నిర్మాణ అనుమతులకు టీఎస్‌ బీపాస్‌

టీఎస్‌ ఐపాస్‌ మాదిరి భవన నిర్మాణ అనుమతులకు అతి త్వరలో టీఎస్‌ బీపాస్‌ ప్రవేశపెట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. లంచం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు వచ్చేలా పురపాలక శాఖ మంత్రిగా తనపై ఆ బాధ్యత ఉందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇచ్చే వ్యవస్థను తీసుకురాబోతున్నామని తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ మాదిరి టీఎస్‌ బీపాస్‌ కూడా దేశానికి ఆదర్శమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు....

Published : 01 Feb 2020 02:08 IST

నిర్దేశిత గడువులోగా ఇచ్చేలా అతి త్వరలో కొత్త విధానం
క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో
ప్రకటించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
ఈనాడు, హైదరాబాద్‌

టీఎస్‌ ఐపాస్‌ మాదిరి భవన నిర్మాణ అనుమతులకు అతి త్వరలో టీఎస్‌ బీపాస్‌ ప్రవేశపెట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. లంచం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు వచ్చేలా పురపాలక శాఖ మంత్రిగా తనపై ఆ బాధ్యత ఉందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇచ్చే వ్యవస్థను తీసుకురాబోతున్నామని తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ మాదిరి టీఎస్‌ బీపాస్‌ కూడా దేశానికి ఆదర్శమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయని.. రాబోయే నాలుగేళ్లలో పారదర్శకంగా అమలుచేసి బాగా చేశామని అన్పించుకుంటామని అన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో క్రెడాయ్‌ హైదరాబాద్‌ 9వ ప్రాపర్టీ షోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి ఒకవైపే కేంద్రీకృతం కాకూడదని మొదట్లో హైదరాబాద్‌ తూర్పువైపు చూడమని చెప్పామని.. ఇప్పుడు పశ్చిమం తప్ప అన్ని వైపులా అనే విధానంతో ముందుకెళుతున్నామన్నారు. 2020 కీలక సంవత్సరమని, మౌలిక వసతుల పరంగా ఎస్‌ఆర్‌డీపీ పనులు పూర్తి, మెట్రో కారిడార్‌-2, టీహబ్‌, టీవర్క్స్‌, ఫార్మాసిటీ, దక్షిణంవైపు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌, ఉత్తరం వైపు ఐటీ క్లస్టర్ల ప్రారంభం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టబోతోందని.. ఇవన్నీ నిర్మాణరంగానికి ఊతమిస్తాయని అన్నారు. హైదరాబాద్‌ ఎదుగుతున్న నగరమని.. చిన్నచిన్న తప్పులతో నిర్మాణదారులు చెడ్డ పేరు తేవొద్దని.. స్వీయ నియంత్రణ పాటించాలని బిల్డర్లను కోరారు. హైదరాబాద్‌ వృద్ధి ఇప్పుడే మొదలయ్యిందని.. 15 నుంచి 20 ఏళ్ల వరకు జోష్‌ కొనసాగుతుందనే విశ్వాసం తమకు ఉందని కేటీఆర్‌ వివరించారు.

పార్కింగ్‌ అదనపు అంతస్తులకు అనుమతి..
* నగరంలో ట్రాఫిక్‌ సమస్య పెరుగుతోంది. బిల్డర్లు అదనపు అంతస్తులు నిర్మించి పార్కింగ్‌ కోసం కేటాయిస్తామంటే అనుమతి ఇచ్చే ఆలోచన చేస్తున్నాం.
* నిర్మాణ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్లంబింగ్‌, కార్పెంటర్‌ ఇతరత్రా పనుల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. మరోవైపు మన రాష్ట్రానికి చెందిన వారు దుబాయ్‌ వంటి గల్‌ఫ దేశాలకు వలసపోయి ఇక్కడికంటే తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్నవారిని సొంతగడ్డకు రావాలని పిలుపునివ్వబోతున్నారు. క్రెడాయ్‌ తరఫున నైపుణ్య కేంద్రం ఏర్పాటుచేసి ఇలాంటి వారికి శిక్షణ ఇవ్వడంలో చొరవ చూపాలి. ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉంటుంది.
* మురుగునీటిని  శుద్ధి చేసి మూసిలోకి వదిలేస్తున్నాం. ఈ నీటికి నిర్మాణాలకు ఉపయోగించాలని నా అభ్యర్థన. మంచి నీరే ఉపయోగించాలని ఏమీ లేదు. చాలా చోట్ల శుద్ధిచేసిన నీటిని నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు.
* నిర్మాణ సమయంలో ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతంలో దుమ్ముధూళి ఎక్కువగా వస్తుంది. దుమ్ము లేవకుండా నీళ్లు చల్లడంతో పాటూ ఆధునిక పద్ధతులను అవలంభించి పరిసరాలు కాలుష్యం కాకుండా చూసే బాధ్యత నిర్మాణదారులపై ఉంది. ఎవరికివారే ఇందుకోసం కొత్త సాంకేతికతలను, అత్యుత్తుమ విధానాలను అవలంభించాలి.
* కొందరు నిర్మాణదారులు సెట్‌బ్యాక్‌ కూడా వదలకుండా సెల్లార్లు తవ్వుతున్నారు. ఇటీవల నానక్‌రాంగూడలో ఒక బిల్డర్‌ తవ్వకాలతో రహదారే కుంగిపోయింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత నష్టం. నిబంధనలను ఉల్లంఘించే వారిపై జరిమానాలు, నిర్మాణదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం చేయవచ్చు. పరిస్థితులు అక్కడివరకు రాకుండానే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి.  కార్మికుల భద్రతపై బిల్డర్లు జాగ్రత్తలు తీసుకోవాలి.


నేడు, రేపు ప్రాపర్టీ షో

క్రెడాయ్‌ హైదరాబాద్‌ 9వ ప్రాపర్టీ షో-2020 ఆదివారం వరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో ప్రముఖ నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 80 వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. రూ.45 లక్షల మొదలు రూ.5కోట్ల వరకు ఇళ్ల ధరలు ఉన్న సమీకృత టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, వాణిజ్య సముదాయాల ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తున్నారు. అత్యుత్తుమ ప్రాజెక్ట్‌లను ఒకేచోట చూసే అవకాశం ప్రాపర్టీ షోతో కొనుగోలుదారులకు కల్పించామని, సద్వినియోగం చేసుకోవాలని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు కోరారు. స్థిరాస్తి ధరలు పెరగముందే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవాలని ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్‌పై మాంద్యం ప్రభావం లేదని తెలంగాణ క్రెడాయ్‌ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి చెప్పారు.


నిర్మాణరంగానికి ఊతమిలా..

* ఇటీవల ఒక సంస్థ అధ్యయనంలో బెంగళూరు అత్యంత రద్దీ కలిగిన నగరాల్లో మొదటి స్థానంలో నిల్చింది. మనం ఎప్పటికీ ఆ జాబితాలో ఉండొద్దనే ముందుచూపుతో ఇదివరకే ఎస్‌ఆర్‌డీపీ పనులను రూ.6వేల కోట్లతో చేపట్టాం. మూడువేల నుంచి నాలుగువేల కోట్ల విలువైన పనులు ఇదివరకే పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ఏడాదిలో పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు చాలా వరకు తీరుతాయి.
* జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 10 కి.మీ. మెట్రో మార్గం వారం పదిరోజుల్లో సీఎం సమయం తీసుకుని ప్రారంభిస్తాం. దీంతో దేశంలోనే దిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ మనదే అవుతుంది. మెట్రో విస్తరణ ప్రణాళికలున్నాయి. నాగోల్‌ నుంచి ఫలక్‌నుమా, అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం, మరిన్ని మార్గాల్లో విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి.
* తూర్పు హైదరాబాద్‌లో ఫార్మాసిటీ, దక్షిణ హైదరాబాద్‌ వైపు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ హబ్‌ను ఈ ఏడాది ప్రారంభించబోతున్నాం. ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి.
* ఉత్తర హైదరాబాద్‌లోని పేట్‌ బషీరాబాద్‌, కొంపల్లి ప్రాంతంలో ఐటీ క్లస్టర్‌ ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ నిర్మాణ రంగానికి ఇది ఊతం.
* టీడీఆర్‌ బ్యాంక్‌ తెచ్చాం. త్వరలోనే ప్రారంభిస్తాం.  నాలుగువేల స్టార్టప్‌లు పనిచేసేలా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న టీహబ్‌ జూన్‌, జులైల్లో ప్రారంభిస్తాం. ప్రొటోటైప్‌ కోసం టీవర్క్స్‌ కూడా రాబోతుంది.
* చందన్‌వల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేశాం. అవుటర్‌ చుట్టూ మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. వీటన్నింటితో హైదరాబాద్‌ వృద్ధి ఇప్పుడే మొదలయ్యింది.


డబ్బాల మాదిరి కట్టకండి..

నగరంలో భవనాలను డబ్బాల మాదిరి కాకుండా నగర అందాన్ని పెంచేలా కళాత్మకంగా ఎలివేషన్‌ ఉండేలా చూడాలి. నేను కర్ణాటకలోని మంగళూరు వెళ్లినప్పుడు భవనాల ఆర్కిటెక్చర్‌ అమితంగా ఆకట్టుకుంది. మన దగ్గర ఇలాంటి నిర్మాణాలు లేవెందుకు అన్పించింది. మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి. కాస్త ఖర్చయినా సరే మంచి కన్సల్టెంట్లను సంప్రదించి ఎలివేషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా భవనం కడితే ఆ ప్రాంతంలో అదొక ల్యాండ్‌మార్క్‌గా చెప్పుకొనేలా ఉండాలి. సిటీ అందం గురించి కూడా ఆలోచించండి. కొత్త నమూనాలు, కొత్త నగిషీలు సిటికీ తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని