బోడుప్పల్‌ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో...

హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి 163కు దగ్గరలో లేఅవుట్‌లో ప్లాట్ల అమ్మకాలకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సిద్ధమైంది. వచ్చే నెల 9న ఈ-వేలం ద్వారా ప్లాట్లను విక్రయించనున్నారు.

Published : 15 Jul 2023 00:21 IST

అమ్మకానికి ప్లాట్లు సిద్ధం
చదరపు గజానికి కనీసం రూ.25 వేల వంతున ధర

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి 163కు దగ్గరలో లేఅవుట్‌లో ప్లాట్ల అమ్మకాలకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సిద్ధమైంది. వచ్చే నెల 9న ఈ-వేలం ద్వారా ప్లాట్లను విక్రయించనున్నారు. పోచారం ఇన్ఫోసిస్‌ ఐటీ సంస్థలతోపాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలకు దగ్గరలో ఈ లేఅవుట్‌ ఉంది. అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాట్ల విస్తీర్ణం కూడా 266-300 గజాలకు పరిమితం చేయడం ఈ లేఅవుట్‌లో విశేషం. మొత్తం 50 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తొలుత రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి ఈ-వేలానికి పేరు నమోదు చేసుకోవచ్చు. వచ్చే నెల 7 తేదీలోపు రూ.లక్ష ఈఎండీ చెల్లించాలి. అదే నెల 9 తేదీన ఉదయం, సాయంత్రం సెషన్లలో ఈ-వేలం నిర్వహిస్తారు. ప్రతి ప్లాట్‌కు కనీస ధర చదరపు గజానికి హెచ్‌ఎండీఏ రూ.25 వేలుగా నిర్ణయించింది. వేలంలో పాల్గొనే వారు ప్రతి చదరపు గజానికి కనీసం రూ.500 వంతున పెంచుతూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ ధర కోట్‌ చేసిన వ్యక్తి పేరుతో ప్లాట్‌ను కేటాయిస్తారు. వేలం తర్వాత మూడు విడతల్లో హెచ్‌ఎండీఏకు పూర్తి సొమ్ములు చెల్లించాలి. అనంతర సదరు ప్లాట్‌ యజమాని పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

విస్తరిస్తున్న అభివృద్ధి

బోడుప్పల్‌ వైపు కొంతకాలంగా అభివృద్ధి విస్తరిస్తోంది. ఐటీ, వైద్య ఆరోగ్య, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు బోడుప్పల్‌ ప్రాంతాల్లో కొలువు తీరుతున్నాయి. ఉప్పల్‌ ప్రాంతంలో మెట్రో స్టేషన్‌ అందుబాటులో ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారి 163కు దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ నుంచి ఎటువైపైనా సులువుగా చేరుకోవచ్చు. అవుటర్‌రింగ్‌ రోడ్డు ఎక్జిట్‌-9కు ఈ లేఅవుట్‌ సమీపంలో ఉండటంతో ఓఆర్‌ఆర్‌పైకి నేరుగా రాకపోకలు సాగించే వీలుంది. ప్రస్తుతం నగర సమీపంలో ప్రైవేటు లేఅవుట్‌లలో కొనాలంటే కనీసం రూ.40 వేల పైనే ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగర సమీపంలోని బోడుప్పల్‌లో వేలం వేయనున్న ప్లాట్లకు కనీస ధర చదరపు గజానికి రూ.25 వేలు నిర్ణయించడం వల్ల అందరికీ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. నగరానికి దూరంలో కొంటే కొన్నేళ్లకు గానీ అక్కడ అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. నగరానికి ఆనుకునే ఉండటంతో అలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. అంతేకాక వెంటనే ఇళ్లు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. ఈ నెల 25న ఈ ప్లాట్ల వేలానికి సంబంధించి అధికారులు ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కొనుగోలుదారుల సందేహాలు ఇతర అనుమానాలను ఈ సమావేశంలో నివృత్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులకు ఇదే అవకాశమని ఈ-వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకోవాలని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు