వయసు చిన్న.. రికార్డులు మిన్న!

హాయ్‌ నేస్తాలూ.. సాధారణంగా మనం ఏదైనా ఒక అంశంలో రికార్డు సాధిస్తేనే.. ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతాం.

Updated : 22 Aug 2023 05:27 IST

హాయ్‌ నేస్తాలూ.. సాధారణంగా మనం ఏదైనా ఒక అంశంలో రికార్డు సాధిస్తేనే.. ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతాం. అదే.. ‘అంతకుమంచి సాధిస్తే..?’ ఇంకేమైనా ఉందా.. గాల్లో తేలిపోతాం. ప్రస్తుతం ఓ నేస్తం అదే సంతోషంలో ఉన్నాడు. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన శివంగ్‌ సింగ్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆడుతూ పాడుతూ స్కూల్‌కి వెళ్లి, చక్కగా చదువుకునే ఈ వయసులోనే తను రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా ఆరు అంశాల్లో తన ప్రతిభను చాటి ఔరా అనిపిస్తున్నాడు.

కళ్లకు గంతలతో..

ఎవరైనా ఒకే అంశం మీద బాగా ప్రాక్టీస్‌ చేసి రికార్డు సాధిస్తారు. కానీ, శివంగ్‌ మాత్రం కేవలం 35 నిమిషాల 45 సెకన్లలో ఆరు వేర్వేరు అంశాల్లో రికార్డు చేజిక్కించుకున్నాడు. అవేంటంటే.. ఏడు కరెన్సీ నోట్లపైన ఉండే సిరీస్‌లను అప్పజెప్పడం, 3×3 రూబిక్స్‌ క్యూబ్‌ను సాల్వ్‌ చేయడం, ‘ది హేర్‌ అండ్‌ ది టార్టాయిస్‌’ పుస్తకంలోని పేజీ చదవడం, 19 రకరకాల వస్తువుల పేర్లు చెప్పడం, కార్డ్స్‌పైన 27 అంకెలతోపాటు 88 సింబల్స్‌ను గుర్తించడం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఇవన్నీ కళ్లకు గంతలు కట్టుకొనే చేశాడట ఈ నేస్తం. కళ్లకు గంతలు కట్టుకొని అతి తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసినందుకు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకున్నాడు.

మెలకువలు తెలుసుకొని..

శివంగ్‌కు చిన్న వయసు నుంచే రూబిక్స్‌ క్యూబ్‌తో ఆడుకోవడం చాలా ఇష్టం. తనకు ఏడేళ్లు ఉన్నప్పుడే నాలుగు భిన్నమైన 3×3 రూబిక్స్‌ క్యూబ్‌లను సాల్వ్‌ చేశాడు. మొదట్లో కళ్లకు గంతలు కట్టుకుని, రెండు నిమిషాల్లోనే పూర్తి చేశాడట. అయినా ఇంకా తక్కువ సమయంలోనే చేసేయాలని పట్టుదలతో ప్రయత్నించాడు. అయితే, ఇదంతా అంత సులభంగా ఏమీ అయిపోలేదు. రూబిక్స్‌ క్యూబ్‌ను సాల్వ్‌ చేయడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలో ఇంటర్నెట్‌లో బాగా వెతికాడు. గత రికార్డులనూ పరిశీలించాడు. ఆ మెలకువల సాయంతో సాల్వ్‌ చేయడంలో పట్టు సాధించాడు. ఈ నేస్తం ప్రతిభను మెచ్చుకుంటూ.. ‘హార్వర్డ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు తనకు ‘టాలెంటెడ్‌ కిడ్‌’ అనే బిరుదునూ అందించారు. పిల్లలూ.. ఈ నేస్తం టాలెంట్‌ మామూలుగా లేదు కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని