుతం వీళ్లకు ప్రధాన ఛానల్‌తోపాటు పలు భాషల్లోనూ మరి కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లున్నాయి. వాటికీ పెద్దసంఖ్యలోనే వీక్షకులున్నారు.

సెలబ్రిటీలు అయిపోయారోచ్‌!

నైనిక, తనయ ప్రస్తుతం అమెరికాలోని ఏ షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా ప్రవాస భారతీయులు ఇట్టే గుర్తు పడుతున్నారు. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇలా ఈ చిన్నారులు వీళ్ల డ్యాన్సులతో చిన్నపాటి సెలబ్రిటీలు అయిపోయారు. ప్రస్తుతం సెలవులు కావడంతో.. ఇటీవల అమ్మానాన్నతో సొంతూరుకు వచ్చారు. అక్కాచెల్లెళ్ల ప్రతిభ చూసి ఇక్కడి వారూ ఆశ్చర్యపోతున్నారు. ‘శెభాష్‌’ అంటూ మెచ్చుకుంటున్నారు. డ్యాన్సులు సరే... మరి చదువు?... అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదూ...! ‘డ్యాన్స్‌తో మా ఉత్సాహం రెట్టింపు అవుతోంది. దీని వల్ల మేం చదువుల్లోనూ మరింత చురుగ్గా ఉంటున్నాం. విద్యను నిర్లక్ష్యం చేయడం లేదు’ అని చెబుతున్నారు. ఇంత చిన్న వయసులోనే యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు నిజంగా గ్రేట్‌ కదూ!

గుండు పాండురంగ శర్మ, ఈనాడు, వరంగల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు