చిట్టి చేతులు చేసిన రోభౌ..!

హాయ్‌ నేస్తాలూ..! మనకు రోబోలు అంటే తెలుసు కదా..! భలేగా ఉంటాయి. చెప్పిన పనులు చేస్తుంటాయి..ఇంకా రోబోటిక్‌ బొమ్మలతో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతాం.

Updated : 09 Jan 2024 04:54 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు రోబోలు అంటే తెలుసు కదా..! భలేగా ఉంటాయి. చెప్పిన పనులు చేస్తుంటాయి..ఇంకా రోబోటిక్‌ బొమ్మలతో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతాం. కానీ అలాంటి బొమ్మలే మనం తయారు చేస్తే..?అమ్మో మన వల్ల అవుతుందా అనిపిస్తుంది కదూ..! కానీ ఓ చిన్నారి ‘డాగ్‌ రోబో’ చేసి చూపించింది. మరి తనెవరో?అసలు ఆ రోబో విశేషాలేంటో తెలుసుకుందామా..!

మధ్యప్రదేశ్‌కు చెందిన నేత్రాసింగ్‌కు ప్రస్తుతం పదకొండు సంవత్సరాలు. తను ఆరో తరగతి చదువుతోంది. వాళ్ల నాన్న రామ్‌సింగ్‌ డీఆర్‌డీవోలో శాస్త్రవేత్త, అమ్మ నిషాసింగ్‌ సైన్స్‌ టీచర్‌. ఉద్యోగరీత్యా సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. నేత్రా కూడా అక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. స్కూల్‌ నుంచి వచ్చాక హోంవర్క్‌ చేయడానికే బద్ధకించేస్తారు చాలామంది పిల్లలు.. కానీ, ఈ చిన్నారి మాత్రం ఆవిష్కరణలపై దృష్టి సారించింది. బ్యాటరీ, మోటార్లు ఉపయోగించి కంప్యూటర్‌ కోడింగ్‌తో చిట్టి డాగ్‌ రోబోను తయారు చేసింది. ఇదంతా కేవలం రూ.5వేల ఖర్చుతోనే పూర్తిచేయడం విశేషం.

నాన్న చేయూతతో...

ఒక కుక్క కారణంగా పైఅంతస్తు నుంచి కిందపడి మృతిచెందిన డెలివరీ బాయ్‌ ఘటన, తను ఉండే కాలనీలో జరిగిన కొన్ని సంఘటనల వల్లే నేత్రకు ఈ రోబోటిక్‌ డాగ్‌ తయారుచేయాలనే ఆలోచన కలిగిందట. అలా నాన్న సాయంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఆ ప్రయత్నంలో చాలాసార్లు విఫలమైంది. కానీ, పట్టువదలకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించి చివరికి విజయం సాధించింది.

కంప్యూటర్‌ భాషల్లో ప్రావీణ్యం..

ఈ రోబోను తయారు చేయడం కోసం నేత్ర హెచ్‌టీఎమ్మెల్‌, జావా, పైథాన్‌ కంప్యూటర్‌ భాషలు కూడా నేర్చేసుకుంది. దీని కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా సహకారం అందించారట. ప్రస్తుతం సీ++ నేర్చుకుంటోంది. చదువులోనూ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇంకా తను చెస్‌ పోటీల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తూ.. ఏఐ శాస్త్రవేత్త అవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నేత్రాసింగ్‌కు మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!
సాయి కొర్ను, ఈనాడు పాత్రికేయ పాఠశాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని