శుభమస్తు.. గృహమస్తు!

కొత్త సంవత్సరంలో స్థిరాస్తి రంగం ఎలా ఉండబోతుంది? మార్కెట్‌ సాధారణ స్థితికి వచ్చేందుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? భూముల ధరల్లో దిద్దుబాటు ఉంటుందా?

Published : 02 Jan 2021 02:42 IST

కొత్త సంవత్సరంలో స్థిరాస్తి రంగం ఎలా ఉండబోతుంది? మార్కెట్‌ సాధారణ స్థితికి వచ్చేందుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? భూముల ధరల్లో దిద్దుబాటు ఉంటుందా? ఇంటి ధరలు ఎలా ఉండబోతున్నాయి? కొత్త ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయమని నిర్మాణదారులు ఎందుకంటున్నారు?

రియల్‌ ఎస్టేట్‌ గత సంవత్సరం భారీ కుదుపులకు గురైంది. కొవిడ్‌తో తొలి త్రైమాసికంలో విక్రయాలు మందగించగా.. ఏప్రిల్‌, మే నెలల్లో లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిపోయాయి. ఆ తర్వాత  పూర్తి స్థాయిలో పనులు మొదలు కావడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది. ఆటంకాలను అధిగమించి స్థిరాస్తి లావాదేవీలు పుంజుకుంటున్న దశలో ధరణి, ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం సెప్టెంబరులో రిజిస్ట్రేషన్లు ఆపేయడంతో పెద్ద దెబ్బ తగిలిందని స్థిరాస్తి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మూడు నెలలకుపైగా(డిసెంబరు 15) వరకు కొనుగోళ్లు లేక మార్కెట్లో నిధుల లభ్యత తగ్గిపోయింది. క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. డిసెంబరు ఆఖరులో పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు మొదలెట్టాక పరిస్థితి కుదుటపడింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్లాట్లపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో మార్కెట్‌లో జోష్‌ నెలకొంది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా గతంలో రిజిస్ట్రేషనై ఉంటే వాటిని కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అని సర్కారు చెప్పడంతో ఎక్కువ మందికి ఊరటనిచ్చింది. వాస్తవంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఎక్కువ లావాదేవీలు స్థలాల క్రయ విక్రయాలే. అడ్డంకులు తొలగిపోవడంతో 2021లో పూర్వస్థితికి వచ్చే అవకాశం ఉందని రియల్టర్లు అంటున్నారు.
తక్కువ వడ్డీరేట్లు..
గత ఏడాది వాయిదా పడిన ప్రాజెక్టులు ఒక్కోటిగా ప్రారంభం అవుతున్నాయి. అందుబాటు ధరల్లో ఇళ్ల ప్రాజెక్ట్‌లు సిటీ చుట్టు పెద్ద ఎత్తున రాబోతున్నాయి.   బడ్జెట్‌ను బట్టి సాధారణ అపార్ట్‌మెంట్ల నుంచి విలాసవంతమైన విల్లాల వరకు నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయి. గృహరుణ వడ్డీరేట్లు సైతం గతంలో ఎన్నడు లేనంత తక్కువగా ఉన్నాయి. 6.95 శాతానికే గృహరుణాలు ఇస్తున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద వడ్డీరేటులో రాయితీలు సైతం ఉన్నాయి.


కొనేందుకు ఇది సరైన సమయం
- సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

భూముల ధరలు పెరిగినా ఇప్పటికీ హైదరాబాద్‌లో, చుట్టుపక్కల జిల్లాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కొవిడ్‌తో గత ఏడాది ప్రాజెక్టుల ప్రారంభాలు వాయిదాపడ్డాయి. ఇప్పుడు ప్రారంభిస్తున్నా.. పూర్తయ్యేందుకు రెండు మూడేళ్లు పడుతుంది. పూర్తయిన వాటిలో లభ్యత తక్కువగా ఉంది. వీటన్నింటితో 2021లో ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇంటి నుంచి పని చేస్తుండటంతో.. చిన్న ఇళ్ల నుంచి పెద్ద గృహాలకు మారుతున్నారు. ఇప్పుడే ఇళ్లు కొనేందుకు సరైన సమయం. కొవిడ్‌తో కంపెనీలు పూర్తి స్థాయిలో నడవకపోవడంతో స్టీలు ధరలు పెరుగుతున్నాయి. లాబీయింగ్‌తో సిమెంట్‌ ధరలు పెరిగే ఉన్నాయి. కొత్త వాటిలో ఇప్పుడిస్తున్న ధరల కంటే ఎక్కువే ఉంటాయి. బడ్జెట్‌లో ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకోవడం మేలు.


మౌలిక వసతుల కల్పనతో..

-ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా

కొత్త సంవత్సరంలో స్థిరాస్తి మార్కెట్‌ బాగుంటుంది. క్రయ విక్రయాలు పెరుగుతాయి. గత ఏడాది నిలిచిపోయిన లావాదేవీలు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక ఇల్లు ఉన్నా చేతిలో ఉన్న సొమ్ముతో స్టాక్‌ మార్కెట్‌లో కంటే స్థిరాస్తులపై పెట్టడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎకానమీ ఇండికేటర్లు సానుకూలంగా ఉన్నాయి. హైదరాబాద్‌కు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఫార్మారంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటంతో రెంటల్‌ మార్కెట్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇంటి నుంచి పనిని కాస్త హైదరాబాద్‌ నుంచి పనిగా మార్చుకోగల్గాలి. భూముల ధరలు అనూహ్యంగా పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రహదారుల వంటి మౌలిక వసతులు మెరుగుపరిస్తే నగరం విస్తరిస్తుంది.   ప్రభుత్వం ప్రకటించిన ఐటీ గ్రిడ్‌ విధానాన్ని అమలు చేయాలి.


తొలి త్రైమాసికం నాటికి సాధారణం
- పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

కొవిడ్‌ టీకా వస్తే ప్రజలకు ధైర్యం వస్తుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగిసే నాటికి మార్కెట్‌ సాధారణ స్థితికి వస్తుందని అంచనా.   కొవిడ్‌ అనంతరం మిగతా నగరాల కంటే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వేగంగా కోలుకుంది. దాదాపుగా సాధారణ పరిస్థితికి వస్తున్న దశలో రిజిస్ట్రేషన్ల నిలుపుదలతో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడివన్నీ తొలగిపోయాయి. ఇంటి ధరల విషయానికి వస్తే.. టన్ను స్టీల్‌ ధర రూ.40 వేల నుంచి రూ.56 వేలకు పెరిగింది. సిమెంట్‌ ధరలు పెరిగాయి. వీటితో చదరపు అడుగుపై రూ.300 వరకు పెరిగింది. ఈ ధరలేవి మన నియంత్రణలో లేవు. ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గరే తక్కువ ధరలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని