పిల్ల జంతువులు దారికొచ్చాయి!

ఒక అడవిలో పిల్ల జంతువులు, పిల్ల పక్షుల అల్లరి అంతా ఇంతా కాదు. పెద్దవి ఎన్నిమార్లు మందలించినా వాటి అల్లరి తగ్గలేదు. చెట్ల కొమ్మలు విరిచేయడం, పచ్చి కాయలు కోయటం, తల్లిదండ్రుల మాట వినకపోవడం చేయసాగాయి.

Published : 25 Feb 2023 00:05 IST

క అడవిలో పిల్ల జంతువులు, పిల్ల పక్షుల అల్లరి అంతా ఇంతా కాదు. పెద్దవి ఎన్నిమార్లు మందలించినా వాటి అల్లరి తగ్గలేదు. చెట్ల కొమ్మలు విరిచేయడం, పచ్చి కాయలు కోయటం, తల్లిదండ్రుల మాట వినకపోవడం చేయసాగాయి. పిల్ల జీవుల చేష్టలు పెద్దవాటికి ఆందోళన కలిగించాయి. బిడ్డలు దారి తప్పుతున్నారని బాధపడ్డాయి. ఈ విషయంపై మృగరాజును కలవాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నదే తడవుగా జంతువులు, పక్షులు సింహం గుహ వద్దకు చేరుకున్నాయి. వాటి రాకకు కారణం అడిగింది సింహం. జంతువులు, పక్షులు రోదిస్తూ పిల్లల ప్రవర్తనను వివరించాయి. ఏం సమాధానం చెప్పాలో సింహానికి అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి.. పిల్ల జంతువులు, పక్షులు దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యతను తన మీదే వేసుకుంది. అదే విషయాన్ని వాటికి చెప్పి, వారం రోజుల్లో పిల్లల్లో మార్పు తెస్తానని హామీ ఇచ్చింది. సింహం మాటలకు ధైర్యం తెచ్చుకున్న జంతువులు, పక్షులు అక్కడ నుంచి తమ నివాసాలకు వెళ్లిపోయాయి.

సింహానికి ఆరోజు నిద్ర పట్టలేదు. జంతువులన్నింటికీ మాట అయితే ఇచ్చింది కానీ, దాని దగ్గర ఏ ఉపాయమూ లేదు. ఒకరోజు సింహం వేటకు వెళ్లకుండా పిల్ల జంతువులు, పక్షులను రహస్యంగా అనుసరించింది. ఏదో ఆలోచన రావటంతో జూలు విదిల్చి గర్జించింది. పెద్ద జంతువులు, పక్షులను గుహ వద్దకు రమ్మని కబురు పెట్టింది. అవన్నీ గుహ వద్దకు చేరుకున్నాయి. పిల్లల విషయంలో మృగరాజు ఏం మాట్లాడుతుందోనని ఆత్రుతగా చూడసాగాయి. అన్నీ వచ్చాక సింహం మాట్లాడుతూ.. ‘రేపటి నుంచి మీ పిల్లలు అల్లరి మానేస్తారు.. బాధ్యతగా ఉంటారు.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మీరు చెప్పినట్లే నడుచుకుంటారు.. నా మాట నమ్మండి’ అంది. ఆ మాటలకు జంతువులు, పక్షులు ఆనందంతో గంతులు వేశాయి. ఎలుగుబంటి ముందుకు వచ్చి.. ‘ఎలా పరిష్కరిస్తారు మృగరాజా.!’ అని ప్రశ్నించింది. ‘తొందరపడకండి.. రేపు మీరంతా మీ పిల్లలను తీసుకురండి’ అని ఆదేశించింది. మర్నాడు జంతువులు, పక్షులు పిల్లలతో సహా సింహం గుహ ముందుకు చేరుకున్నాయి.

మృగరాజు వాటిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పిల్లల కోసం అడవిలో పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పిల్ల జంతువులు, పక్షులు ఆనందంతో.. ‘ఏం పోటీలు.. ఎలాంటి పోటీలు.. ఏయే బహుమతులు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి. దానికి సింహం మీకు ఇష్టమైనవి మీరు ఎంచుకోవచ్చని చెప్పింది. కానీ, పోటీలో పాల్గొనే వారు ముందుగా శిక్షణ తీసుకోవాలని షరతు విధించింది. దానికి పిల్లలంతా మేము శిక్షణ తీసుకుంటాం.. అయితే మాకు శిక్షణ ఇచ్చేది ఎవరు? అని ప్రశ్నించాయి. పిల్లలు తన దారిలోకి వస్తున్నారని సింహం గ్రహించింది. ‘నాట్యమంటే ఎవరికి ఇష్టం?’ అని ప్రశ్నించింది. కొన్ని చిన్న జంతువులు, పక్షులు ‘మాకిష్టం.. మాకిష్టం’ అన్నాయి. దానికి సింహం.. ఆసక్తి ఉన్నవారు నెమలిని కలిసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అవన్నీ నెమలి వద్దకు పరుగుతీశాయి. ‘ఆ తర్వాత పాటల పోటీల్లో ఎవరు పాల్గొంటారు?’ అని ప్రశ్నించింది. మరికొన్ని పిల్ల జంతువులు, పక్షులు ‘మేము.. మేము’ అంటూ చేతులు పైకెత్తాయి. వాటిని ఉద్దేశించి.. ‘మీరంతా కోయిల దగ్గర పేర్లు రాయించుకొని శిక్షణ తీసుకోండి’ అని సూచించింది. ఆసక్తి ఉన్న పిల్లలన్నీ కోయిల వద్దకు చేరాయి.

అనంతరం సింహం.. ‘మీలో బాగా మాట్లాడటం ఎవరికి ఇష్టం?’ అంది. మిగిలిన వాటిలో కొన్ని ముందుకొచ్చి తమకు ఇష్టమన్నాయి. ‘మాట్లాడటం ఒక గొప్ప వరం. భాష రావాలంటే కొత్త కొత్త పదాలు తెలుసుకోవాలి. ఆ పదాలను ఎలా పలకాలో, వాటిని ఎక్కడ వాడాలో నేర్చుకోవాలి. బాగా సాధన చేయాలి. మాట మన ప్రవర్తనను తెలియజేస్తుంది. బాగా మాట్లాడే వారిని నలుగురూ మెచ్చుకుంటారు.. గౌరవిస్తారు. భాష పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు రామచిలుకను సంప్రదించండి’ అంది. చిలుక పలుకులు గుర్తుకు రాగానే కొన్ని పిల్ల జంతువులు, పక్షులు దాని దగ్గరకు వెళ్లి పేర్లు నమోదు చేసుకున్నాయి. ‘ఒక్కోసారి వేటగాడి బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి పరుగులు తీస్తాం. పరుగులో శిక్షణ కావాలనుకొనే వారు చిరుతపులిని సంప్రదించవచ్చు’ అంది సింహం. ఆసక్తి ఉన్న కొన్ని పిల్ల జంతువులు, పక్షులు చిరుత దగ్గరకు వెళ్లాయి.

చివరిగా.. ‘ఈత అంటే ఎవరికి ఇష్టం?’ అని ప్రశ్నించింది సింహం. లేచి నిలబడిన వాటికి.. మొసలిని కలవమని సూచించిందది. పిల్ల జంతువులు, పక్షులను ఉద్దేశించి.. ‘రేపటి నుంచి మీకు శిక్షణ మొదలవుతుంది. మీరంతా మీకు ఇష్టమైన రంగాల్లో పట్టు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలి’ అని సమావేశం ముగించింది సింహం. జంతువులు, పక్షులు సంతోషంగా వాటి నివాసాలకు వెళ్లిపోయాయి. మరుసటి రోజు ఉదయం లేచేసరికి పెద్ద జంతువులు, పక్షులకు పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించాయి. ఓ ప్రదేశంలో బుద్ధిగా శిక్షణ పొందుతున్న పిల్లలు కనిపించాయి. ఆనందంతో అటు నుంచి అటే మృగరాజు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపాయి. సింహం వాటితో.. ‘మనం పిల్లల మనసు తెలుసుకోవాలి. ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక వ్యాపకం ఉండేలా చూడాలి. అప్పుడే వాళ్లు రాణించగలరు’ అంది. ఎలాగైతేనేం.. పిల్లల్లో మార్పు రావటంతో జీవులన్నీ సంతోషించాయి.

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని