చార్వీ.. చదరంగంలో చిరుత!

హాయ్‌ నేస్తాలూ..! మనం ఆటలంటే ఆసక్తి చూపుతాం కానీ.. అది కొన్ని ఆటలకే పరిమితం.. అంతే కదా! ‘ఇంతకీ చదరంగం ఆడతారా మీరు?’ అని ఎవరైనా అడిగితే.. ‘అమ్మో..! అన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం’ అని కొందరు, ‘అసలు నేను ఆడను’ అని ఇంకొందరు సమాధానమిస్తారు.

Published : 01 Feb 2024 04:47 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం ఆటలంటే ఆసక్తి చూపుతాం కానీ.. అది కొన్ని ఆటలకే పరిమితం.. అంతే కదా! ‘ఇంతకీ చదరంగం ఆడతారా మీరు?’ అని ఎవరైనా అడిగితే.. ‘అమ్మో..! అన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం’ అని కొందరు, ‘అసలు నేను ఆడను’ అని ఇంకొందరు సమాధానమిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నారి మాత్రం తన ప్రతిభతో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాన్ని అందుకుంది. మరి తనెవరో ఆ విషయాలేంటో తెలుసుకుందామా..!

ర్ణాటకలోని బెంగళూరుకు చెందిన చార్వీకి తొమ్మిదేళ్లు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. తన అమ్మానాన్నలు.. అఖిల, అనిల్‌కుమార్‌. మనకు చిన్నప్పటి నుంచి ఆటలంటే.. వీడియో గేమ్స్‌, క్యారమ్స్‌. ఇక అవుట్‌డోర్‌ గేమ్స్‌ అంటే.. ఫ్రెండ్స్‌తో కలిసి సరాదాగా బయట ఆడుకోవడం లాంటివి. కానీ, చెస్‌ ఆడటం మాత్రం చాలా తక్కువ అంతే కదా..! కానీ ఈ చిన్నారి మాత్రం చదరంగం ఆటలోనే రికార్డు సృష్టిస్తోంది. తను అయిదేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే.. చెస్‌ నేర్చుకోవడం ప్రారంభించిదట. మొదట్లో ఈ ఆట నేర్చుకోవడానికి ఒక గంట సమయం కేటాయించేదట. కొన్ని నెలలు గడిచిన తర్వాత అయిదు నుంచి ఆరు గంటలు సాధన చేసేదట.

అమ్మ సాయంతో..

మన చార్వీ ప్రస్తుతం ఓ చెస్‌ స్కూల్లో శిక్షణ పొందుతుంది. తను చదరంగంలో ముందంజలో ఉందంటే.. అందులో వాళ్లమ్మ పాత్ర కూడా ఉందట నేస్తాలూ..! ఆమె ఉద్యోగం మానేసి మరి ఆ చిన్నారి సాధన చేయడానికి కావాల్సినవన్నీ చూసుకుంటుందట. ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అండర్‌-8, అండర్‌-11 పోటీల్లో వరల్డ్‌ ఛాంపియన్‌గా స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి చెస్‌లో ఎక్కువ రేటింగ్‌ సాధించిన క్రీడాకారిణిగానూ నిలిచింది. ఇప్పటి వరకు తను వివిధ పోటీల్లో పాల్గొని అయిదు బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించింది. ఇప్పుడు తన ప్రతిభతో.. భారత ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాన్ని కూడా అందుకుంది. చదరంగం కాకుండా.. తనకు స్విమ్మింగ్‌, యోగా చేయడం, చిన్నచిన్న కథలు చదవడం అంటే చాలా ఇష్టం అట. ‘ఈ ఆట నా ఆలోచన పరిధిని, జ్ఞాపకశక్తిని పెంచింది. అలాగే.. ఒక పని మీద ఏకాగ్రత ఎలా ఉండాలో కూడా నేర్పించింది’ అని చెబుతున్న చార్వీకి మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని