రియల్‌ 2030

రియల్‌ ఎస్టేట్‌ దేశంలో ఎలా ఉండబోతుంది? రాబోయే ఆరేడేళ్లలో వృద్ధికి ఏ మేరకు అవకాశం ఉంది? ఉపాధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి నైపుణ్యాలను పరిశ్రమ కోరుకుంటోంది? నగరాలు, పట్టణాలు ఎక్కడ చూసినా నిర్మాణాలే.

Published : 12 Aug 2023 03:26 IST

ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకోనున్న నిర్మాణ రంగం
 గృహ నిర్మాణం, కార్యాలయాలు, మాల్స్‌లో అధిక వృద్ధికి అవకాశం
మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ దేశంలో ఎలా ఉండబోతుంది? రాబోయే ఆరేడేళ్లలో వృద్ధికి ఏ మేరకు అవకాశం ఉంది? ఉపాధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి నైపుణ్యాలను పరిశ్రమ కోరుకుంటోంది? నగరాలు, పట్టణాలు ఎక్కడ చూసినా నిర్మాణాలే.. అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల భవనాలు, మాల్స్‌, వేర్‌ హౌసింగ్‌, హోటల్స్‌, విద్యాసంస్థల నిర్మాణాలతో పాటూ మౌలిక వసతుల కల్పన కోసం రహదారులు, మెట్రోరైల్‌స్టేషన్ల వరకు పెద్దఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. దేశంలో మౌలిక వసతుల కొరత కారణంగా మున్ముందు ఇంకా భారీ ఎత్తున వీటి నిర్మాణాలు రాబోతున్నాయి. మరోవైపు అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, కార్యాలయాలు, మాల్స్‌ వరకు ఇప్పటికే నగరాల్లో ఎన్నో వచ్చాయి. విక్రయాలు లేక ఇన్వెంటరీ పెరిగిపోతుందనే ఆందోళన ఉంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు రాబోయే రోజుల్లో వీటికి ఇంకా డిమాండ్‌ ఉంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో 2030 నాటికి నిర్మాణ రంగం 1 ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటుందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం 650 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల వద్ద ఈ రంగం ఉంది. వచ్చే ఆరేడేళ్లలో మరో 350 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు మార్కెట్‌ పెరగనుందని వెల్లడించింది. చాలారకాల నిర్మాణాలు ఉన్నా.. గృహ, కమర్షియల్‌, రిటైల్‌, ఆతిథ్యం, గోదాముల నిర్మాణంలో వృద్ధి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

2012-22 మధ్యలో...

* పదేళ్లలో దేశంలోని 8 అగ్ర నగరాల్లో 3.1 బిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ నిర్మాణాలు చేపట్టారు.* గ్రేటర్‌ ‘ఏ’ కార్యాలయాల భవనాలు 880 మిలియన్‌ చదరపు అడుగుల్లో, 106 మిలియన్‌ చదరపు అడుగుల్లో వాణిజ్య, మాల్స్‌, హైస్ట్రీట్స్‌ నిర్మాణాలు చేపట్టారు.* కొన్నేళ్లుగా విధాన పరమైన నిర్ణయాలతో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై మదుపరుల విశ్వాసం పెరగడంతో పెద్దఎత్తున  పెట్టుబడులు పెట్టారు.* పదేళ్లలో 35 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల ఎఫ్‌డీఐలను ఈ రంగం ఆకర్షించింది. ఇందులో అత్యధికంగా 19 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు మౌలిక వసతుల నిర్మాణంలో, మిగిలినవి రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చాయి.

ఎందుకు డిమాండ్‌ అంటే...

పెరుగుతున్న జనాభాకు తగ్గ మౌలిక వసతుల కల్పన, గృహ వసతి కల్పించాల్సి ఉంటుందని ఆ మేరకు మున్ముందు ఈ రంగం మరింత వృద్ధికి అవకాశం ఉందని చెబుతున్నారు. ః ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2010లో పట్టణ జనాభా 30 శాతం ఉండగా... 2022లో 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 40 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 2025 నాటికే 50 శాతానికి చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పట్టణీకరణ కారణంగా రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి అవకాశం ఉంటుందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. ః ఐటీ, ఐటీ ఆధారిత, ఉత్పత్తి రంగాల్లో ఉపాధి అవకాశాలతో మార్కెట్‌ పెరుగుతుందని అంచనా.   ఆదాయాలు పెరగడంతో వినోదం కోసం చేసే ఖర్చు పెరగనుంది. ఈ మేరకు ఆతిథ్య రంగంలో నిర్మాణాల అవసరం పెరుగుతుంది.  

ఉపాధి మెండు..

భారత ఆర్థిక వ్యవస్థలో రియల్‌ ఎస్టేట్‌ది కీలక భూమిక.  ప్రస్తుతం ఈ రంగం వాటా 18.4 శాతంగా ఉంది. 2029-30 నాటికి 21 నుంచి 23 శాతానికి పెరుగుతుందని అంచనా.* ఈ రంగంలో ప్రస్తుతం 7 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. 2030 నాటికి పది కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు.* ఇంజినీర్లు ఇప్పుడు 22 లక్షల మంది పనిచేస్తుంటే ఏడేళ్లలో వీరి సంఖ్య 33 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఏటా లక్షకు పైగా ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలను ఈ రంగం కల్పించబోతుంది. నిర్మాణ రంగంలోని మానవ వనరుల్లో ఇంజినీర్ల వాటా 3.3 శాతానికి పెరగనుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికి, యంత్రాలు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ గురించి తెలిసినవారికి, నిర్మాణ రంగానికి సంబంధించి సాంకేతికతలు, సాఫ్ట్‌వేర్‌లో ప్రావీణ్యులైన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.* టెక్నీషియన్‌/ఫోర్‌మెన్‌ విభాగంలో 22.71 లక్షల నుంచి 38.11 లక్షలకు ఉపాధి పెరగనుంది.* క్లరికల్‌ ఉద్యోగాలు 19.16 లక్షల నుంచి 29.08 లక్షలకు పెరగనున్నాయి.* నైపుణ్యం కలిగిన ఉద్యోగులు 68.84 లక్షల నుంచి 1.05 కోట్లకు పెరగనున్నారు. వీరి వాటా 10.5 శాతంగా ఉంది. సివిల్‌ ఇంజినీరింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి డిగ్రీ పట్టాలున్న వారిని నైపుణ్యమున్న ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి వొకేషనల్‌ చదువు ఉన్నవారు కూడా ఈ విభాగంలోకి వస్తారు.* నిర్మాణ రంగంలో ఎక్కువ మంది సెమీ స్కిల్డ్‌ వర్కర్లే. టెక్నాలజీ, ఆటోమేషన్‌ కారణంగా వీరి వాటా తగ్గుతూ వస్తోంది. 2011లో సెమీ స్కిల్డ్‌ వర్కర్ల వాటా 83.4 శాతం ఉంటే 2030 నాటికి 79.5 శాతానికి తగ్గనుందని అంచనా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని