అనుకూలతలే ఎక్కువ

కొవిడ్‌ పరిస్థితుల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ గృహ నిర్మాణ మార్కెట్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. శ్రావణమాసం రావడంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. కొన్ని విభాగాల్లో అసాధారణ వృద్ధి కనిపించిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు, వ్యాపారసంస్థలకు ఇప్పటికీ హైదరాబాద్‌ ఆకర్షణీయ కేంద్రంగా ఉండటం

Published : 14 Aug 2021 01:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ పరిస్థితుల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ గృహ నిర్మాణ మార్కెట్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. శ్రావణమాసం రావడంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. కొన్ని విభాగాల్లో అసాధారణ వృద్ధి కనిపించిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు, వ్యాపారసంస్థలకు ఇప్పటికీ హైదరాబాద్‌ ఆకర్షణీయ కేంద్రంగా ఉండటం.. రాష్ట్రంలో సులభతర వ్యాపార అవకాశాలతో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారు. పెట్టుబడులు తదనంతర ఉపాధి కల్పన అవకాశాలతో నగరంలో గృహ, వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగంలో డిమాండ్‌ వృద్ధి చెందడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. నగరంలో కొత్తగా చేపట్టిన మౌలిక ప్రాజెక్టులు, సిటీ విస్తరిస్తున్న తీరు.. ఉపాధి వలసలు.. నగరానికి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా మున్ముందు మరింత అభివృద్ధి చెందబోతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇక్కడ స్థిరాస్తుల ధరలు 30 నుంచి 40 శాతం వృద్ధి చెందే అవకాశాలు కన్పిస్తున్నాయని క్రెడాయ్‌ వర్గాలు అంటున్నాయి.

గృహ నిర్మాణంలో..

ఇళ్లకు డిమాండ్‌ పరంగా రికార్డు స్థాయిలో వృద్ధి కనబడింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 2021 ప్రథమార్థంలో ఇళ్ల నిర్మాణంతోపాటు విక్రయాలు పెరిగాయి. వార్షిక వృద్ధి 150 శాతం వరకు ఉంది. 63 శాతం విక్రయాలు పశ్చిమ హైదరాబాద్‌లోనే నమోదవడం గమనార్హం.
* ధరల పరంగా చూస్తే అన్ని విభాగాల్లోనూ డిమాండ్‌ కన్పించింది. రూ.25 లక్షలు నుంచి 50 లక్షల విభాగంలో 240 శాతం వార్షిక వృద్ధి కనబడింది. కోటి నుంచి రెండుకోట్ల మధ్య ధరలున్న ఇళ్ల విక్రయాల్లోనూ 158 శాతం వృద్ధి నమోదైంది.
* కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రథమార్థంలో 278 శాతం పెరిగాయి. గృహ నిర్మాణాలకున్న డిమాండ్‌కు ఇది అద్దం పడుతోంది. ఎప్పటిలాగే పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వృద్ధి శాతం 312గా ఉంది.
* కొవిడ్‌తో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటం, పిల్లలు తరగతులు వింటుండటంతో విశాలమైన ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో కోటి నుంచి రెండు కోట్ల ధరల మధ్య ఉన్న ఇళ్ల వాటా మొత్తం ప్రాజెక్టుల్లో 18 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. గత ఏడాది ద్వితీయార్థంలో 1544 ఇళ్లను ప్రారంభించగా.. ఈ ఏడాది ప్రథమార్థంలో ఈ సంఖ్య 4444కు పెరిగింది.
* ఇంటి ధరలు స్థిరంగా వృద్ధి చెందుతూ వస్తున్నాయి. 2018లో సగటు చదరపు అడుగు ధర రూ.4వేలు ఉండగా.. 2020లో సగటు ధర రూ.4750కి పెరిగింది.

కార్యాలయాలకు..

ఏ గ్రేడ్‌ కార్యాలయాలకు మాత్రం డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి.
* 2016 నుంచి ఈ ఏడాది ప్రథమార్థం వరకు ఏ గ్రేడ్‌ కార్యాలయాలకు డిమాండ్‌ 1.7 రెట్లు పెరిగింది. 77 మిలియన్‌ చదరపు అడుగులకు నిర్మాణాలు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌ వాటా 2016లో 9 శాతం ఉండగా.. 2021 నాటికి 12 శాతానికి పెరిగింది.
* వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ పరంగా చూస్తే దేశంలోనే హైదరాబాద్‌ అతిపెద్ద నాలుగో నగరంగా నిల్చింది.
* క్వాల్‌కామ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు 1.6 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఇక్కడ లీజుకు తీసుకున్నాయి. 2022 నుంచి కార్యకలాపాలు మొదలుకానున్నాయి.
* గోల్డ్‌మన్‌ సాచ్స్‌ సంస్థ తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. ఇక్కడ 2023 నాటికి 2500 మంది వరకు ఇందులో ఉపాధి లభించనుంది.
* ఎఫ్‌సీఏ గ్రూప్‌ ఇక్కడ గ్లోబల్‌ టెక్నాలజీ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. వెయ్యికోట్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ఏడాది ఆఖరు నాటికి కొత్తగా వెయ్యి మందికి అవకాశాలు లభించనున్నాయి.
* వెల్స్‌ఫాల్గో 1.2 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యాలయాలను విస్తరిస్తోంది.
* కార్యాలయ నిర్మాణాల్లో 2019లో హైదరాబాద్‌ మార్కెట్‌ తొలిసారిగా కోటి చదరపు అడుగుల మైలురాయిని అధిగమించింది. ఆ సంవత్సరంలో 10.5 మిలియన్‌ చదరపు అడుగుల్లో లీజులు పూర్తయ్యాయి.

నగరానికి అన్నివైపులా..

* ఐటీ, ఐటీ ఆధారిత రంగాలపై దృష్టి సారించడంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో సిటీకి అన్నివైపులా వేర్వేరు కారిడార్లు ఏర్పాటవుతున్నాయి.
*పశ్చిమ హైదరాబాద్‌ నుంచి ఐటీ రంగాన్ని సిటీ అన్నివైపులా విస్తరించేలా వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ పార్కులకు సర్కారు కసరత్తు చేస్తోంది.
* నగరం చుట్టుపక్కల టీఎస్‌ఐఐసీ 10 నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 810 ఎకరాలను 453 పరిశ్రమలకు కేటాయించింది. ఆయా సంస్థలు రూ.6వేల కోట్ల వరకు వీటిల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి.
* విద్యుత్తు వాహనాల పాలసీని ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా సర్కారు నిర్దేశించుకుంది. తద్వారా పదేళ్లలో 1.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వస్తోంది.
* లైఫ్‌ సైన్సెస్‌లో విభాగంలోనూ 311 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి విలువ సుమారు రూ.6700 కోట్ల వరకు ఉంది. వీటితో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు వాణిజ్య, గృహ నిర్మాణాలకు డిమాండ్‌ పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని