Updated : 03 Feb 2023 00:26 IST

అపూర్వ సోదరులు!

నగనగా చైనాలో ఓ వృద్ధురాలు ఉండేది. ఆమెకు అయిదుగురు కొడుకులు. ఆ అయిదుగురూ ఒకే కాన్పులో పుట్టారు. వారి రూపాలను చూసి ఎవరెవరో గుర్తించడం చాలా కష్టం. కానీ, వారిలో ఒక్కొక్కరికి ఒక్కో శక్తి ఉంది.

అందరిలోనూ పెద్దవాడు, చెరువులోని మొత్తం నీటిని మింగేసి.. కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టగలడు. రెండో వ్యక్తి మెడ ఉక్కులా గట్టిది. మూడోవాడి శక్తి ఏమిటంటే.. అతను తన కాళ్లను ఎంత పొడవైనా పెంచుకోగలడు. అలాగే తగ్గించుకోనూగలడు. నాలుగో వ్యక్తిని ఎంతటి వేడైనా ఏమీ చేయలేదు. అయిదో వాడు శ్వాస బిగబట్టి ఎంత కాలమైనా జీవించగలడు. ఇలా ఈ అయిదుగురూ అపూర్వ సోదరులుగా ఉండేవారు. కానీ, వారు తమ శక్తియుక్తులను బయటకు చెప్పేవారు కాదు.

పెద్దవాడు చేపలు పట్టడంలో దిట్ట. రోజూ చెరువుకు వెళ్లి బోలెడన్ని చేపలు పట్టుకొచ్చేవాడు. అది చూసి ఇరుగుపొరుగువారు తమకు కూడా చేపలు పట్టడం నేర్పించమనేవారు. సరేనని ఒకరోజు కొందరు యువకులను చెరువు దగ్గరకు వేటకు తీసుకెళ్లాడు. అందరూ ఒడ్డున నిల్చున్నారు. అంతే.. అతను నోరు తెరచి చెరువులోని నీటినంతా తాగేశాడు. అప్పటి వరకూ నీటిలో ఉన్న చేపలన్నీ చెరువు ఇంకిపోవడంతో విలవిల్లాడసాగాయి. వాటిని పట్టుకోమని తనవెంట తీసుకెళ్లిన యువకులకు సూచించాడతను. అందరూ కలిసి చేపలను పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. చాలా సమయం కావడంతో.. ‘ఇక చాలు.. నేను ఇంతకన్నా ఎక్కువ సమయం నీటిని బిగబట్టలేను. బయటకు వచ్చేయండి’ అని సైగ చేశాడు. అయితే, ఆ యువకులు పట్టించుకోలేదు.

దాంతో మరో దారి లేక అతను నీటినంతా విడిచిపెట్టేయడంతో యువకులందరూ నీటిలో మునిగిపోయారు. చేసేదేంలేక అతను బాధతో ఇంటికి చేరుకున్నాడు. ఊళ్లో వాళ్లంతా ‘మా పిల్లలెక్కడున్నారు? వారికి చేపలు పట్టడం నేర్పావా?’ అని అడగసాగారు.

అతను జరిగినదంతా చెప్పాడు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు.. అతని మీద ఫిర్యాదు చేశారు. న్యాయస్థానంలో విచారణ తర్వాత.. మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. శిక్ష అమలు చేసే ముందు తన తల్లిని చూడాలని చివరి కోరిక కోరాడతను.

న్యాయమూర్తి అనుమతించడంతో ఇంటికెళ్లాడు. ఏడుస్తూ తన పరిస్థితిని తల్లి, సోదరులతో పంచుకున్నాడు. అప్పుడు పెద్ద తమ్ముడు.. ‘అన్నయ్యా.. నీ బదులు నేను వెళ్తాను. మనమందరం చూడటానికి ఒకేలా ఉంటాం కాబట్టి ఎవరూ గుర్తుపట్టలేరు’ అన్నాడు.

అతను సరేననడంతో రెండో వాడు వెళ్లాడు. శిక్ష అమలుచేయడానికి జైలులో ఏర్పాట్లు చేశారు. అతని మెడను ఓ బండ మీద ఉంచారు. ఆ మెడ మీద కత్తి వేటు పడింది. కానీ, ఉక్కులాంటి అతని మెడను కత్తి ఏమీ చేయలేకపోయింది. మరోసారీ విఫలం కావడంతో న్యాయమూర్తి శిక్షను సవరించారు. నీటిలోకి నెట్టేసి చంపమన్నారు.

అప్పుడు అతను మరోసారి తల్లిని చూసి, మాట్లాడే అవకాశం ఇవ్వమని కోరాడు. అతను ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. అప్పుడు మూడో వ్యక్తి.. ‘అన్నా.. నీ బదులు నేను వెళ్తాను’ అన్నాడు. మూడో వ్యక్తిని ఓ పడవ ఎక్కించి నీటిలో తోసేశారు. కానీ, అతను తనకున్న శక్తితో కాళ్ల పొడవును పెంచడంతో ఎంతకూ మునగలేదు. సముద్రంలోకి నెట్టేసినా లాభం లేకపోయింది. దాంతో న్యాయమూర్తి.. సలసలా కాగే నూనెలో వేసి శిక్షను అమలు చేయమన్నారు.

అప్పుడతను ఇంటికి వెళ్లివచ్చేందుకు మళ్లీ అనుమతి తీసుకొని, వెళ్లాడు. విషయం వివరించడంతో నాలుగో వాడు తాను వెళ్తానన్నాడు. అధికారులు అతడిని మరిగే నూనెలో వేసినా, అతడికి ఏమీ కాలేదు. దాంతో ఏం చేయాలో వారికి తోచలేదు.

అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ నిందితుణ్ని తమకు అప్పగించాలని కోరారు. ఓ గొయ్యి తవ్వి.. అందులో నాలుగో వ్యక్తి అనుకుని అయిదో వ్యక్తిని దింపి మట్టి కప్పేశారు. అతనికి నెలల తరబడి కూడా శ్వాసను బిగపట్టి ఉండటం తెలుసు.

మూడు రోజుల తర్వాత అతను చనిపోయి ఉంటాడనుకున్న జనం.. మట్టిని తొలగించి చూసి అవాక్కయ్యారు. అతను అప్పుడే నిద్ర లేచినట్టుగా.. అందరి వంకా చూశాడు. దాంతో అతడిని ఏమీ చేయలేమని అనుకుని విడిచిపెట్టడంతో హాయిగా ఇంటికి చేరాడు. తల్లి, సోదరులంతా కలిసి ఆనందంగా జీవించారు.    

యామిజాల జగదీశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని