ఆకట్టుకునేలా.. అంతస్తుకు ఒకటే

నచ్చినట్లుగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు.. విశాలంగా ఉండాలనుకునే వారు విల్లాల వైపు మొగ్గు చూపే వారు..  సిటీ దాటి వెళితే తప్ప విల్లాలు కొనలేరు. మరి వృత్తి, ఉద్యోగాలు, పిల్లల చదువుల దృష్ట్యా నగరం దాటి వెళ్లలేని వారిని దృష్టిలో పెట్టుకుని విల్లా తరహా సౌకర్యాలు, సదుపాయాలు అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలోనే కల్పిస్తున్నారు.

Published : 24 Jun 2023 04:05 IST

నచ్చినట్లుగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు.. విశాలంగా ఉండాలనుకునే వారు విల్లాల వైపు మొగ్గు చూపే వారు..  సిటీ దాటి వెళితే తప్ప విల్లాలు కొనలేరు. మరి వృత్తి, ఉద్యోగాలు, పిల్లల చదువుల దృష్ట్యా నగరం దాటి వెళ్లలేని వారిని దృష్టిలో పెట్టుకుని విల్లా తరహా సౌకర్యాలు, సదుపాయాలు అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలోనే కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ హైదరాబాద్‌ మార్కెట్లో నడుస్తోంది.

బహుళ అంతస్తుల్లో నివాసం అంటే కొనుగోలుదారుల్లో చాలామంది మొదట్లో అంతగా ఆసక్తి చూపేవారు కాదు. వ్యక్తిగత ఇళ్లనే ఇష్టపడేవారు. దూరమైనా సరే స్థలం కొని కట్టుకునేవారు. కట్టిన ఇళ్లను కొనుగోలు చేసేవారు. గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ల రాకతో ఆలోచనల్లో మార్పు వచ్చింది. భూముల ధరల పెరుగుదలతో ఇల్లు కొనడం భారం కావడంతో తమ బడ్జెట్లో వచ్చే ఫ్లాట్లతో సర్దుకుపోతున్నారు. మొదట్లో స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లలో కొన్నా.. తర్వాత గేటెడ్‌, ఆకాశహర్మ్యాలకు మారుతున్నారు. వీటిలోని సౌకర్యాలకు ఫిదా అవుతున్నారు.

ఇండిపెండెంట్‌ ఫ్లోర్లు

అపార్ట్‌మెంట్ల నుంచి విల్లాలకు మారిపోతున్న వారు లేకపోలేదు. తమ ఒక్కరికే సొంతం అన్న భావన వీటిలో ఉంటుంది.  బహుళ అంతస్తుల భవనాల్లో ఇతరులతో పంచుకోవాలి. ఇరుగుపొరుగు గోల ఉంటుంది. ప్రైవసీ కోరుకునేవారి కోసం అపార్ట్‌మెంట్లలోనే ఇండిపెండెంట్‌ ఫ్లోరు నిర్మిస్తున్నారు. ఒక ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్‌ మాత్రమే ఉంటుంది. వ్యక్తిగత ఇల్లు అనుభూతి కలుగుతుంది. 4వేల నుంచి 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో ఈ పోకడ కనిపిస్తుంది.

ఎత్తైన బాల్కనీలు

అపార్ట్‌మెంట్‌లోనే రెండు అంతస్తులు కలిపి ఒకటే ఫ్లాటుగా నిర్మిస్తున్నారు. నిర్మాణ ప్రదేశం, ప్రాజెక్ట్‌ను బట్టి కొందరు కింది అంతస్తుల్లో కడితే.. మరికొందరు పైఅంతస్తుల్లో స్కైవిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కూడా ఒక్కోటి 4వేల నుంచి ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటున్నాయి. ఇంటి లోపల, కుదరకపోతే ఇంటి బయట బాల్కనీలో రెండు అంతస్తుల ఎత్తులో సీలింగ్‌ ఇస్తున్నారు. దీంతో ఇంటికే సరికొత్త లుక్‌ వస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ అనే భావన దూరమై విల్లా అనుభూతి కలుగుతుంది. ఈ తరహాలో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కడుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి చుట్టుపక్కల ఐటీ కారిడార్‌లో ఈ తరహా విల్లామెంట్‌లు, స్కైవిల్లాలను చూడొచ్చు. రెండింతల ఎత్తులో ఉండే బాల్కనీలు కనిపిస్తుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని