ఆడటమే కాదు.. అందరితో ఆడిస్తాడు!

హాయ్‌ నేస్తాలూ..! మన చేతికి ఫోన్‌ కానీ, ల్యాప్‌టాప్‌ కానీ ఇస్తే.. ఏం చేస్తాం..? గేమ్స్‌ ఆడుకోవడమో లేదాకార్టూన్స్‌ చూడటమో చేస్తాం.. కానీ, ఓ బుడతడు మాత్రం ఆ గేమ్స్‌, కామిక్‌ సిరీస్‌ల వెనక దాగుండేప్రోగ్రామింగ్‌ గురించి తెలుసుకోవాలనుకుంటాడు.

Updated : 08 Aug 2023 06:19 IST

హాయ్‌ నేస్తాలూ..! మన చేతికి ఫోన్‌ కానీ, ల్యాప్‌టాప్‌ కానీ ఇస్తే.. ఏం చేస్తాం..? గేమ్స్‌ ఆడుకోవడమో లేదా కార్టూన్స్‌ చూడటమో చేస్తాం.. కానీ, ఓ బుడతడు మాత్రం ఆ గేమ్స్‌, కామిక్‌ సిరీస్‌ల వెనక దాగుండే ప్రోగ్రామింగ్‌ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ‘బాబోయ్‌.. మనకు మన పుస్తకాల్లోని పాఠాలే సరిగా అర్థం కావు.. ఇక ప్రోగ్రామింగా?!’ అని ఆశ్చర్యపోకుండా.. ఆ నేస్తం వివరాలేంటో తెలుసుకుందామా..!

గుజరాత్‌కి చెందిన హెతాన్ష్‌ హరియాకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌ నుంచి వచ్చి హోంవర్క్‌ చేయడానికే బద్ధకించే ఈ వయసులో, తను మాత్రం ఏకంగా సాఫ్ట్‌వేర్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుంటూ అబ్బుర పరుస్తున్నాడు. ఈ నేస్తం ఇటీవలే రెండు సర్టిఫికేషన్లను పూర్తి చేశాడు. ‘గూగుల్‌ సర్టిఫైడ్‌ కోర్స్‌’లో 88.75 శాతం, ‘ఐబీఎం పైథాన్‌ డెవలపర్‌ సర్టిఫికేషన్‌’లో 93.40 శాతం మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అంతేకాదు.. ఇది సాధించిన అతి చిన్న వయసు వాడిగానూ నిలిచాడు. దానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని సైతం గూగుల్‌, ఐబీఎం ప్రతినిధుల నుంచి ఇటీవలే అందుకున్నాడు.  

లాక్‌డౌన్‌లోనే ఆలోచన  

లాక్‌డౌన్‌ సమయంలో హెతాన్ష్‌ కూడా మనలాగే ఇంటికే పరిమితమయ్యాడు. కానీ, ఆ సమయంలో వైద్యం అందక చాలామంది అవస్థలు పడటంతోపాటు మన దేశంలో రోగులు, మందులు, చికిత్సకు సంబంధించిన సమాచారం అంతగా లేదని తెలుసుకున్నాడు. అప్పుడే తాను భవిష్యత్తులో ‘డేటా సైంటిస్టు’ కావాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారూ సరేనని, ఓ ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌ క్లాసులో చేర్చారు.

చదువుకుంటూనే నేర్చుకున్నాడు..

లాక్‌డౌన్‌ అయిపోయి పాఠశాలలు మళ్లీ తెరచుకున్నా, ఇంకా ఈ నేస్తం ఆన్‌లైన్‌ క్లాసులు పూర్తి కాలేదు. దాంతో రోజూ సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే హోంవర్క్‌ పూర్తి చేసేవాడట. ఒక శిక్షకుడి సాయంతో ఆ తర్వాత రెండు గంటల పాటు సాఫ్ట్‌వేర్‌ లాంగ్వేజీ క్లాసు వినడంతోపాటు ప్రాక్టీస్‌ కూడా చేసేవాడు. అదయ్యాక.. వ్యాయామం కోసం ఒక గంటసేపు సైకిల్‌ తొక్కేవాడట. ఇలా చదువుతోపాటు ఆన్‌లైన్‌ క్లాసులనూ సమన్వయం చేసుకునేవాడు. అలా నేర్చుకుంటూనే రెండు సర్టిఫికేషన్లను పూర్తి చేశాడు. ‘వరల్డ్‌ రికార్డ్స్‌ ఇండియా’ కూడా హెతాన్ష్‌ ప్రతిభను గుర్తించి అభినందించింది. మనుషుల ప్రాణాలు కాపాడే శక్తి ఉన్న వైద్య రంగానికి తనవంతు సహకారం అందిస్తానని చెబుతున్నాడీ నేస్తం. అంతేకాదు.. మనలాంటి పిల్లలంతా ఆడుకునేందుకు, తను నేర్చుకున్న లాంగ్వేజెస్‌తో కొత్త కొత్త గేమ్స్‌ను డెవలప్‌ చేస్తాడట. మరి మనమూ తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు