నియో పొలిస్‌లో 45.33 ఎకరాలు వేలం

కోకాపేట నియో పొలిస్‌ లేఅవుట్‌లో రెండో విడత భూముల వేలానికి మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇప్పటికే ఫేజ్‌-1లో వేలంవేసిన 65 ఎకరాలతో రూ.రెండు వేల కోట్లు పైనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.

Updated : 08 Jul 2023 01:18 IST

బహుళ జోన్‌ కావడంతో నిర్మాణదారుల ఆసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: కోకాపేట నియో పొలిస్‌ లేఅవుట్‌లో రెండో విడత భూముల వేలానికి మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇప్పటికే ఫేజ్‌-1లో వేలంవేసిన 65 ఎకరాలతో రూ.రెండు వేల కోట్లు పైనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అప్పుడు గరిష్ఠంగా ఎకరాకు రూ.60 కోట్లు ధర పలికింది. మొత్తం 500 ఎకరాలవరకు లేఅవుట్‌ ఉండగా...ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించారు. ప్రస్తుతమిక్కడ దాదాపు రూ.400 కోట్లతో హెచ్‌ఎండీఏ అన్నిరకాల మౌలికవసతులు కల్పించింది. తాజాగా ఫేజ్‌-2లో మరో 45.33 ఎకరాలను ఈ-వేలం వేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఒక్కో ప్లాట్‌ 3.60 ఎకరాల నుంచి 9.71 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గతంలో మాదిరిగానే ఈ దఫా కూడా స్థిరాస్తి కంపెనీలు, ఐటీ సంస్థల నుంచి మంచి స్పందన లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 111 జీవో ఎత్తివేసిన దృష్ట్యా అక్కడ కూడా భారీ ఎత్తున భూమి అందుబాటులోకి రానుంది. దీంతో ఆ ప్రభావం ఇక్కడ ఉంటుందా? లేదా?అనేది ఈ వేలం ద్వారా తేలనుంది. అయితే కోకాపేట పూర్తిగా అభివృద్ధి చెందిన దరిమిలా ఈ భూములు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఎకరానికి ఎక్కువే ధర పలుకుతుందని పేర్కొంటున్నారు.

విదేశీ సంస్థలకు సైతం....

ఈ వేలంలో పాల్గొనేందుకు భారతీయ వ్యక్తులు, సంస్థలే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించనున్నారు. అంతేకాక నిబంధనల మేరకు దేశంలో కార్యకలాపాలు కొనసాగిసున్న విదేశీ కంపెనీలు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ...ఇక్కడ స్థిరాస్తులు కొనడానికి అనుమతి ఉన్నట్లైతే అలాంటి సంస్థలు కూడా వేలం పక్రియలో పాల్గొనే వీలు కల్పించారు. పోటాపోటీ వేలం జరిగిన సందర్భంలో గరిష్ఠ ధర పలికే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆగస్టు 3న ఈ-వేలం ఉంటుంది.

మోకిల, షాబాద్‌లోనూ...

* గండిపేట-శంకర్‌పల్లి మార్గంలోని మోకిలలోనూ హెచ్‌ఎండీఏ 50 ప్లాట్లను వేలం వేస్తోంది. 325-433 చ.గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్నాయి. కనీస ధరగా రూ.25 వేలు నిర్ణయించింది. విల్లా, గ్రూప్‌ హౌసింగ్‌ కట్టుకోవాలనుకునేవారికి అనుకూలం.ఆగస్టు 7న ఈ-వేలంలో పాల్గొనవచ్చు.

* రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోనూ 50 ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేస్తోంది. స్థానికంగా 300 చదరపు గజాల్లో ప్లాట్లున్నాయి. కనీస ధర రూ.10 వేలు. ఆగస్టు 8న ఈ-వేలం నిర్వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని