2 వేల అపార్ట్‌మెంట్లు.. 38 వేల ఇళ్లు

నిర్మాణంలో ఉండగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త సంవత్సరంలో చాలా అపార్ట్‌మెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అనుమతులు పొందిన ఈ ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉన్నాయి. కొన్ని పనులు ప్రారంభించగా..

Updated : 04 Jan 2020 02:12 IST

పూర్తయ్యేందుకు రెండుమూడేళ్లు
నిర్మాణంలో ఉండగా కొనాలనుకునే వారికి పలు అవకాశాలు
ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణంలో ఉండగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త సంవత్సరంలో చాలా అపార్ట్‌మెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అనుమతులు పొందిన ఈ ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉన్నాయి. కొన్ని పనులు ప్రారంభించగా.. మరికొన్ని ఈ సంవత్సరంలో మొదలెట్టనున్నాయి. ఈ రెండు మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకునే బహుళ అంతస్తుల నివాస సముదాయాలు ఏకంగా 2వేల వరకు ఉన్నాయి. వీటిలో ఐదు అంతస్తులపైన నిర్మించే అపార్ట్‌మెంట్లు ఆరువందల వరకు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు 38 వేల ఫ్లాట్లు రాబోతున్నాయి.

కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ ఉన్నా గత ఏడాది హైదరాబాద్‌ మార్కెట్లో ఆ మేరకు సరఫరా లేదని పరిశ్రమ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, రెరా, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కారణంగా సందిగ్ధతతో గత రెండేళ్లలో కొత్త ప్రాజెక్ట్‌లు పెద్దగా రాలేదు. అంతక్రితం మొదలెట్టిన నిర్మాణాలన్నీ గత ఏడాది పూర్తికావడంతో వాటిలో ఎక్కువమంది కొనుగోలు చేశారు. గతంలో అమ్ముడుపోకుండా మిగిలిన ఇళ్లు సైతం కిందటేడాది విక్రయం అయ్యాయి. గతేడాది అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని ఈ ఏడాది చాలా సంస్థలు దశలవారీగా నిర్మాణాల పూర్తికి ప్రణాళికలు రూపొందించుకున్నాయి. చ.అ. రూ.2500 మొదలు రూ.12వేల వరకు ఉన్నాయి.

7 కోట్ల చ.అ. విస్తీర్ణంలో..: నిర్మాణ సంస్థలు ఈ రెండు మూడేళ్లలో 7 కోట్ల చ. అ.విస్తీర్ణంలో నివాస సముదాయాలను కట్టబోతున్నాయి. వీటిలో సగటు ఫ్లాటు విస్తీర్ణం 1800 చ.అ. వరకు ఉంది. తక్కువలో తక్కువ వెయ్యి చ.అ.ల నుంచి 7700 చ.అ. వరకు ఒక్కో ఫ్లాట్‌ ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఐదు అంతస్తుల లోపు ఉండేవాటిలో 2 పడకల గదుల నిర్మాణం ఎక్కువగా ఉండగా.. ఆపై భవనాల్లో 3 పడకల గదుల ఫ్లాట్లు ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఐటీ కేంద్రం చుట్టుపక్కల భారీ డిమాండ్‌ ఉంది.

ఆకాశ హర్మ్యాలు వస్తున్న ప్రాంతాలివీ..
* గోపన్‌పల్లిలో 30 అంతస్తుల్లో 6 అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. 1216 ఫ్లాట్లు ఇక్కడ రానున్నాయి.
* కొత్తగూడలో రెండు అపార్ట్‌మెంట్లు ఒక్కోటి 24 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడ 946 ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి.
* నల్లగండ్లలో 22 అంతస్తులు ఉండే 4 అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. వీటిలో 612 ఫ్లాట్లు నిర్మించనున్నారు.
* కొండాపూర్‌లో 20 అంతస్తుల అపార్ట్‌మెంట్లు నాలుగు, 18 అంతస్తుల బ్లాక్‌లు మరో 4 వస్తున్నాయి.వేర్వేరు సంస్థలకు చెందిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో 800 ఇళ్లు ఉంటాయి.
* షేక్‌పేటలో 20 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 78 ఫ్లాట్లు సిద్ధమవుతాయి.
* శేరిలింగంపల్లిలో 14 అంతస్తుల్లో ఐదు బ్లాక్‌లు నిర్మిస్తున్నారు. ఇక్కడ 522 ఫ్లాట్లు రానున్నాయి.
* చందానగర్‌లో 10 అంతస్తుల్లో 5 బ్లాక్‌లు కడుతున్నారు.వీటిలో 518 ఫ్లాట్లు ఉంటాయి.
* యాప్రాల్‌లో 8 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ 3 బ్లాక్‌లలో 317 యూనిట్లు రాబోతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు