Updated : 04 Dec 2021 04:31 IST

ఉత్సాహంగా.. విల్లాసంగా!

ప్రశాంత జీవనానికే ప్రాధాన్యం

భద్రతా ఏర్పాట్లు.. ఆధునికతకు నిర్మాణదారుల పెద్దపీట

ఈనాడు, హైదరాబాద్‌

శివార్లలోని విల్లా ప్రాజెక్టులకు ఆదరణ పెరిగింది. రవాణా సదుపాయాలు సక్రమంగా ఉండవని ఇన్నాళ్లు వెనుకాడినవారే.. ఇప్పుడు వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. కొవిడ్‌ తర్వాత విల్లాలకు పెరిగిన డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులతో ముందుకొస్తున్నాయి. అవుటర్‌ రింగురోడ్డు కేంద్రంగా విల్లాల జోరు కొనసాగుతోంది. ఇంటి కొనుగోలుదారుల ప్రాథమ్యాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నివాసాల్లో ఉండేవారు ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నారు. వీరందరినీ విల్లాలు ఆకర్షిస్తున్నాయి. అధికాదాయ వర్గాలు రెండో ఇల్లుగా, మరి కొందరు పెట్టుబడి కోణంలో వీటిని కొనుగోలు చేస్తుంటే, ఇంకొందరు ముందుచూపుతో నగరంలో ఫ్లాట్‌ను విక్రయించి శివారులోని విల్లాలకు మారిపోతున్నారు. ప్రవాస భారతీయులు భవిష్యత్తు దృష్ట్యా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇతర నగరాలకు చెందినవారు సైతం విల్లాలే కావాలంటున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంత జీవనం కొనసాగించేందుకు వీటివైపు చూస్తున్నారు.

హైదరాబాద్‌ నగరం ప్రస్తుతం అవుటర్‌ రింగురోడ్డు వరకు విస్తరించింది. అవుటర్‌ నుంచి సిటీకి అనుసంధానం మెరుగయ్యింది. గతంలో కంటే రహదారుల పరిస్థితి మెరుగుపడింది. కొత్త లింకురోడ్లు వచ్చాయి. మరి కొన్ని కొత్తగా వేస్తున్నారు. ఒకప్పుడు దూరం అనుకుని అవకాశం చేజార్చుకున్న ప్రాజెక్టులే, ఇప్పుడు అభివృద్ధి మధ్యలో కనిపిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు వెనకాడటం లేదు. నగరంలో ఏ మూలన కొనుగోలు చేసినా మరో మూలకు వేగంగా చేరుకునే సౌలభ్యం ఉండటం, క్యాబ్‌లు అందుబాటులోకి రావడం వంటి అంశాలతో విల్లాల్లో నివసించేవారు దూరమైనా లెక్కచేయడం లేదు. సొంత వాహనాలతో సిటీలోని ముఖ్య ప్రాంతాలకు అర గంటలోపే చేరుకునే అవకాశం ఉండటంతో వీటిల్లో నివాసానికి సై అంటున్నారు. సౌకర్యాలతో పాటు భద్రతకు ఢోకా ఉండదని మొగ్గుచూపుతున్నారు.

అహ్లాదంగా గడిపేందుకు

పచ్చని వనాలు.. గీత గీసినట్లు ఉండే రహదారులు, వ్యాయామం చేసేందుకు జాకింగ్‌ ట్రాక్‌.. వేసవిలో సేదతీరేందుకు ఈత కొలను.. వారాంతాల్లో ఆడేందుకు ఆట స్థలాలు, విందులు, వేడుకలకు వేదికలు.. అన్నింటికి మించి పిల్లలు పెద్దలకు తోడు, రక్షణ.. అత్యవసర వైద్యసేవలు.. ఇలాంటి సకల సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం విల్లాల్లో కనిపిస్తుండటంతో అధికాదాయ వర్గాలు ఇక్కడ ఇల్లు ఉండాలని కోరుకుంటున్నాయి.

భద్రతకు పెద్దపీట

విల్లా ప్రాజెక్టుల్లో నిర్మాణ సంస్థలు భద్రతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాయి. అత్యాధునిక రక్షణ వ్యవస్థను, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను సమాచారం కోసం ఉపయోగిస్తున్నాయి. చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌ ఉంటుంది. అపరిచిత వ్యక్తులు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండదు. సంబంధిత విల్లా నుంచి సెక్యూరిటీకి సమాచారమిస్తేనే తప్ప ప్రవేశం కష్టం. అందుకే ఇక్కడ భరోసాతో నివసిస్తుంటారు. పట్నం సౌకర్యాలతో ఉన్న ఆధునిక పల్లెగా చెప్పుకొనే విల్లాలో చిన్నారులు స్వేచ్ఛగా ఇంటి ముంగిట విహరిస్తూ బాల్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

మనదనే భావన

అపార్టుమెంట్లలో ఇరుకిరుకు.. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నప్పుడు ఇల్లు చాలడం లేదనే భావన. బహుళ అంతస్తుల సముదాయాల్లో తల్లిదండ్రులు ఒంటరితనంగా అనిపించడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలు విల్లాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఎవరి స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడింది. ముఖ్యంగా పెద్దవాళ్లకు చక్కటి కాలక్షేపం లభిస్తుండటం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది. ప్రాథమిక వైద్యసేవలు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. అన్నింటికి మించి స్థలం, అందులో ఇల్లు మనదనే భావనతో వీటిని కొనేందుకు పెద్దగా ఆలోచించడం లేదు.


మూడు రకాలు

ప్రస్తుతం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మూడు రకాల విల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి.

* ఎక్కువ విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా విల్లాలు కడుతున్నారు. 500 గజాలు మొదలు ఎకరా విస్తీర్ణంలో వీటిని చేపడుతున్నారు. సౌకర్యాలతో పాటూ హంగులు ఎక్కువే. విశాలమైన గోల్ఫ్‌ మైదానాలు, క్రికెట్‌ మైదానాలు వీటిలో ఉంటున్నాయి. వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. కొన్నింటిని ఆహ్వానం ఉన్నవారికే విక్రయిస్తున్నారు. ఇవి సిటీకి కాస్త దూరంగా ఉంటున్నాయి.
* విశాలమైన ఇల్లు, అక్కడ నివాసం ఉండటానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రాజెక్టులు రెండో రకం. ఇవి కూడా విలాసంగానే ఉంటాయి. ఆట స్థలాలు, ఇండోర్‌ స్టేడియం, క్లబ్‌హౌస్‌, ఈత కొలను, రెస్టారెంట్‌, అతిథి గదులు, సమావేశ గదులు, మూడంచెల భద్రత వంటి సకల సౌకర్యాలు ఉంటున్నాయి. 150 గజాలు మొదలు 500 గజాల విస్తీర్ణంలో కడుతున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ విల్లాలు కడుతున్నారు. ఖాళీ స్థలం ఎక్కువగా వదులుతున్నారు. ప్రవాస భారతీయులు, ఐటీలో ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా అవుటర్‌కు అటుఇటుగా నిర్మాణంలో ఉన్నాయి.
* ఇటీవల ఎక్కువగా కడుతున్న విల్లాల ప్రాజెక్టుల్లో మూడో రకం వస్తుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ విల్లాలు కడుతున్నారు. వంద గజాల విస్తీర్ణం నుంచి మొదలవుతున్నాయి. ఎక్కువగా రెండు అంతస్తుల్లో వీటిని కడుతున్నారు. హంగులు తక్కువ. కావాల్సిన ముఖ్యమైన కొన్ని సౌకర్యాలు మాత్రమే వీటిలో ఏర్పాటు చేస్తున్నారు.


ఎక్కడెక్కడ కడుతున్నారంటే..?

నగర శివార్లలో అవుటర్‌ రింగ్‌రోడ్డు లోపల, బయట కేంద్రంగా ఎక్కువగా ఇవి అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్‌ వైపు బడ్జెట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కోరుకునే వారికి ఇటువైపు అనుకూలంగా ఉంది. ఐటీ కారిడార్‌కు అరగంటలోనే చేరుకునే అవకాశం ఉండటంతో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా  ఆసక్తి చూపుతున్నారు.

* పటాన్‌చెరు, సంగారెడ్డి, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఘట్‌కేసర్‌ మార్గాల్లోనూ విల్లాల నిర్మాణాలు ఉన్నాయి. వీటిల్లో  జి+1, జి+2 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఎక్కువగా 4 పడక గదుల నిర్మాణాలు చేపడుతున్నారు. 3 పడక గదుల విల్లాలు ఉన్నాయి. నిర్మించే విస్తీర్ణాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts