కర్ర తిప్పడమే.. కలిసొచ్చింది!

హలో ఫ్రెండ్స్‌.. ఏదైనా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే, అంతకంటే ముందు బాగా చదవాల్సి ఉంటుంది. ఆటల్లోనూ అంతే కదా! ఎంత ప్రాక్టీస్‌ చేస్తే, పోటీల్లో అంత చక్కగా ప్రతిభ చూపగలం.

Published : 23 Sep 2023 00:07 IST

హలో ఫ్రెండ్స్‌.. ఏదైనా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే, అంతకంటే ముందు బాగా చదవాల్సి ఉంటుంది. ఆటల్లోనూ అంతే కదా! ఎంత ప్రాక్టీస్‌ చేస్తే, పోటీల్లో అంత చక్కగా ప్రతిభ చూపగలం. కానీ, ఓ నేస్తం మాత్రం కొద్దిపాటి ప్రాక్టీస్‌తోనే బంగారు పతకం సాధించాడు. ఇంతకీ అతడెవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

న్యూజిలాండ్‌కు చెందిన బేలే తీపా తారౌకు పన్నెండు సంవత్సరాలు. ఇటీవల నిర్వహించిన నేషనల్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించి, ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేశాడు. గోల్డ్‌ మెడల్‌ అంటే అతడెంత ప్రాక్టీస్‌ చేశాడో, ఎన్ని మెలకువలు నేర్చుకున్నాడోనని అందరూ అనుకుంటారు. కానీ, తారౌ కేవలం మూడంటే మూడేసార్లు గోల్ఫ్‌ ఆడాడట.

అదే మరి మ్యాజిక్కు..

న్యూజిలాండ్‌లోని ఓషియానా నగరంలో స్కూల్‌ స్థాయి విద్యార్థులకు ఏటా జాతీయ పోటీలు నిర్వహిస్తుంటారు. ఇవి 2004 నుంచి జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల పోటీల్లో తారౌ.. ఎటువంటి ప్రాక్టీస్‌ లేకుండానే గోల్ఫ్‌లో 87 పాయింట్లు సాధించాడు. ఈ నేస్తానికి కర్ర తిప్పడం చిన్నప్పటి నుంచి అలవాటు. కొన్ని నెలల క్రితం ఈ బాలుడు అవలీలగా కర్ర తిప్పుతుండటాన్ని వాళ్ల స్కూల్‌ టీచర్‌ చూశారు. ఆ విద్య గోల్ఫ్‌ ఆడేందుకు బాగా ఉపయోగపడుతుందని, తారౌను ఆ దిశగా ప్రోత్సహించారాయన. అప్పుడు తాను సరేనని చెప్పినా, తర్వాత మర్చిపోయాడు. మళ్లీ ఆ మాస్టారే దగ్గరుండి మరీ మొదటిసారి గ్రౌండ్‌కు తీసుకెళ్లారట. అలా మొత్తమ్మీద మూడు రౌండ్లు మాత్రమే ఆడాడు. అయినా, ఇటీవల పోటీల్లో మిగతా వారందర్నీ ఓడించి మరీ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.  

మెలకువలు తెలియకపోయినా..

జాతీయ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచినా, తారౌకు గోల్ఫ్‌ గురించి అంతగా తెలియదట. కానీ, హిట్టింగ్‌ అంటే ఇష్టం ఉండటంతో.. గ్రౌండ్‌లోకి వచ్చి బాల్‌ని బలంగా కొట్టేవాడు. అయితే, అది సరైనదో కాదో కూడా పట్టించుకునేవాడు కాదని ఆ మాస్టారు చెబుతున్నారు. తాజా పోటీల్లో విజేతగా నిలవడంతో ఈ నేస్తం ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అంతేకాదు.. గోల్ఫ్‌ ఖరీదైన క్రీడ కావడంతో, స్థానికులంతా ముందుకు వచ్చి, తారౌ ప్రాక్టీస్‌ కోసం తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారట. భవిష్యత్తులో అతడు మరిన్ని విజయాలు సాధించాలనేది వారి కోరికగా చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ నేస్తం పుట్టినప్పటి నుంచే కాస్త బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడట. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఛాంపియన్‌గా నిలవడమంటే మాటలు కాదు కదా..! అందుకే, తారౌకు కంగ్రాట్స్‌తోపాటు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు