కొంచెం మోదం.. కొంచెం ఖేదం

కోకాపేటలో ఎకరం రూ.వందకోట్లు దాటడంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ పేరు అంతటా ప్రముఖంగా వినబడడం ఒకవైపు సంతోషంగా ఉన్నా.. మరోవైపు ఒక్కసారిగా అంతగా ధరలు పెరగడం మంచి పరిణామం కాదని క్రెడాయ్‌ తెలంగాణ నూతన కార్యవర్గం అభిప్రాయపడింది. వందకోట్ల ధర బెంచ్‌ మార్క్‌ ఏమి కాదని.. అంతటా ఇళ్ల ధరలు అందకుండా పోతాయనే ఆందోళన అక్కర్లేదంది.

Updated : 05 Aug 2023 08:07 IST

వందకోట్లను బెంచ్‌ మార్క్‌గా భావించొద్దు
కోకాపేట వేలంపాటలో భూముల ధరలపై క్రెడాయ్‌ తెలంగాణ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: కోకాపేటలో ఎకరం రూ.వందకోట్లు దాటడంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ పేరు అంతటా ప్రముఖంగా వినబడడం ఒకవైపు సంతోషంగా ఉన్నా.. మరోవైపు ఒక్కసారిగా అంతగా ధరలు పెరగడం మంచి పరిణామం కాదని క్రెడాయ్‌ తెలంగాణ నూతన కార్యవర్గం అభిప్రాయపడింది. వందకోట్ల ధర బెంచ్‌ మార్క్‌ ఏమి కాదని.. అంతటా ఇళ్ల ధరలు అందకుండా పోతాయనే ఆందోళన అక్కర్లేదంది. అదే సమయంలో అన్ని వర్గాలకు సొంతింటి కల నెరవేర్చుకునేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని అభిప్రాయపడింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని క్రెడాయ్‌ తెలంగాణ కార్యాలయంలో శుక్రవారం నూతన కార్యవర్గం ఏర్పాటు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి..

-డి.మురళీకృష్ణారెడ్డి, ఛైర్మన్‌, క్రెడాయ్‌ తెలంగాణ

యావత్‌ దేశం అంతటా నియోపోలిస్‌ గురించే చర్చ.. కనీవినీ ఎరగని రీతిలో హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ ఎక్కడికో వెళ్తుంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలను అధిగమించి ఎకరం విలువ వందకోట్లు దాటడం.. ఆలోచించాల్సిన విషయం. సామాన్య మానవుడు ఏ విధంగా బతకాలి అనేదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు నిర్మాణ రంగం కూడా ఆలోచించాలి. ఎందుకు ధరలు ఈ విధంగా పెరిగిపోతున్నాయి అనేది కూడా చూడాలి.

  • పాత మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని ప్రాంతాల్లో జోన్ల పేరుతో ఆంక్షలు ఉన్నాయి. పెరీ అర్బన్‌, రిక్రియేషన్‌ జోన్లను సవరిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అవుటర్‌ రింగ్‌రోడ్డు వెంట గ్రోత్‌కారిడార్లలో గ్రిడ్‌రోడ్లను వేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం. మార్కింగ్‌ చేసి ఇస్తే చాలు తామే రహదారులు వేసుకుంటాం అని కూడా చెప్పాం. మార్కింగ్‌ జరిగితే వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చి ధరల నియంత్రణ ఉంటుంది.
  • కోకాపేటలో వందకోట్లకు భూములు కొని చేపట్టే ప్రాజెక్టులో చదరపు అడుగు రూ.12వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు పదివేల ధరల్లో ఉన్నాయి.
  • మా బిల్డర్లు అఫర్డబులిటీ ప్రాజెక్ట్‌లను రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నారు.

సంతోషమే.. కానీ మంచి పరిణామం కాదు

-ఇ.ప్రేంసాగర్‌రెడ్డి, అధ్యక్షుడు

దేశంలోనే కాదు విదేశాల్లో హైదరాబాద్‌ పేరు పతాక శీర్షికల్లో నిలవడం ఒకవైపు సంతోషంగా ఉన్నా.. ఒక్కసారిగా అంత ధరలు పెరగడం మంచి పరిణామం కాదు. ఈ ధరలు కొంత ప్రాంతం వరకే పరిమితం అనేది గుర్తించాలి. ధనవంతులే అక్కడ ఇళ్లు కొంటున్నారు. వందకోట్లు బెంచ్‌ మార్క్‌ ఏమికాదు. అక్కడి నుంచి కొంతదూరం వెళ్తే మామూలు ధరలే ఉంటాయి. మధ్యతరగతి, సామాన్యులకు కూడా అందేలా ఇళ్ల ధరలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కచోట పెరిగిన ధరలు చూసి ఇళ్లు అందలేకపోతున్నదనే భయం అక్కర్లేదు.

  • రియల్‌ ఎస్టేట్‌ రంగానికి హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ చాలా డిమాండ్‌ ఉంది. ఈ రంగంపై ప్రభుత్వ అనుకూల విధానం, మౌలిక వసతుల కల్పన కారణంగా డిమాండ్‌ పెరుగూనే ఉంది.
  • రెరా కమిటీ రావడంతో ప్రీలాంచ్‌ విక్రయాలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని బిల్డర్ల ఫిర్యాదుల పరిష్కారానికి రెరాలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీలో క్రెడాయ్‌కు భాగస్వామ్యం కల్పించాలి. రెరా చట్టం గురించి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నాం. రెరా కమిటీ ఏర్పాటు అయినందున బిల్డర్లందరూ చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి.

కొత్త కార్యవర్గమిదే...

క్రెడాయ్‌ తెలంగాణ 2023-25 కాలానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. జిల్లాల్లోని సభ్యులకు ఈసారి కార్యవర్గంలో ప్రాతినిధ్యం పెరిగింది. ఛైర్మన్‌ డి.మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షుడిగా ఇ.ప్రేంసాగర్‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా కె.ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శిగా జి.అజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా బి.పాండురంగారెడ్డి, పురుష్తోతంరెడ్డి, గుర్రం నర్సింహారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కోశాధికారిగా జగన్‌మోహన్‌ చిన్నాల, సంయుక్త కార్యదర్శులుగా వై.వెంకటేశ్వర్‌రావు, బండారి ప్రసాద్‌, చేతి రామారావు, ఎం.ఆనంద్‌రెడ్డి ఎన్నికయ్యారు. క్రెడాయ్‌ యూత్‌ వింగ్‌ తెలంగాణ సమన్వయకర్త సి.సంక్తీర్‌ ఆదిత్యరెడ్డి, కార్యదర్శిగా రోహిత్‌ అశ్రిత్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని