నడకలో అన్నదమ్ముల రికార్డు..!

హాయ్‌ నేస్తాలూ.. సాధారణంగా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య సరదా గొడవలు, అలకలు ఉంటుంటాయి. ఒకరు ఒక పనిలో చురుగ్గా ఉంటే, మరొకరు ఇంకో అంశంలో ముందుంటారు.

Updated : 26 Aug 2023 04:50 IST

హాయ్‌ నేస్తాలూ.. సాధారణంగా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య సరదా గొడవలు, అలకలు ఉంటుంటాయి. ఒకరు ఒక పనిలో చురుగ్గా ఉంటే, మరొకరు ఇంకో అంశంలో ముందుంటారు. ఒకరికి ఒకటి ఇష్టమైతే, ఇంకొకరు అది తప్ప మరొకటి కావాలంటూ పేచీ పెడుతుంటారు. ఒకవేళ వాళ్లు కవలలే అయినా వారి అభిరుచులు భిన్నంగా ఉండొచ్చు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అన్నదమ్ములు మాత్రం అలా కాదు. ఇద్దరూ కలిసి ఏకంగా రికార్డు సాధించారు.. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం!

ముంబయికి చెందిన ధ్రువేశ్‌, ధ్రువిన్‌ ఇద్దరూ కవలలు. ప్రస్తుతం వాళ్లకి ఎనిమిదేళ్లు. మూడో తరగతి చదువుతున్నారు. ఈ వయసు పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపి స్కూల్‌కి పంపించేందుకు తల్లిదండ్రులు నానాతంటాలు పడుతుంటారు. ఇక వాకింగ్‌, వ్యాయామాల సంగతి సరేసరి. కానీ, ఈ సోదరులు మాత్రం నడవడాన్నే హాబీగా తీసుకున్నారు. రోజూ ఇద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్తుంటారు. ఇటీవల ముంబయిలో నిర్వహించిన ఓ పోటీల కార్యక్రమంలో ఈ సోదరులిద్దరూ పాల్గొన్నారు. దాదాపు నెల రోజుల పాటు ప్రతిరోజూ 1.6 కిలోమీటర్లు నడిచి వీరిద్దరూ రికార్డు సృష్టించారు. అలా సుమారు 49.6 కిలోమీటర్ల దూరం నడిచారు. అతిచిన్న వయసులో ఎక్కువ దూరం నడిచిన కవలలుగా గుర్తింపు సాధించారు. అంతేకాదు.. ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం దక్కించుకున్నారు.  

నడకతో చురుకుదనం..  

‘చిన్నప్పటి నుంచి మా ఇద్దరికీ నడవటం అలవాటు. నడక వల్ల మెదడు చురుగ్గా ఉండటంతోపాటు ఆరోగ్యానికీ మంచిది. వాకింగ్‌ చేసేందుకు ఉదయాన్నే నిద్ర లేస్తుండటంతో హడావిడిగా కాకుండా ప్రశాంతంగా స్కూల్‌కి వెళ్తున్నాం. మా అమ్మానాన్న కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. నడక వల్ల కలిగే ఉపయోగాలనూ టీచర్లు బడిలో చెబుతుంటారు. అదే మేం పాటిస్తున్నాం’ అని ధ్రువేశ్‌, ధ్రువిన్‌ చెబుతున్నారు. నేస్తాలూ.. మరి మనమూ వాకింగ్‌ అలవాటు చేసుకుందామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని