శంషాబాద్‌ వైపు ల్యాండింగ్‌

శంషాబాద్‌ వైపు రియల్‌ అడుగులు వేగంగా పడుతున్నాయి. విమానాశ్రయం కేంద్రంగా పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో దక్షిణం వైపు కొనుగోలుదారుల చూపు పడింది.

Published : 12 Aug 2023 03:18 IST

బుద్వేల్‌ భూముల వేలంతో దక్షిణం వైపు దృష్టి

 

ఈనాడు, హైదరాబాద్‌ : శంషాబాద్‌ వైపు రియల్‌ అడుగులు వేగంగా పడుతున్నాయి. విమానాశ్రయం కేంద్రంగా పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో దక్షిణం వైపు కొనుగోలుదారుల చూపు పడింది. జీవో 111 ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించడం ఈ ప్రాంతానికి కలిసి వచ్చే అంశం. విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో వస్తుండటంతో రవాణాకు ఢోకా ఉండదని భావిస్తున్న నగరవాసులు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు స్థలాల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్టులను ఈ ప్రాంతంలోనే ప్రకటిస్తున్నాయి. బుద్వేల్‌ భూముల వేలంలో పోటీపడి మరీ పలు సంస్థలు భూములను దక్కించుకున్నాయి. ఈ పరిణామాలన్నీ దక్షిణం వైపు రియల్‌ రంగానికి కొత్త ఊపునిస్తున్నాయి.

రెండు వైపులా అభివృద్ధి..

ఐటీ కారిడార్‌కు రెండువైపుల అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఒకవైపు కోకాపేట, తెల్లాపూర్‌, కొల్లూరు మోకిల వైపు దూసుకెళుతోంది. రెండోవైపు అప్పా, మొయినాబాద్‌, కిస్మత్‌పూర్‌, బుద్వేల్‌, శంషాబాద్‌, వైపు స్థిరంగా అడుగులు పడుతున్నాయి. అప్పా, బండ్లగూడ వరకు ఇప్పటికే నివాస ప్రాంతాలు విస్తరించాయి. ఆ తర్వాత శంషాబాద్‌ వరకు పెద్దగా నివాసాలు లేవు. దూరం కూడా ఎక్కువే. అయితే బుద్వేల్‌, కిస్మత్‌పూర్‌లో ప్రభుత్వం ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు గతంలో ప్రకటించింది. ఇక్కడ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఇక్కడ ఐటీ పార్క్‌ ఏర్పాటుతో గచ్చిబౌలి ప్రాంతానికి కొనసాగింపుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బుద్వేల్‌లో భూముల వేలంలో ఎకరం రూ.40 కోట్ల పైన పలకడానికి కారణం కూడా ఇదే. ఐటీ పార్క్‌ వస్తే నివాసాలకు డిమాండ్‌ ఏర్పడుతుందని నిర్మాణ సంస్థలు ముందుచూపుతో కొనుగోలుకు సిద్ధపడ్డాయి. నివాసం ఉండాలంటే ప్రజారవాణా అత్యంత ముఖ్యం. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో నిర్మించబోతున్నారు. వచ్చేనెల రెండోవారంలో పనులు మొదలెట్టబోతున్నారు. మూడేళ్లలో మెట్రోని పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. మెట్రో అందుబాటులోకి వస్తే రవాణా సమస్యలే ఉండవు. ఇవన్నీ కూడా దక్షిణానికి కలిసి వస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో బుద్వేల్‌ దాటి శంషాబాద్‌ వరకు నివాసాలు విస్తరించనున్నాయి.

ఉపాధి మెండు..

భవిష్యత్తులో శంషాబాద్‌ అది పెద్ద శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందబోతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విమానాశ్రయం కేంద్రంగా అందుబాటులో ఉన్న వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున పలు సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. వేర్‌హౌసింగ్‌, స్టూడియోల నిర్మాణం ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతం వేలల్లో ఉన్న ఉపాధి అవకాశాల్లో వచ్చే పదేళ్లలో లక్షల్లోకి చేరబోతున్నాయి. వీరంతా సమీపంలోని ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఇష్టపడతారు. రవాణా పరంగా మెట్రో భరోసా కల్పించబోతుంది. విమానాశ్రయంలోని మెట్రోస్టేషన్‌ను జంక్షన్‌గా మారి.. అన్నిప్రాంతాలకు ఇదొక లాజిస్టిక్‌ హబ్‌గా మారబోతుంది. శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు, విమానాశ్రయం నుంచి ఫార్మాసిటీ చేరువలోని కందుకూరు వరకు మెట్రో విస్తరణ ప్రణాళికలను సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా శంషాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర నివాసం ఉండాలనుకునే వారికి ఆశలు రేకెత్తిస్తున్నాయి.  

ఇక్కడ ధరలు పెరగడం..

ఐటీ కారిడార్‌లో కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు లేనిదే మూడు పడకల ఫ్లాట్‌ రావడం లేదు. ఈ తరహాలో ఇక్కడ ధరలు పెరగడంతో కాస్త దూరమైనా సరే అని భావించేవాళ్లు శంషాబాద్‌ పరిసర ప్రాంతాల వైపు చూస్తున్నారు. తుక్కుగూడ ప్రాంతంలో ఐటీ కారిడార్‌లో ఫ్లాట్‌ ధరకు 200 గజాల్లో మంచి విల్లా వస్తుండటంతో అటువైపు చూస్తున్నారు. అవుటర్‌ ఉండటం.. భవిష్యత్తులో మెట్రో భరోసాతో బడ్జెట్‌వాసులు ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కల చూస్తున్నారు. అరాంఘర్‌ నుంచి విమానాశ్రయం వరకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కోటిగా నివాస గృహ సముదాయాలుగా మారుతున్నాయి. రాజేంద్రనగర్‌ విశ్వవిద్యాలయం అనంతరం సాతంరాయ్‌లో భారీ అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు విల్లా ప్రాజెక్టులను చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో చదరపు అడుగు ధర రూ.5 వేలకు అటుఇటుగా చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని