పరీక్షలు రాసి.. పతకాలు పట్టాడు..!

హాయ్‌ నేస్తాలూ..! మనం క్లాస్‌లో పరీక్ష రాయమంటేనే నానాతంటాలు పడి రాస్తాం. ఒకటి రాసేలోపే ఇంకో జవాబు మర్చిపోతాం. మొత్తానికి ఏదోలా దాన్ని ముగించేసి హమ్మయ్యా..!

Updated : 17 Aug 2023 03:54 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం క్లాస్‌లో పరీక్ష రాయమంటేనే నానాతంటాలు పడి రాస్తాం. ఒకటి రాసేలోపే ఇంకో జవాబు మర్చిపోతాం. మొత్తానికి ఏదోలా దాన్ని ముగించేసి హమ్మయ్యా..! అనుకుంటాం.. కానీ ఓ నేస్తం మాత్రం పరీక్షలు రాసి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలనే సాధించాడు. ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుందా..? అయితే వెంటనే ఈ కథనం చదివేయండి..!

హైదరాబాద్‌కు చెందిన పెరికల కోటేశ్వరరావు, విశాలాక్షిల కుమారుడు కార్తికేయ. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ వయసులో చాలామంది పిల్లలు స్కూల్లో పెట్టిన పరీక్షలే రాయడానికి బద్ధకం చూపిస్తారు. అలాంటిది కార్తికేయ మాత్రం ‘ఇంటర్నేషనల్‌ సోషల్‌ ఒలింపియాడ్‌’ పరీక్షలో ఏకంగా బంగారు పతకాన్నే సాధించాడు. 60 మార్కులకు నిర్వహించిన పరీక్షలో తను 42 మార్కులు సాధించాడు. అంతర్జాతీయంగా 55వ, రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంకుతో అందరినీ మెప్పించాడు. దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను కూడా పొందాడు. ఇలా తన ప్రతిభతో కార్తికేయ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇంతకు ముందు సైన్స్‌లో..

గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌’లో కూడా ఈ చిన్నారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అందులో అంతర్జాతీయంగా 451వ ర్యాంకు సాధించాడు. రోజూవారీ పాఠ్య అంశాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. ఒలింపియాడ్‌ పరీక్షలకు సన్నద్ధం అయ్యాడు. స్కూల్‌ నుంచి వచ్చాక, నిత్యం మూడు గంటల పాటు ఒలింపియాడ్‌ పరీక్ష కోసం సన్నద్ధమయ్యాడట. తరగతిలో నిర్వహించే ఏ పరీక్షలోనైనా మొదటి ర్యాంకెప్పుడూ తనదేనని గర్వంగా చెబుతున్నాడు.  

చదవడం అంటే ఇష్టం..

విద్యా అంశాల పరంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన కార్తికేయ.. ఆటల్లోనూ ముందుంటాడు. క్రికెట్‌, చెస్‌ అంటే చాలా ఇష్టం. అలాగే ఖాళీ సమయాల్లో నవలలు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటాడు. చిన్న చిన్న కథలూ రాస్తుంటాడట. నిజంగా కార్తికేయ చాలా గ్రేట్‌ కదూ.. ఈ నేస్తం భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దాం మరి..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని