విశాలంగా.. విలాసంగా!

విలాసవంతమైన ఇళ్ల నిర్మాణాల వాటా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో క్రమంగా పెరుగుతోంది. దేశ సగటు కంటే ఇక్కడ లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల నిర్మాణాల శాతం అధికంగా ఉంది. ఐదేళ్లలోనే ఇవి గణనీయంగా పెరిగాయి. 2015లో విలాసం, అత్యంత విలాస ఇళ్ల శాతం కేవలం నాలుగు శాతం ఉండగా.. ప్రస్తుతం ఇది 23 శాతానికి పెరిగింది. గత ఏడాది కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల్లో రూ.2.5కోట్లపైన విలువ చేసే అత్యంత విలాస ఇళ్ల వాటానే 10 శాతం ఉందంటే మార్కెట్‌లో వీటికున్న డిమాండ్‌ను సూచిస్తోంది.

Published : 22 Feb 2020 01:36 IST

కొత్త ప్రాజెక్ట్‌ల్లో పెరిగిన లగ్జరీ ఇళ్ల వాటా
ఈనాడు, హైదరాబాద్‌

విలాసవంతమైన ఇళ్ల నిర్మాణాల వాటా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో క్రమంగా పెరుగుతోంది. దేశ సగటు కంటే ఇక్కడ లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల నిర్మాణాల శాతం అధికంగా ఉంది. ఐదేళ్లలోనే ఇవి గణనీయంగా పెరిగాయి. 2015లో విలాసం, అత్యంత విలాస ఇళ్ల శాతం కేవలం నాలుగు శాతం ఉండగా.. ప్రస్తుతం ఇది 23 శాతానికి పెరిగింది. గత ఏడాది కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల్లో రూ.2.5కోట్లపైన విలువ చేసే అత్యంత విలాస ఇళ్ల వాటానే 10 శాతం ఉందంటే మార్కెట్‌లో వీటికున్న డిమాండ్‌ను సూచిస్తోంది.

విలాసవంతమైన భవంతులు గతంలో అరుదుగా మాత్రమే కనిపించేవి. ఎక్కువగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాలకు పరిమితం అయ్యేవి. లగ్జరీ అపార్ట్‌మెంట్లు అసలు ఉండేవి కాదు. ఇప్పుడు నగరంలో అన్నివైపులా విలాసవంతమైన ఇళ్లు, నివాస సముదాయాలు కనిపిస్తున్నాయి. శ్రీమంతుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.  హోదా, అంతస్తు పెరిగేకొద్దీ మరింత సౌకర్యవంతమైన, విశాలమైన, విలాసవంతమైన ఇళ్లలో ఉండాలని కోరుకోవడం సహజం. ఇదే ఇప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో కనిపిస్తోందని నిర్మాణదారులు అంటున్నారు.

ఇల్లు హోదా..
ఇల్లు ప్రతి కుటుంబానికి అవసరమే అయినా హోదాకు తగ్గట్టుగా ఉంటేనే ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. ఉండే ప్రాంతం, నివసించే ఇల్లు, తిరిగే కారు, వేసే బట్టల్లో తమ హోదా ప్రతిబింబించాలనే భావనతో తమ స్థోమత కంటే ఎక్కువే వెచ్చించి కావాల్సినదాన్ని సమకూర్చుకుంటున్నారు. అందులో ఇల్లు కూడా ఉండటంతో వీటి నిర్మాణాల సంఖ్య ఏటా పెరుగుతోంది.

మూడు అంశాలే తేడా..
సాధారణ ఇళ్లకు, విలాసవంతమైన నివాసాలకు ప్రత్యేకించి మూడు అంశాల్లో ప్రధానమైన తేడా ఉంటుంది.
* ఇల్లు ఏ ప్రాంతంలో ఉందనేది ముఖ్యమైన అంశం. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఐటీకారిడార్‌ చుట్టుపక్కల మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లో ఇల్లు కావాలంటే రూ. కోట్లలోనే వ్యయం చేయాలి. అధికాదాయ వర్గాలు ఇక్కడే ఎక్కువ ఉండటం, భూముల ధరలు అధికంగా ఉండటంతో సహజంగానే ఇక్కడ కొత్తగా వచ్చే ఇళ్లు బాగా ఖరీదు.
* ఇంటి విస్తీర్ణం మరో అంశం. ఎక్కువ విస్తీర్ణం ఉందంటే విలాసవంతం కిందనే లెక్క. కనీసం 3వేల చదరపు అడుగుల నుంచి ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉండాలని కోరుకుంటున్నారు. బంధువులు, స్నేహితులు వచ్చినా, వారాంతాల్లో వేడుకులు చేసుకునేందుకు వీలుగా, పనివారు సైతం ఉండేలా ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు. విస్తీర్ణం పెరిగేకొద్దీ ఇంటి ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారి అవసరాలనే గుర్తించే ప్రత్యేకంగా ఫ్లాట్లు, విల్లాలను బిల్డర్లు నిర్మిస్తున్నారు.
* ప్రాంతం, ఇంటి విస్తీర్ణమే కాదు ఎలాంటి బాదరబందీ లేకుండా సకల సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. క్లబ్‌హౌస్‌, ఆట స్థలాలు, ఈతకొలను, పెద్దలకు వైద్య సదుపాయాలు, అతిథులకు గెస్ట్‌రూమ్‌లు, విశాలమైన లాబీలు, ఎక్కువ బాల్కనీలు ఉండాలని కోరుకుంటున్నారు. వీటన్నింటితో ఇంటి ధర కూడా పెరుగుతోంది.

అవసరాలను బట్టి..
తమ అవసరాలను బట్టి నగరంలోనే విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కొందరు ఎంచుకుంటే.. నగరానికి దూరమైనా ఫర్వాలేదని మరికొందరు విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. సొంతంగానూ కట్టుకుంటున్నారు. లగ్జరీ విల్లాల ధరలు రూ.ఐదు కోట్లపైనే పలుకుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో స్థలాల ధరలు పెరిగేకొద్దీ ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి.

ఐదేళ్లలో ఎంత మార్పు..
2015లో రూ. 1.5కోట్ల విలువ చేసే ఇళ్ల వాటా 2 శాతం ఉంటే.. రూ. 2.5కోట్లపైన ఉండే ఇళ్లవాటా 2 శాతంగా ఉండేది. 2016లో కోటిన్నర ఇళ్ల వాటా 8 శాతానికి పెరిగింది. 2017లో రెండున్నరకోట్లపైన ఉండే ఇళ్లు 3 శాతానికి పెరిగాయి. 2019లో రూ. కోటిన్నర ఇళ్లు 13 శాతానికి, రూ. రెండున్నరకోట్ల ఇళ్లు ఏకంగా 10 శాతానికి ఎగబాకాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని