అలాంటిచోట కొని మునగొద్దు!

సంవత్సరాల స్వప్నం సొంతిల్లు.. ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో చిన్న ఇల్లు, ఫ్లాట్‌ కొనుగోలు చేస్తుంటారు. తీరా వానాకాలంలో అవి కాస్త నీట మునిగితే? ఇటీవల వరదల్లో భాగ్యనగరంలోని పలుచోట్ల జరిగింది ఇదే. ఇల్లు కట్టుకున్నవారు, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొన్నవారు భారీ వర్షాలకు వరదలో చిక్కుకోవడంతో వాటిని వదిలి తాత్కాలికంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Published : 17 Oct 2020 02:57 IST

ఈనాడు, హైదరాబాద్‌

సంవత్సరాల స్వప్నం సొంతిల్లు.. ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో చిన్న ఇల్లు, ఫ్లాట్‌ కొనుగోలు చేస్తుంటారు. తీరా వానాకాలంలో అవి కాస్త నీట మునిగితే? ఇటీవల వరదల్లో భాగ్యనగరంలోని పలుచోట్ల జరిగింది ఇదే. ఇల్లు కట్టుకున్నవారు, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొన్నవారు భారీ వర్షాలకు వరదలో చిక్కుకోవడంతో వాటిని వదిలి తాత్కాలికంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా ప్రాజెక్ట్‌ల అసలు రూపం, నిర్మాణ నాణ్యత, ఆ ప్రాంతం స్థితిగతులన్నీ ఇప్పుడే బయటపడ్డాయి. కొత్తగా ఇంటికోసం చూస్తున్నవారు తాము కొనే ప్రాంతం, నిర్మాణాలను వానాకాలంలో చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మేలని తాజా అనుభవాలు సూచిస్తున్నాయి.
సందర్శించాకే నిర్ణయం
సాధారణంగా స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నా.. ఇళ్లు, ఫ్లాట్‌ కొనుక్కున్నా కచ్చితంగా ఆయా ప్రాంతాలను సందర్శించాకే నిర్ణయం తీసుకుంటారు. వానాకాలంలో తప్ప ఎక్కువగా మిగతా కాలంలోనే ఆయా ప్రదేశాలను చూస్తుంటారు. ఇక్కడే కొనుగోలుదారులను కొందరు బోల్తా కొట్టిస్తున్నారు. వర్షాల సమయంలో ఆయా ప్రాజెక్ట్‌లను సందర్శిస్తే కొనాలా? వద్దా తెలుస్తుంది. వాటి చుట్టూ మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇటువంటి చోట వెంటనే నివాసం ఉండొచ్చా? లేదా? సిద్ధంగా ఉన్నవి కొనడమా? నిర్మాణంలో ఉన్నవి తీసుకోవాలా అనేది నిర్ణయించుకోవచ్చు.
*‘వరద ముంపు లేదు.. అభివృద్ధికి మరికొన్నేళ్లు పడుతుంది.. ఆ ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుంది’ అని అనుకుంటే నిర్మాణంలో ఉన్నవాటిని కొనచ్చు. ఇల్లు సిద్ధం అయ్యేసరికి వసతులు అందుబాటులోకి వస్తాయి.
అన్నీ బాగుంటేనే..
శివార్లలో పూర్తి అభివృద్ధి చెందిన ప్రాంతాలు కాకపోవడంతో ఎక్కడ వరద కాలువలు ఉన్నాయనే అవగాహన లేక వాటిపై కట్టడాలతో సమస్యలకు కారణమవుతోంది. మునుగుతున్నవాటిలో చాలావరకు ఇలాంటివే. వరదల్లో చిక్కుకున్న నివాసాలను చూస్తే చెరువుల పరిధిలో, నాలా ప్రవాహ మార్గంలో ఎక్కువగా ఉన్నాయి. అనుమతి ఉన్న లేఅవుట్లలో అయితే వీటన్నింటిని చూసిన తర్వాత నిర్మాణాలకు అంగీకరిస్తారు. కాబట్టి అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే తీసుకోవాలి.
* కొంతమంది రియల్టర్లు చెరువు పరిధి, వరద కాలువ మార్గంలో, ఎఫ్‌టీఎల్‌, 111 జీవో పరిధిలో చాలా వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. ఇలాంటిచోట తీసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ముంపు తప్పదని తాజా పరిస్థితులు మరోసారి రుజువు చేశాయి. అధికారులు వద్దని చెబుతున్నా కొందరు కొంటూ నష్టపోతున్నారు.
* చెరువులు, నాలాల పక్కన ఆక్రమించి కట్టిన వాటిలో భారీ వర్షాలు పడినప్పుడు నీటమునిగే ప్రమాదాలే కాదు..  ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆస్తుల విలువ కూడా పడిపోతుందని నగర అనుభవాలు చెబుతున్నాయి.

పక్కా అనుమతులతో..
నగర పరిధిలో అయితే జీహెచ్‌ఎంసీ హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి ఉన్న లే అవుట్లలోనే కొనుగోలు చేయాలి. ఎక్కువగా శివార్లలో జీపీ లేఅవుట్‌ పేరుతో ఇప్పటికీ నీటి వనరుల ప్రాంతాల్లో వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. గ్రామపంచాయతీలకు లేఅవుట్‌ అనుమతి ఇచ్చే అధికారం లేదని హెచ్‌ఎండీఏ అంటోంది.
* స్థలం కొనేటప్పుడే దిక్కులతో పాటూ పరిసరాలు చూశాకే నిర్ణయం తీసుకోవాలి. నగరాల్లో అన్నిచోట్ల అన్నివేళల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. లోతట్టు ప్రాంతంలో రహదారికంటే దిగువన ఉంటే వ్యక్తిగత గృహ నిర్మాణం నీట మునగకుండా ఎత్తు పెంచి కట్టుకోవాలి.
* ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల సంఖ్య ఎక్కువ కాబట్టి స్టిల్ట్‌, సెల్లార్‌1, ఇంకా ఎక్కువ ఫ్లాట్లు ఉంటే సెల్లార్‌ 2 పార్కింగ్‌కు కేటాయిస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను ప్రత్యేకంగా ఒక సంస్థ చూసుకుంటుంది కాబట్టి సమస్య లేదు. ఎటొచ్చి తక్కువ విస్తీర్ణంలో అందునా లోతట్టు ప్రాంతాల్లో కడుతున్న సెల్లార్లు మునిగే ప్రమాదాలు ఉన్నాయి. రహదారి వరకు నిర్మిస్తున్న సెల్లార్‌ ర్యాంపుతో ముంపు ఎక్కువ. కొనేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. సొంతంగా కట్టుకునేవారు సైతం ఇటీవల ఈ పొరపాటు చేస్తున్నారు. స్థలం కలిసి వస్తుందని రహదారి పై వరకు చొచ్చుకువస్తున్నారు.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో బిల్టప్‌ ఏరియాలో పార్కింగ్‌కు 33 శాతం కేటాయించాలి. నివాసితుల కోసం 30 శాతం, సందర్శకుల కోసం మరో 3 శాతం. గతంలో పంచాయతీల పరిధిలో పార్కింగ్‌కు మినహాయింపులు ఉండేవి కావు. జీ+2,3 అంతస్తులు నిర్మించేవారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ వదిలితే ఫ్లాట్లు తగ్గుతాయి కాబట్టి అనధికారికంగా సెల్లార్లు నిర్మించేవారు. వీటిలో కొనేటప్పుడు జాగ్రత్త.


జాగ్రత్తలతోనే కడుతున్నారు..  

2000 సంవత్సరంలో భారీవర్షాలతో తలెత్తిన ఇబ్బందులతో చాలా వరకు అపార్ట్‌మెంట్లలోని సెల్లార్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని హోటళ్లు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్స్‌ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రెండు సెల్లార్లు ఉంటే ఒకదానిని వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. రహదారి మార్గాలకు ముందస్తు భద్రతా ఏర్పాట్ల ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు సూచించారు.
* నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ముందుగానే పక్కకు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలి
* లిఫ్ట్‌లు, విద్యుత్‌మోటార్లు, స్విచ్‌బోర్డులు, ప్యానెల్‌ బోర్డులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అమర్చాలి
* రెండు, మూడు సెల్లార్లున్న భవనాల్లో పైఅంతస్తులో ఎలక్ట్రానిక్‌ పరికరాలు అమర్చాలి.
* ఒక్కటే సెల్లార్‌ ఉంటే విద్యుత్‌ పరికరాల అమరికలో నిబంధనలు పాటించాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని