ఇంటిపై గుడినీడ పడకూడదా? 

వాస్తురీత్యా గుడినీడ ఇంటిపై పడకూడదు అంటారు. నీడ పడితే ఇళ్లలో నివసించే వారిపై ప్రభావం చూపుతుందని.. నీడ పడనంత దూరంగా ఇళ్లు ఉండాలని అంటారు. ధ్వజ స్తంభం నీడ ఇంటిపై పడితే కీడు చేస్తుందా..?

Updated : 30 Mar 2019 01:55 IST

ఈనాడు, హైదరాబాద్‌

వాస్తురీత్యా గుడినీడ ఇంటిపై పడకూడదు అంటారు. నీడ పడితే ఇళ్లలో నివసించే వారిపై ప్రభావం చూపుతుందని.. నీడ పడనంత దూరంగా ఇళ్లు ఉండాలని అంటారు. ధ్వజ స్తంభం నీడ ఇంటిపై పడితే కీడు చేస్తుందా..?

మూఢ నమ్మకంగా అనిపించినా దీని వెనక శాస్త్రీయ దృక్పథం ఉంది. సమాజానికి సంబంధించిన ప్రతి అంశానికి ఓ శాస్త్రం ఉంది. అదే విధంగా ఆలయాలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. ఆయా దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు యజ్ఞాలు, హోమాలు, పూజలు చేస్తారు. మూల విరాట్టును ప్రతిష్ఠించే సమయంలో గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. ఆ మందిరాలలో యంత్రం బలంతో పాటూ మంత్రబలం కూడా చేరుస్తారు. ఆ తర్వాత అనునిత్యం సమాజ శ్రేయస్సు కోరి అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుపుతారు. ప్రజలు ధర్మబద్ధమైన, నీతివంతమైన జీవితాలు గడిపేందుకు, మడి ఆచార వ్యవహారాలు పాటించడానికి నియమాలు..నిబంధనలు రూపొందించి పవిత్రతను చేకూర్చారు. ఏటా దేవతలకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పర్వదినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను, అధ్యాత్మిక ప్రచవనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో ఆయా దేవతా విగ్రహాలను మాడ వీధులలో భక్తులు వెంటరాగా ఊరేగింపు జరుపుతారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉండేందుకు ఆలయాలకు దగ్గరగా నివాసాలు ఉండకూడదనేది ఒక కారణం. దేవాలయ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే పూర్వకాలంలో వాటిని ఊరికి దూరంగా నిర్మించేవారు. కాలక్రమంలో జనాభా పెరగడం తదనుగుణంగా ఇళ్లు విస్తరించడంతో దేవాలయాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. మరో కారణం నివాస ప్రాంతాల్లో జనన మరణాలు సహజం.. అలాంటప్పుడు దేవాలయాల పవిత్రతకు భంగం కలగడానికి అవకాశం ఉంది. కేవలం ఒకరి వల్ల సమాజానికి కీడు కలగకూడదనే పరమార్ధం కూడా ఇందులో దాగి ఉంది.

దేవతా మూర్తుల ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో ఎన్నో శక్తుల్ని స్వామివారు, అమ్మవారి విగ్రహంలోకి ఆహ్వానిస్తారు. దీనికి శక్తివంతమైన యంత్రబలం, మంత్రబలం తోడవుతుంది. మనకు తెలియని బలీయమైన శక్తి ఏర్పడుతుంది. దీనిని తట్టుకోవడం సాధ్యం కాదు. ఆ ప్రభావం ఆయా దేవాలయాల చుట్టూ ప్రసరిస్తుంది. ఇలాంటి ఎన్నో కారణాలతో ఆలయాలకు దగ్గరగా నివాసాలు నిషిద్ధం అన్నారు.

ధ్వజస్తంభం ఉన్న దేవాలయాలకు ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సమాజ శ్రేయస్సుతోపాటూ ప్రజలలో భక్తి ప్రవృత్తులు పెంచడానికి, ఆలయ పవిత్రతను కాపాడడంలో భక్తుల విశ్వాసం సడలకూడదనే సంకల్పం కూడా ఉందని గమనించాలి. మనిషి ఎప్పుడైతే శాస్త్ర నియమాలు గౌరవిస్తూ ఆచరిస్తాడో వారికి ఆరోగ్యం కలుగుతుంది.. తద్వారా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి సత్ఫలితాలు పొందగల్గుతారు. ఏ మతమైన ఆయా సంప్రదాయాల వెనక ఇలాంటి శాస్త్రీయ ధృక్పథమే ఉందని గమనించాలి.

- పి.కృష్ణాది శేషు, వాస్తు నిపుణులు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని