Plantation: పుట్టిన రోజుకు రావాలి మరి!

అది ప్రతిభానికేతన్‌ పాఠశాల. మధ్యాహ్న సమయం. భోజన విరామ గంట మోగడంతో టీచర్‌ పాఠం ముగించి వెళ్లిపోయారు. వెంటనే పిల్లలందరూ చకచకా తమ టిఫిన్‌ డబ్బాలతో బయటకు పరుగులు తీశారు.

Published : 27 Mar 2023 00:25 IST

ది ప్రతిభానికేతన్‌ పాఠశాల. మధ్యాహ్న సమయం. భోజన విరామ గంట మోగడంతో టీచర్‌ పాఠం ముగించి వెళ్లిపోయారు. వెంటనే పిల్లలందరూ చకచకా తమ టిఫిన్‌ డబ్బాలతో బయటకు పరుగులు తీశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న చైతన్య, అతని మిత్రులు కొంచెం దూరంగా ఉన్న చింతచెట్టు దగ్గరకు చేరారు. అంతా టిఫిన్‌ డబ్బాలు తెరుస్తుండగా.. ‘రేపు మీరంతా మా ఇంటికి రావాలి’ అన్నాడు చైతన్య.

‘నీ పుట్టినరోజు గత నెలలో అయిపోయింది. ఇప్పుడేంటి మళ్లీ విశేషం?’ అని అడిగారందరూ. ‘అవును విశేషమే.. మా రాజా పుట్టిన రోజు’ అని బదులిచ్చాడు చైతన్య.

‘రాజా.. ఎవరు? మాకెప్పుడు చెప్పలేదే?’ అంటూ ఆశ్చర్యంగా అడిగారు. ‘అది మా చెట్టు పేరు..’ అని చైతన్య అనడంతో.. ‘అర్థం కాలేదు.. వివరంగా చెప్పు’ అన్నాడు వినీత్‌.

‘మరేం లేదు.. అయిదేళ్ల క్రితం మా ఇంట్లో ఓ మామిడి మొక్క నాటాను. మొన్ననే దాని పుట్టిన రోజు జరపాలనే ఆలోచన వచ్చింది. ఏం.. మనకేనా పుట్టిన రోజులు? చెట్లకు ఉండకూడదా?’ అన్నాడు చైతన్య.

‘మరి రాజా ఎవరు?’ అడిగాడు అనంత్‌. ‘ఆ మామిడి మొక్కకు నేనే రాజా అని పేరు పెట్టాను’ అని నవ్వుతూ బదులిచ్చాడు చైతన్య. ‘పుట్టిన రోజు తేదీ ఎలా నిర్ణయించావు?’ అంటూ తెలివిగా అడిగాడు మధు. ‘రాజాను మా ఇంట్లో నాటిన రోజునే పుట్టిన రోజుగా నిర్ణయించా’ అని వివరించాడు చైతన్య.

‘అన్నం తినకుండా మాటల్లో పడిపోయాం. త్వరగా భోజనం చేద్దాం.. మళ్లీ గంట కొట్టేస్తారు’ అని మిత్రులను అప్రమత్తం చేశాడు. ‘రేపు ఎలాగూ ఆదివారమే కదా.. సాయంత్రం అయిదు గంటలకల్లా వచ్చేయండి. సరదాగా గడుపుదాం’ అని అందరికీ మరోసారి గుర్తు చేశాడు చైతన్య.

‘అలాగే.. తప్పకుండా వస్తాం’ అంటూ గబగబా తినేసి తరగతి గది వైపు నడిచారు. రాజా పుట్టిన రోజు వేడుక జరిపేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు చైతన్య. మర్నాడు నిద్రలేవగానే.. పైపుతో చెట్టును శుభ్రం చేశాడు. దాంతో ఆ చెట్టు ఆకులన్నీ పచ్చగా సరికొత్త కాంతితో కళకళలాడాయి. ఓ అట్టపై ‘రాజా’ అని పేరు రాసి, మరో అట్టపై ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ బోర్డులు తయారు చేశాడు. చైతన్య వాళ్ల అమ్మ కూడా సాయంత్రం వచ్చే పిల్లల కోసం పులిహోర, లడ్డూలు తయారు చేసి సిద్ధంగా ఉంచింది.
ఎండ తగ్గగానే.. మిత్రులందరూ ఒక్కొక్కరుగా చైతన్య ఇంటికి రాసాగారు. ‘రాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీకు అభినందనలు’ అంటూ తాము తెచ్చిన రకరకాల మొక్కలను బహుమతులుగా అందించారు. ‘అరే.. మీరు కూడా నా దారిలోకి వచ్చేశారన్నమాట. రాజా.. చూశావా.. ఇవన్నీ నీకు తోడుగా వచ్చిన కొత్త స్నేహితులు’ అంటూ ఆనందంగా ఆ మొక్కల్ని మామిడి చెట్టుకు చూపించాడు చైతన్య.

మిత్రులకు ఓ మగ్గు అందించి.. అక్కడున్న బకెట్‌లోని నీళ్లను ఒక్కొక్కరుగా మామిడి చెట్టుకు పోయాలని సూచించాడు. సరేనంటూ అందరూ అలాగే చేశారు. ఆ తర్వాత పెరట్లోనే ఏర్పాటు చేసిన కుర్చీల్లో అంతా కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు.
అంతలో చైతన్య వాళ్ల అమ్మ.. పులిహోర, లడ్డూలను అందరికీ అందించింది. పిల్లలందరూ హాయిగా తింటూ.. వాళ్లకు ఇష్టమైన చెట్లు, పాఠశాల విశేషాల గురించి చర్చించుకోసాగారు. ఆ తర్వాత అందరూ బాదం పాలు తాగారు.
‘‘ఇక వెళ్లి వస్తాం. రాజా పుట్టినరోజు బాగా చేశావు. వచ్చే నెలలో నేను కూడా మా ‘శ్రీ’ పుట్టినరోజు చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు వినీత్‌. ‘శ్రీ.. ఎవరు?’ అంటూ కుతూహలంగా అడిగారందరూ. ‘మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది కదా.. దానికి ఇప్పుడే పేరు ఆలోచించా.. శ్రీ బాగుంటుందని అనిపించింది..’ అంటూ నవ్వుతూ చెప్పాడు వినీత్‌. వచ్చిన వారందరికీ రకరకాల మొక్కలను బహుమతిగా అందించాడు చైతన్య.

‘అందరూ ఇదే పద్ధతి పాటిస్తే.. నేలంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. పర్యావరణ సమతుల్యతతో కాలుష్యం బాధ తప్పుతుంది. సమయానికి వర్షాలు కురుస్తాయి. ఎండల తీవ్రతా తగ్గుతుంది’ అంటూ చైతన్య వాళ్లమ్మ సూచించింది. ఇంతలో మామిడి చెట్టు కొమ్మలు గాలికి ఊగడం చూసి.. ‘మా రాజా కూడా మీకు టాటా చెబుతోందిరా..’ ఆనందంగా అన్నాడు చైతన్య. అందరూ ప్రేమగా రాజా వైపు చూస్తూ.. ఇళ్లకు వెళ్లిపోయారు.

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని