చిట్టి చైత్ర.. చేసింది అద్భుతం!

బుడి బుడి అడుగుల బుడత.. ఇంకా బడి బాట పట్టకుండానే.. అమ్మానాన్న సహకారంతో విజ్ఞాన దారుల్లో పయనిస్తోంది!! కేవలం మూడేళ్ల వయసులోనే.. అద్భుత జ్ఞాపకశక్తితో ‘ఔరా!’ అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానమూ సంపాదించింది. ఇంతకీ ఎవరా చిరు చిరుత. తను సాధించిన ఘనత ఏంటో..తెలుసుకుందామా!.  

Updated : 11 Feb 2024 04:12 IST

బుడి బుడి అడుగుల బుడత.. ఇంకా బడి బాట పట్టకుండానే.. అమ్మానాన్న సహకారంతో విజ్ఞాన దారుల్లో పయనిస్తోంది!! కేవలం మూడేళ్ల వయసులోనే.. అద్భుత జ్ఞాపకశక్తితో ‘ఔరా!’ అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానమూ సంపాదించింది. ఇంతకీ ఎవరా చిరు చిరుత. తను సాధించిన ఘనత ఏంటో..తెలుసుకుందామా!.  

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాయత్రినగర్‌కు చెందిన చిన్నారి బాస చైత్రకు ప్రస్తుతం మూడేళ్లు. అమ్మ అన్నపూర్ణ.. బ్యాంకు ఉద్యోగి. నాన్న సుశీల్‌కుమార్‌.. ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌. వీరు తమ చిన్నారిలో అద్భుత జ్ఞాపకశక్తి ఉందని కొంతకాలం క్రితమే గుర్తించారు. ఏదైనా విషయం చెబితే విని, చక్కగా గుర్తుపెట్టుకుంటోందని గ్రహించారు.

తీరిక లేకుండా ఉన్నా...

అన్నపూర్ణ, సుశీల్‌కుమార్‌ దంపతులు తమ ఉద్యోగ పనుల్లో తీరిక లేకుండా ఉన్నా..  చిన్నారి కోసం రోజూ కాస్త సమయం కేటాయించారు. వాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చైత్రకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. చిన్నారి కూడా జాతీయ పండుగలు, జాతీయ గుర్తులు, 13 అంతరిక్ష వస్తువులు, 26 శరీర భాగాలు, 26 రకాల జంతువులు, 23 రకాల క్రియా పదాలు, 22 కూరగాయలు, 21 పండ్లు, 13 రంగులు, 8 ఆకారాలు, 26 ఆల్ఫాబెట్స్‌కి సంబంధిన వస్తువుల పేర్లు, 11 ఇంగ్లీషు రైమ్స్‌ను తక్కువ సమయంలోనే నేర్చుకుంది.

రికార్డు సాధించి..

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ గతేడాది డిసెంబరులో నిర్వహించిన కార్యక్రమంలో చైత్ర తనకున్న జ్ఞాపకశక్తి, ప్రతిభతో.. ప్రదర్శన ఇచ్చింది. ఇంత చిన్న వయసులో చిన్నారి కనబరుస్తున్న ప్రతిభాపాటవాలకు సంస్థ ప్రతినిధులూ ఆశ్చర్యపోయారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అచీవర్‌గా అవార్డును ప్రదానం చేశారు. బుడి బుడి అడుగుల వయసులోనే తమ చిన్నారి ఈ ఘనత సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో రికార్డు సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ! మరి మనమూ చిన్నారి చైత్రను మనసారా అభినందిద్దామా!

ఆకం శివసాయి, ఈనాడు డిజిటల్‌, నిజామాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని