4 ఏళ్లలో రూ.22 లక్షల కోట్లకు జీఎస్‌డీపీ

మౌలిక వసతులు.. రియల్‌ ఎస్టేట్‌ ఒకదానితో ఒకటి ముడిపడిన అంశాలు. ఈ రెండింటిని కవల పిల్లలతో పోల్చాయి స్థిరాస్తి వర్గాలు. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్‌లో వచ్చిన మౌలిక వసతులతో మన నగరం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.

Updated : 05 Nov 2022 06:33 IST

ఈనాడు, హైదరాబాద్‌

మౌలిక వసతులు.. రియల్‌ ఎస్టేట్‌ ఒకదానితో ఒకటి ముడిపడిన అంశాలు. ఈ రెండింటిని కవల పిల్లలతో పోల్చాయి స్థిరాస్తి వర్గాలు. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్‌లో వచ్చిన మౌలిక వసతులతో మన నగరం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటూ ఆదాయమూ పెరిగింది.సవాళ్లను అధిగమిస్తూ భవిష్యత్తులోనూ మరింత వేగంగా పురోగమించేందుకు స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సైతం ఇప్పుడున్న రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి(జీఎస్‌డీపీ) రూ.11.55 లక్షల కోట్ల నుంచి 4 ఏళ్లలో రూ.22 లక్షల కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రియల్‌ ఎస్టేట్‌ వాటా గణనీయమని.. ప్రభుత్వం వైపు నుంచి ఏంచేస్తే లక్ష్యాలను చేరుకోగలమో సూచించాలని పరిశ్రమ వర్గాలను సర్కారు కోరింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఇన్‌ఫ్రా సమ్మిట్‌-2022లో ‘మౌలిక వసతులు, రియల్‌ ఎస్టేట్‌-హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులు, భాగస్వాముల దృక్కోణం’ అంశంపై ప్రభుత్వ, స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు.

జీవో 86తో మారిన రూపురేఖలు : - సి.శేఖర్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌, సీఐఐ, తెలంగాణ

ఓఆర్‌ఆర్‌, విమానాశ్రయం, మెట్రోరైలు, కొత్త జిల్లాలు, ప్రాంతీయ వలయ రహదారి వంటి మౌలిక వసతుల రాకతో భూముల ధరలు పెరిగాయి. 2006కు ముందు ఎంసీహెచ్‌ పరిధిలోనే 95 శాతం అభివృద్ధి ఉంటే బయట ఉన్న 12 మున్సిపాలిటీల్లో 5 శాతమే ఉండేది. జీవో 86తో అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐతో నగరం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, బిల్డర్లను ఆకర్షించింది. 12 ఫ్లాట్లను కట్టే దశ నుంచి రెండు మూడువేల ఫ్లాట్లు ఉండే కమ్యూనిటీలను కట్టగలుగుతున్నారు. పరిశ్రమలు ఓఆర్‌ఆర్‌ బయటికి తరలుతున్న తరుణంలో ఒక్కో సంస్థ ఒకచోట కాకుండా ఒకేచోట 10వేల ఎకరాల్లో ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలి.

* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్థానిక డెవలపర్లను ప్రోత్సహించాలని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు బి.సునీల్‌చంద్రారెడ్డి సూచించారు.

* సిటీలోనూ అన్నివైపులా సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలనిక్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

వృద్ధిలో రియల్‌ ఎస్టేట్‌ కీలకం : - ఆనంద్‌ టాండన్‌, సలహాదారు, తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ఏడేళ్లలో రెట్టింపు అయింది. ప్రస్తుత రూ.11.55 లక్షల కోట్ల నుంచి నాలుగేళ్లలోనే రెట్టింపు అంటే రూ.22 లక్షల కోట్లకు చేరుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. జీఎస్‌డీపీలో రియల్‌ ఎస్టేట్‌ వాటానే 20 శాతం ఉంటుంది. నిజానికి దీని వృద్ధి ఐటీ, ఫార్మా, పరిశ్రమలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇంకా ఏం చేస్తే అనుకున్న వృద్ధిరేటును అందుకోగలమో సూచించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని