కథలు వినడం కాదు.. రాసేశాడు!

హాయ్‌ నేస్తాలూ.. మనకు చిన్న చిన్న కథలు చదవడమన్నా.. వినడమన్నా చాలా బాగా నచ్చుతుంది కదా.! అవే కథలు మనల్ని రాయమంటే, ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది ‘బాబోయ్‌..’ అనేస్తారు.

Updated : 31 Oct 2023 05:32 IST

హాయ్‌ నేస్తాలూ.. మనకు చిన్న చిన్న కథలు చదవడమన్నా.. వినడమన్నా చాలా బాగా నచ్చుతుంది కదా.! అవే కథలు మనల్ని రాయమంటే, ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది ‘బాబోయ్‌..’ అనేస్తారు. ఓ నేస్తం అయితే, అది మనలాంటి పిల్లల వల్ల కూడా అవుతుందని నిరూపించాడు. మరి తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

వితున్‌ శంకర్‌కు పదమూడేళ్లు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాళ్లది తమిళనాడులోని తిరునళ్వేలి. చిన్నతనంలో నాయనమ్మ, తాతయ్య చెప్పే కథలను బాగా వినేవాడట. అలా చాలా తక్కువ వయసు నుంచే కథలపైన ఆసక్తి ఏర్పడింది. బడికెళ్లి.. రాయడం, చదవడం నేర్చుకున్న తర్వాత.. తాను కూడా సొంతంగా చిన్న చిన్న కథలు రాయడం ప్రారంభించాడు. ‘ఎంత బాగా చదివితే, అంత మెరుగ్గా రాయగలం’ అని తాతయ్య చెప్పిన మాటలు తన మనసులో నాటుకుపోయాయి. దాంతో సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికొచ్చాక.. ప్రతిరోజూ కొంత సమయాన్ని కచ్చితంగా పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తాడట. అలా రకరకాల పుస్తకాలు చదివే క్రమంలోనే.. ఒకరోజు తాను కూడా ఎందుకు రాయకూడదనే ఆలోచన వచ్చింది. దాన్నే తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ సరేనన్నారు.  

మిత్రులంతా కలిసి..

అలా అమ్మానాన్నల ప్రోత్సాహంతో వితున్‌ తన పదకొండేళ్ల వయసులో పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నాలుగు రాసేశాడు. ఆ సిరీస్‌కు ‘ది సిక్స్‌ సూపర్‌ స్టార్స్‌’ అని పేరు పెట్టాడు. అవి అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో ఉంచాడు. వాటికి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ లభించింది. అయిదుగురు మిత్రులు, వారి పెంపుడు కుక్కతో కలిసి బయటికెళ్లడం, అక్కడ వారికి ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించిన తీరును ఈ సిరీస్‌లో వివరించాడు. అలాగే పిల్లలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలూ, వాటి నుంచి ఎలా బయటపడ్డారో కూడా ఇందులో ఆసక్తిగా చెప్పాడట. ఈ నేస్తం ప్రతిభను ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు గుర్తించారు. తమ రికార్డుల్లో చోటూ కల్పించారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని, వితున్‌కు మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని