అందుబాటు ఇళ్లు ఎక్కడ..!

నగరంలో ఇళ్ల ధరలు క్రమంగా అందకుండా పోతున్నాయా? అవుననే అంటున్నాయి స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థల అధ్యయనాలు. రూ.40 లక్షల లోపు నివాసాలను కడుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఆఖరున ఉంది. గత ఏడాది కేవలం 14 శాతం ఇళ్లు మాత్రమే ఇక్కడ

Updated : 15 Feb 2020 01:59 IST

నగరంలో ఇళ్ల ధరలు క్రమంగా అందకుండా పోతున్నాయా? అవుననే అంటున్నాయి స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థల అధ్యయనాలు. రూ.40 లక్షల లోపు నివాసాలను కడుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఆఖరున ఉంది. గత ఏడాది కేవలం 14 శాతం ఇళ్లు మాత్రమే ఇక్కడ ఈ విభాగంలో కట్టారు. గత ఐదేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే అత్యధికంగా 32 శాతం వరకు వెళ్లారు.  ఇతర నగరాల్లో అందుబాటు ఇళ్ల నిర్మాణ శాతం అత్యధికంగా 50 శాతం వరకు ఉంది.

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలోని ప్రముఖ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువ.. పదేపదే వినిపించే మాట ఇది. అందుబాటు ధరలు కావడంతో ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో ఎక్కువ మంది ఇళ్లు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెప్పేవి. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ప్రధానంగా కొనుగోలు చేసేవి ఎక్కువ ధరల ఇళ్లు. ఆయా నగరాలో పోలిస్తే వారికి ఇక్కడ ఇంటి ధరలు తక్కువ కావడంతో ఇక్కడ సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నారు. పేరున్న నిర్మాణ సంస్థలన్నీ ఈ విభాగంలోనే అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాయి. అందుబాటు ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లో లాభాలపై పన్ను మినహాయింపు, ఒక శాతం జీఎస్‌టీ వంటి కేంద్ర ప్రోత్సాహకాలతో దిల్లీతో సహా అన్ని నగరాలు ఈ విభాగంలో ఇళ్లను నిర్మిస్తుంటే మన దగ్గర మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడిప్పుడు కొందరు ముందుకొస్తున్నా.. స్థానికుల ఇళ్ల అవసరాలను అవి తీర్చడం లేదు. 2019 సంవత్సరానికి అనరాక్‌ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం..
ఎక్కువగా కట్టే ఇళ్లు ఏవంటే..
* ఇంటి ధరల ఆధారంగా ఐదు విభాగాల శ్రేణిలో నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లను విభజించారు. హైదరాబాద్‌లో రూ.40 లక్షల లోపు ఇళ్లు కేవలం 14 శాతమే గత ఏడాది కట్టారు. మిగతా అన్ని నగరాల్లో 30 శాతంపైనే ఉన్నాయి. కోల్‌కతాలో 50 శాతం అంటే సగం ఇళ్లు ఈ ధరల శ్రేణిలోనే నిర్మాణం చేపట్టారు. దిల్లీ రాజధాని ప్రాంతంలో 47 శాతం, పుణెలో 44, ముంబయిలో 43, చెన్నైలో 39, బెంగళూరులో 30 శాతం అందుబాటు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.  
* రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల లోపు ఇళ్లు హైదరాబాద్‌లో ఎక్కువగా నిర్మాణం చేపడుతున్నారు. ‘మిడ్‌ ఎండ్‌’ ఇళ్ల వాటా అత్యధికంగా 33 శాతం ఉంది. ప్రతి మూడింటిలో ఒక ఇల్లు ఈ ధరల శ్రేణిలోనే కడుతున్నారు. 

* రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర లక్షల లోపు వ్యయం చేసే ఇళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీటి వాటా 30 శాతం ఉంది. బడా సంస్థలన్నీ ఈ ‘హై ఎండ్‌’ ధరల్లోనే ఇళ్లను కడుతున్నాయి.

* రూ.కోటిన్నర నుంచి రూ.రెండున్నర కోట్ల లోపు విలువ చేసే ‘లగ్జరీ’ ఇళ్ల నిర్మాణాలు 13 శాతం ఉండగా..  రూ.రెండున్నర కోట్లపైన విలువ చేసే ‘అల్ట్రా లగ్జరీ’ ఇళ్లు 10 శాతం వరకు ఉంటున్నాయి.
గత ఐదేళ్లలో చూస్తే..
* రూ.40 లక్షల లోపు ఇళ్ల సరఫరాను సంవత్సరాల వారీగా చూస్తే గత ఐదేళ్లలో 2017లో ఒక్కసారి మాత్రమే అత్యధికంగా 32 శాతం సరఫరా ఉంది. మిగతా నాలుగేళ్లలో అందుబాటు ఇళ్ల సరఫరా వాటా 15 శాతం లోపే. 

* 2015, 2016లో అత్యల్పంగా 14 శాతం సరఫరా ఉండగా 2017లో ఏకంగా 32 శాతానికి పెరిగి మరుసటి సంవత్సరం 2018లో 15 శాతానికి పడిపోయింది. గత ఏడాది 14 శాతానికే సామాన్యుల ఇళ్లు సరఫరా పరిమితమైంది.

డిమాండ్‌కు తగ్గట్టుగా..
మిడ్‌ ఎండ్‌, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల నిర్మాణం వాటానే దాదాపు 53 శాతంగా ఉండడం నిర్మాణదారుల ప్రాధాన్యత చెప్పకనే చెబుతోంది. ఇక్కడ ఎక్కువగా మూడు పడకల గదుల ఇళ్లకు డిమాండ్‌ ఉండటం.. అత్యధిక శాతం నిర్మాణాలు హైదరాబాద్‌ పశ్చిమం వైపునకే పరిమితం కావడంతో ఎగువ మధ్యశ్రేణి విభాగం నుంచి నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని ఓ నిర్మాణదారు అన్నారు.
మౌలిక వసతుల లేమితో..
- సతీష్‌ మారం, కార్యనిర్వాహక సభ్యులు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

అందుబాటు ధరల్లో ఇళ్లు కట్టాలంటే నగరానికి దూరంగా వెళ్లాలి. అక్కడ సరైన రవాణా, ఉపాధి, పిల్లలకు పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక వసతులు లేకపోతే కొనడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రభుత్వం ఉపాధి, మౌలిక వసతులు కల్పిస్తే ఎక్కువమంది ఈ ధరల శ్రేణిలో కట్టడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సౌకర్యాలన్నీ ఉన్నచోట రూ.40 లక్షల లోపు కట్టేందుకు భూములు అందుబాటులో లేవు. దీంతో నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల ఆదాయం వచ్చేవారు కూడా ఇల్లు కొనడం కష్టమవుతోంది. మా కంపెనీ తరఫున ఈ విభాగంలో 700 ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌ చేపట్టబోతున్నాం. కట్టిన తర్వాత కొనవారే లేకపోతే కష్టమవుతుంది. ఈ రెండూ చూసుకోవాలి. ఆ మేరకు మార్కెట్‌పై అధ్యయనం చేస్తున్నాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని