ఈ చిన్నారి... నాట్య మయూరి!

పుట్టినప్పుడు తక్కువ బరువు..దానికి తోడు కొన్ని ఆరోగ్య సమస్యలు..అవన్నీ దాటడం ఒకెత్తైతే... పట్టుమని పదేళ్లు నిండకుండానే వందల సంఖ్యలో నాట్య ప్రదర్శనలు... పదుల సంఖ్యలో అవార్డులు... ఇంకా ఎన్నో రికార్డులనుతన ప్రతిభతో సొంతం చేసుకుంది... మరి ఆ చిన్నారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా!  

Updated : 09 Aug 2023 05:35 IST

పుట్టినప్పుడు తక్కువ బరువు..
దానికి తోడు కొన్ని ఆరోగ్య సమస్యలు..
అవన్నీ దాటడం ఒకెత్తైతే...
పట్టుమని పదేళ్లు నిండకుండానే
వందల సంఖ్యలో నాట్య ప్రదర్శనలు...
పదుల సంఖ్యలో అవార్డులు...
ఇంకా ఎన్నో రికార్డులను
తన ప్రతిభతో సొంతం చేసుకుంది...
మరి ఆ చిన్నారి గురించి మరిన్ని
వివరాలు తెలుసుకుందామా!  

ఖమ్మం నగరానికి చెందిన శ్రీను, ఉమ దంపతుల కుమార్తె అర్చన. ఏడేళ్ల ఈ చిన్నారి ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతోంది. తడబడుతూ బుడిబుడి అడుగులు వేసే వయసు నుంచే భరతనాట్యంలో ప్రతిభ చాటుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో కలిపి ఏకంగా తొమ్మిది రాష్ట్రాల్లో కళావేదికల మీద ఇప్పటి వరకు తన నృత్యంతో అలరించింది.

మూడేళ్ల వయసు నుంచే..

మూడేళ్ల వయసున్నప్పుడు వినాయక చవితి, బతుకమ్మ పండుగల్లో ముచ్చటగా డ్యాన్స్‌ చేసేది. రోటరీనగర్‌లో రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో నిత్యం నృత్య తరగతులు జరిగేవి. సాయంత్రం వేళ ఆ గుడి ఆవరణలో ఆడుకోవడానికి వెళ్లి ఆ తరగతులను దూరం నుంచే ఆసక్తిగా గమనిస్తూ, అనుకరిస్తూ ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో, ఫోన్లో నృత్యాలకు సంబంధించిన వీడియోలు చూసేది. తమ కుమార్తెకు నాట్యంపై ఉన్న ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు అర్చనకు నాలుగేళ్ల వయసున్నపుడు డ్యాన్స్‌ అకాడమీలో చేర్పించడానికి వెళ్లారు. ‘ఇంత చిన్న వయసులో నృత్యం నేర్చుకోవడం కష్టమవుతుంది’ అని గురువు శ్రీనివాస్‌ నాయక్‌ సున్నితంగా తిరస్కరించారు. అయినా అర్చన తాను నేర్చుకుంటానని పట్టుబట్టడంతో శిక్షణ ప్రారంభించారు.  

అమ్మ ఆశయం...

అర్చన వాళ్లమ్మ విద్యార్థినిగా ఉన్నప్పుడు జానపద నృత్యాలు చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆమె వాటికి దూరమయ్యారు. తన కూతురికీ నృత్యం మీద ఆసక్తి వచ్చినందుకు తల్లిగా ప్రస్తుతం చాలా సంతోషపడుతున్నారు. తాను సాధించలేని ఘనతలు తమ కుమార్తె దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే చిన్నారికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అర్చనను రోజు డ్యాన్స్‌ అకాడమీకి తానే స్వయంగా తీసుకెళ్లి, శిక్షణ ముగిసేంత వరకు అక్కడే ఉండి, తర్వాత ఇంటికి తీసుకువస్తున్నారు. అంతే కాకుండా చిన్నారి నృత్యప్రదర్శనలు ఇస్తున్నపుడు కావాల్సిన కాస్ట్యుమ్స్‌ను సైతం యూట్యూబ్‌లో చూసి ఈమే సొంతంగా సిద్ధం చేస్తున్నారు.

చప్పట్లంటే ఎంతో ఇష్టం!

రెండు సంవత్సరాల్లోనే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. శివతాండవంలోని పుష్పాంజలి, శంభో శంకర, ఓం నమఃశివాయ, భాగ్యలక్ష్మీ రావమ్మా, అదివో అల్లదివో శ్రీ హరి వాసము.. వంటి నృత్య ప్రదర్శన అంశాలను నేర్చుకుంది. ఇంత ప్రతిభ చాటుతున్న ఈ చిన్నారిని ‘నీ లక్ష్యం ఏంటి?’ అని ఎవరైనా అడిగితే.. ‘ప్రతి ప్రదర్శనలో మొదటి బహుమతి, అవార్డు నాకే రావాలి. అప్పుడు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు నాకెంతో ఇష్టం’ అంటుంది.

ఒక్క ఏడాదిలోనే...

కేవలం ఏడాది కాలంలోనే మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, హరియాణా, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అర్చన ఏకంగా 153 ప్రదర్శనలు ఇచ్చింది. 22 అవార్డులను గెలుచుకొంది. ఇందులో ప్రపంచ స్థాయి అవార్డులు 5, జాతీయ అవార్డులు 6, రాష్ట్రస్థాయిలో 4 ఉన్నాయి. 52 నాట్య ముద్రలను కేవలం 24 సెకన్లలో చేసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే వందకు పైగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇచ్చినందుకు గాను... ‘ఛాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. ‘లిటిల్‌ ఛాంప్‌- 2023’ని సొంతం చేసుకుంది. ‘బాలరత్న’ అవార్డును సైతం కైవసం చేసుకుంది. ఇంత చిన్న వయసులోనే ఇన్ని రికార్డులు సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ! భవిష్యత్తులో నాట్య గురువు కావడమే తన లక్ష్యం అని చెబుతున్న ఈ చిన్నారి ఆశయం సిద్ధించాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి!

బుడత చంద్రశేఖర్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని