Social Responsibility: సామాజిక బాధ్యతలో నిర్మాణ సంస్థలు

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా గతంలో హరితహారంలో భాగసామ్యమైన నిర్మాణ సంస్థలు.. ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతను తీసుకున్నాయి.

Updated : 01 Apr 2023 02:56 IST

అవుటర్‌ లోపల 51 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ చేపట్టేందుకు శ్రీకారం

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా గతంలో హరితహారంలో భాగసామ్యమైన నిర్మాణ సంస్థలు.. ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతను తీసుకున్నాయి. తమ ప్రాజెక్ట్‌లకు సమీపంలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చాయి. తొలిదశలో 51 చెరువులను క్రెడాయ్‌, నరెడ్కో తెలంగాణ సంఘాల సభ్యులు దత్తత తీసుకున్నారు. ఒక్కో చెరువు అభివృద్దికి రూ.కోటి నుంచి రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు.. చెరువుల సుందరీకరణకు సంబంధించి తమ డిజైన్లను ఇటీవల జరిగిన దత్తత కార్యక్రమంలో ప్రదర్శించాయి.

ఈనాడు, హైదరాబాద్‌ : జనావాసాలు పెరిగే కొద్దీ చెరువులన్నీ ఒక్కొక్కటిగా కుంచించుకుపోయాయి. చుట్టుపక్కల ఆవాసాల నుంచి మురుగునీరు వచ్చి జలాశయాల్లోకి చేరుతోంది. దీంతో దోమలకు ఆవాసాలుగా మారిపోయాయి. చాలాచోట్ల ఆక్రమణలకు గురై ఇళ్లు, అపార్ట్‌మెంట్లు వచ్చాయి. కొన్ని చెరువులు ఆనవాళ్లే కోల్పోయాయి. ఉన్న చెరువులను కాపాడుకునేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. వీటి అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉండటంతో నిర్మాణ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులను ఈ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటి పరిధిలో 26 చెరువులను దత్తత తీసుకునేందుకు బిల్డర్లు ముందుకొచ్చారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని మరో 25 చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

దుర్గం చెరువు మోడల్‌..: నిర్మాణ సంస్థలకు మోడల్‌గా చూపించేందుకు ప్రభుత్వం దుర్గం చెరువును అభివృద్ధి చేసింది. కేబుల్‌ వంతెన, బోటింగ్‌, సైకిల్‌ ట్రాక్‌, సుందరీకరణ చేపట్టడంతో సిటీలో ఇప్పుడు ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉంది. సినిమా షూటింగ్‌లకు నిలయంగా మారింది. చెరువులను దత్తత తీసుకున్న నిర్మాణ సంస్థలు సైతం తూతూమంత్రంగా కాకుండా ఈ తరహాలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దాలని సర్కారు కోరుకుంటోంది.

హద్దులు నిర్ణయించి..: చెరువుల అభివృద్ధి పనులు మొదలెట్టడానికి ముందే హద్దులు నిర్ణయించి అప్పగించాలని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు.. ప్రభుత్వాన్ని కోరారు. గతంలో తమకు సమస్యలు ఎదురయ్యాయని.. వీటిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఒకవైపు అభివృద్ధి చేసి.. మరోవైపు మురుగునీరు అందులో వచ్చి కలిస్తే ఉపయోగం ఉండదని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు సునీల్‌చంద్రారెడ్డి.. సర్కారుకు సూచించారు.  చెరువుల్లోకి వ్యర్థ జలాలు కలవకుండా చూడాలని కోరారు.

రియల్‌ ఎస్టేట్‌కు మేలు: మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో సహజంగా నివాసం ఉండేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల ధరల్లో వృద్ధి కన్పిస్తుంటుంది. ఒక కొత్త రహదారి రాగానే ఆయా ప్రాంతాల్లో ధరలు పెరుగుతుంటాయి. రహదారినే కాదు.. చుట్టుపక్కల పార్క్‌లు ఉన్నాయా? చెరువులు ఉన్నాయా? వంటి అంశాలను నేటితరం కొనుగోలుదారులు చూస్తున్నారు. జలాశయాలు ఉంటే భూగర్భ జలాలకు ఢోకా ఉండదు. వరదనీరు రహదారులపై నిలిచిపోకుండా చెరువుల్లోకి వెళుతుంది. కాలనీల మునక ఉండదు. ఆహ్లాదకరంగా చెరువు పరిసరాలు ఉంటే.. ఉదయం సాయంత్రం సమయాల్లో నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యకర జీవనశైలిని కొనసాగించేందుకు దోహదం చేస్తుంది. కొత్తగా కట్టే విల్లా ప్రాజెక్ట్‌లైనా, బహుళ అంతస్తుల ప్రాజెక్ట్‌ అయినా.. సమీపంలోనే అన్ని హంగులతో అభివృద్ధి, సుందరీకరణ చేపట్టిన జలాశయాలు ఉన్నాయంటే ఆయా ప్రాజెక్టుల విలువ పెరుగుతుంది. నిర్మాణ సంస్థలకు పరోక్షంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖర్చుకు వెనకాడకుండా ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేలా ఆయా చెరువులను అభివృద్ధి చేయాలని  మంత్రి కేటీఆర్‌ బిల్డర్లను కోరారు.

ఎలా చేయబోతున్నారు..: పార్కుల్లో వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు, స్ట్రీట్‌ ఫర్నిచర్‌, ల్యాండ్‌స్కేప్‌, కార్యక్రమాల నిర్వహణకు వీలుగా యాంపీ థియేటర్‌, ఆట స్థలాలు, ఓపెన్‌ జిమ్‌లు, సాయంత్రం పూట ఆహ్లాదంగా ఉండేలా విద్యుత్తు దీపాల ఏర్పాటు వంటివి దత్తత తీసుకున్న చెరువుల వద్ద అభివృద్ధి చేయనున్నారు. అవకాశం ఉన్న చోట థీమ్‌ పార్క్‌లను అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. కొన్నిచోట్ల బోటింగ్‌ సదుపాయాలు కల్పించబోతున్నారు. డిజైన్లను అధికారులు, ఆయా నిర్మాణ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. వీటి అభివృద్ధితో ఆయా ప్రాంత పరిసరాలు ఆహ్లాదకరంగా మారనున్నాయి. 6 నెలల్లో చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఒకటి రెండేళ్లు పడుతుందని బిల్డర్లు అంటున్నారు. అభివృద్ధితో పాటు నిర్వహణ సైతం ఆయా సంస్థలే చూడాల్సి ఉంటుంది. ‘గౌడవెల్లిలోని బొమ్మాయి చెరువు 54 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కోటి రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నా’మని సాకేత్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని