రాముడు మంచి బాలుడు!

నమస్తే... నేస్తాలూ.. బాగున్నారా...! ఈ రోజు అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది కదా! శ్రీరామ చంద్రుడు లోకానికి ఆదర్శపురుషుడు.

Published : 22 Jan 2024 04:34 IST

నమస్తే... నేస్తాలూ.. బాగున్నారా...! ఈ రోజు అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది కదా! శ్రీరామ చంద్రుడు లోకానికి ఆదర్శపురుషుడు. పిల్లలమైన మనం కూడా రామయ్యలోని ఎన్నో మంచి లక్షణాలను అనుసరించవచ్చు, ఆచరించవచ్చు. మరి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందామా!

శ్రీరాముడు.. కులమతాలకు అతీతంగా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శం. రాముడు అనగానే మనకు సత్యవాక్య పరిపాలన గుర్తుకు వస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన అసత్యం ఆడలేదు. నిత్యం సత్యాన్నే పలికారు. పిల్లలమైన మనం కూడా ఈ విషయంలో రామయ్య బాటలోనే నడవాలి. సరదాకు కూడా అసత్యం చెప్పకూడదు. మనం ఒక్కసారి ఏదైనా అబద్ధం ఆడితే ఇంకెప్పుడూ మనల్ని ఎవరూ నమ్మరు. ‘బాల వాక్కు బ్రహ్మ వాక్కు’ అనే నానుడి కూడా ఉంది. అందుకే పిల్లలమైన మనం నిత్యం సత్యమే పలకాలి.

మారాం.. వద్దే వద్దు!

రాజ్యాధికారం చేపట్టాల్సిన రాముడు తన తండ్రి దశరథ మహారాజు మాటకు విలువిచ్చారు. ఒక్కమాట కూడా ఎదురు చెప్పకుండా.. వనవాసానికి వెళ్లారు. చిన్నపిల్లలమైన మనం కూడా అమ్మానాన్నలను గౌరవించాలి. వాళ్లు ఎప్పుడూ మన క్షేమమే కోరుకుంటారు కాబట్టి.. తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వాలి. ఊరికే మారాం చేయకుండా.. పెద్దవాళ్లు చెప్పినట్లు వినాలి. అలాగే, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, బంధువులకూ గౌరవం ఇవ్వాలి.

పేచీలు పెట్టొద్దు..

శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నదమ్ములు. వీరు ఏనాడూ ఒకరితో ఒకరు తగవులాడుకోలేదు. ఒకరి మాటకు మరొకరు విలువ ఇచ్చుకున్నారు. ఒకరితో మరొకరు గౌరవ మర్యాదలతో మెలిగారు. పొద్దున లేవగానే టూత్‌పేస్ట్‌ దగ్గర నుంచి రాత్రి ‘గుడ్‌నైట్‌’ చెప్పుకునేంత వరకు ప్రతి విషయంలోనూ మనం మన అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, తమ్ముళ్లతో గొడవపడుతూనే ఉంటాం. పేచీలు పెడుతూ అమ్మానాన్నకు తెగ చిరాకు తెప్పిస్తుంటాం. ఇక నుంచి అలా చేయకుండా బుద్ధిగా ఉండాలి.

చక్కగా చదువుకోవాలి...

రామయ్య విద్యలో చక్కగా రాణించేవారు. గురువు మాట జవదాటేవారు కాదు. భయభక్తులతో మెలిగేవారు. వినయ, విధేయతలతో ఉండేవారు. మనం కూడా స్కూల్లో ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలి. క్రమశిక్షణతో మెలగాలి. ఏ రోజు పాఠాలు ఆరోజే నేర్చుకోవాలి. హోం వర్క్‌ అస్సలు పెండింగ్‌ పెట్టకూడదు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆటల కోసమూ కాస్త సమయం కేటాయించుకోవాలి.

మాటే మంత్రం...

శ్రీరామ చంద్రుడు మృదుస్వభావి. దయ, జాలి, కరుణ కలవారు. ఎదుటి వారికి చక్కగా గౌరవం ఇచ్చి మాట్లాడేవారు. చిన్నవారైనా, పెద్దవారైనా సున్నితంగా సంభాషించేవారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లు.. మనం కూడా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎదుటి వారి మనసు నొప్పింపకుండా మాట్లాడాలి. పేదలపై దయ, జాలి కలిగి ఉండాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. మూగ జీవుల విషయంలోనూ దయతో మెలగాలి. వాటిని ఇబ్బంది పెట్టకూడదు.  

కుంగి పోకూడదు!

కష్టాల్లోనూ, సుఖాల్లోనూ శ్రీరాముడు ఒకేలా ఉన్నారు. తన వ్యక్తిత్వాన్ని ఆయన మార్చుకోలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన ఎదురొడ్డి నిలబడ్డారు. ఎన్నో చిక్కు సమస్యలను ఎదుర్కొన్నారు. చివరికి అన్నింటిలోనూ విజయమే సాధించారు. అయినా ఆయన ఏనాడూ గర్వించలేదు. రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ప్రజలను చక్కగా తన కన్నబిడ్డలుగా పరిపాలించారు. రామరాజ్యంలో జనాలకు ఏ లోటూ రాకుండా నిరంతరం పరితపించారు. మనం కూడా పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనో, సరిగా చదవలేకపోతున్నామనో.. కుంగిపోకూడదు. ఒక్కోసారి మనం అనుకున్న ఫలితం సాధించలేకపోయినా.. ప్రయత్నాన్ని మానకూడదు.
శ్రీరామచంద్రుడిలో ఇంకా మరెన్నో మంచి లక్షణాలున్నాయి. అవన్నీ ఆచరణీయమే. అనుసరణీయమే. అమ్మానాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో చర్చించి.. పిల్లలైన మీరు రాముడి నుంచి ఇంకా ఏం ఏం నేర్చుకోవచ్చో అడిగి తెలుసుకోండి. మీరూ రాముడిలా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి సరేనా! నేస్తాలూ.. మీకు విజయోస్తు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని