రియల్‌ ఎస్టేట్‌ 2047

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుంది. అప్పటికి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలనేది భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యం. ఇంకా పాతికేళ్ల సమయం ఉంది.

Updated : 05 Mar 2024 16:47 IST

23 కోట్ల ఇళ్లు కావాలి..  విలాస నివాసాల వాటా పెరుగుతోంది  
5.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అంచనా
నరెడ్కో పాతికేళ్ల సందర్భంగా నివేదిక రూపకల్పన

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుంది. అప్పటికి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలనేది భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యం. ఇంకా పాతికేళ్ల సమయం ఉంది. అప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ దేశంలో ఎలా ఉంటుంది అనే దానిపై నరెడ్కో, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా.. ‘ఇండియా రియల్‌ఎస్టేట్‌ విజన్‌ 2047’ పేరుతో నివేదికను రూపొందించింది. మనదేశంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార రంగం 2047 నాటికి 5.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించింది. రెసిడెన్సియల్‌ రియల్‌ ఎస్టేట్‌ వాటా 3.5 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని వివరించింది. భారత్‌లో పెరుగుతున్న జనాభా.. అందులో పనిచేసే వారు ఉండటం, వారి ఆదాయాలు పెరగడం, ప్రభుత్వ విధానాలు వంటి సానుకూల అంశాలతో భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే పాతికేళ్లలో వేగంగా వృద్ధి చెందనుందని అంచనా. ఇది అన్ని రంగాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదం చేయనుంది.  

రియల్‌ వాటా..

భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 3.4 ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి 7.2 ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి 36.4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

  • ఇందులో రియల్‌ఎస్టేట్‌ వాటా 2020లో 477 బిలియన్‌ డాలర్లు ఉండగా.. 2030 నాటికి 1023 బిలియన్‌ డాలర్లు, 2047 నాటికి 5833 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
  •  స్టీల్‌ ఉత్పత్తి 14.5 బిలియన్‌ టన్నుల నుంచి 111.3 బిలియన్‌ టన్నులకు చేరుకుంటుందని అంచనా.
  • సిమెంట్‌ ఉత్పత్తి 32.8 బిలియన్‌ టన్నుల నుంచి 177.8 బిలియన్‌ టన్నులకు పెరుగుతుందని అంచనా.

రాష్ట్రాలకు ఆదాయం...

రాష్ట్ర ప్రభుత్వాలకు రియల్‌ ఎస్టేట్‌ కీలక ఆదాయ వనరుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల రూపాయలు ఈ రంగం నుంచి సమకూరింది. స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, భూ లావాదేవీల ద్వారా రాష్ట్రాలకు సమకూరింది. అన్ని రాష్ట్రాలు వసూలు చేసిన పన్నుల వాటాలో ఇది 5.4 శాతానికి సమానం.

ఉపాధి మెండు..

భారతీయ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమపై 250 అనుబంధ పరిశ్రమలు ఆధారపడి ఉపాధి పొందుతున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధికమందికి ఉపాధి కల్పిస్తున్న రంగమిది. దాదాపు 18 శాతం మందికి ఉపాధి అందిస్తోంది.

విక్రయాలు పెరుగుతున్నాయ్‌..

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కలిపి 2021లో 2.32 లక్షల ఇళ్లు విక్రయించారు. 2022లో  3.12 లక్షలకు విక్రయాలు పెరిగాయి.  

  •  ఐదేళ్ల విక్రయాలు చూస్తే కోటి అంతకంటే విలువైన ఇళ్ల వాటా పెరుగుతోంది. 2018లో రూ.50 లక్షల లోపు ఇళ్ల విక్రయాల వాటా 54 శాతం ఉండగా... 2022 నాటికి 37 శాతానికి తగ్గిపోయింది. ఆ స్థాయిలో ధరలు పెరిగిపోయాయి.
  • రూ.50 లక్షల నుంచి కోటి మధ్య విలువైన ఇళ్ల వాటా 30 నుంచి 36 శాతానికి పెరిగింది.
  •  కోటి అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే నివాసాల వాటా 16 శాతం నుంచి ఐదేళ్లలో 27 శాతానికి పెరిగింది.

23 కోట్ల ఇళ్లు అవసరం..

భారత్‌ జనాభా ప్రస్తుతం 142.86 కోట్లు. 2047 నాటికి 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో సగానికంటే ఎక్కువ 51 శాతం పట్టణాల్లో నివాసం ఉంటారని భావిస్తున్నారు.

  •  పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాలు, చిన్న పట్టణాలు కాస్త మినీ అర్బన్‌ టౌన్లుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది.
  •  అప్పటికి నగరాలు, పట్టణాలతో కలిపి 23 కోట్ల ఇళ్లు అవసరం ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.
  • సమీకృత పట్టణాలు, బహుళ వినియోగ హౌసింగ్‌ డెవలప్‌మెంట్స్‌, సుస్థిరాభివృద్ధితో కూడిన మినీపట్టణాలు రానున్నాయి.
  •  ఆదాయాలు పెరిగే కొద్దీ అన్ని విభాగాల గృహాలకు డిమాండ్‌ పెరగనుంది. రాబోయే కొద్ది సంవత్సరాల వరకు అందుబాటు ఇళ్ల మార్కెట్‌పై దృష్టి ఉంటుంది. క్రమంగా   విలాసవంతమైన ఇళ్లవైపు మారుతుంది.
  •  ప్రస్తుతం 43శాతంగా ఉన్న అల్పాదాయ కుటుంబాలు... 2047 నాటికి 9 శాతానికి తగ్గిపోతాయని అంచనా. కాబట్టి మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాల గృహాలకు డిమాండ్‌ పెరగనుంది. అధిక ఆదాయం, శ్రీమంతుల కుటుంబాలు 3శాతం నుంచి 9శాతానికి పెరగనున్నాయి. ఇది కాస్త విలాసవంతమైన ఇళ్ల డిమాండ్‌ను పెంచనుంది.
  •  2018లో దిగువ మధ్య తరగతి గృహాల వాటా 33 శాతం ఉండగా.. 2047 నాటికి 31 శాతానికి పడిపోనుంది. అదే సమయంలో ఎగువ మధ్య తరగతి గృహ మార్కెట్‌ 21 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెరుగుతుంది.

దేశంలోనే సోమాజిగూడకు రెండోస్థానం...

  •  దేశంలో హైస్ట్రీట్‌లు ఉన్న మొదటి పది స్థానాల్లో హైదరాబాద్‌లోని సోమాజిగూడ 2వ స్థానంలో నిల్చింది. బెంగళూరు నుంచి ఏకంగా నాలుగు ప్రాంతాలకు చోటు దక్కింది.
  •  గచ్చిబౌలి 16,  అమీర్‌పేట 17, బంజారాహిల్స్‌ 18, జూబ్లీహిల్స్‌ 19వ స్థానంలో నిల్చాయి.

కార్యాలయాలకు డిమాండ్‌..

దేశంలో గ్రేడ్‌ ‘ఏ’ కార్యాలయాల నిర్మాణాలు కొన్నేళ్లలో బాగా పెరిగాయి.

  • 2008లో 8 ప్రధాన నగరాల్లో ఆఫీసు స్టాక్‌ 278 మిలియన్‌ చదరపు అడుగులు ఉండగా... ఇప్పుడది 898 మిలియన్‌ చదరపు అడుగులకు విస్తరించింది. వీటితో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ కార్యాలయాలకు డిమాండ్‌ పెరుగుతోంది. అక్కడ బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార విస్తరణ, తక్కువ వ్యయ నిర్వహణ కోసం కంపెనీలు చిన్న నగరాల వైపు చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగబోతుంది.
  •  2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 36 ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటే.. మన దేశంలో పనిచేసే జనాభా 69 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఆ మేరకు కార్యాలయాలకు డిమాండ్‌ ఉంటుంది. కార్యాలయ మార్కెట్‌ 2047 నాటికి 473 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు ఉంటుందని అంచనా.

మాల్స్‌ పరంగా...

  • అభివృద్ధి చెందిన దేశాల్లో మాల్స్‌ ఎప్పటి నుంచో ఉన్నా.. మన దేశంలో మాత్రం మొదటి మాల్‌ 1999లో దిల్లీలో వచ్చింది. ఆ తర్వాత ముంబయి, చెన్నై ఇలా అన్ని నగరాలకు విస్తరించాయి.
  • భారతీయుల ఆదాయాలు పెరగడంతో మాల్స్‌లో గడపడం పెరిగింది. ఆ మేరకు పెద్ద సంఖ్యలో మాల్స్‌ నిర్మాణం చేపట్టారు. రిటైల్‌లో పెద్ద ఎత్తున ఎఫ్‌డీఐలు వచ్చాయి. అయితే 2008లో ఆర్థిక సంక్షోభం మాల్స్‌ను కష్టాల్లోకి నెట్టాయి. దీంతో  అప్పటివరకు కేవలం రిటైల్‌ కోసం ఉన్న మాల్స్‌ను 2011 తర్వాత వినోదం కోసం మల్టీప్లెక్స్‌లు, ఫుడ్‌కోర్టులు, గేమింగ్‌ కార్యకలాపాలు ఉండేలా సమీకృతంగా మారాయి. 
  • ఇందులో ప్రధానంగా ఏ, బీ, సీ ఇలా మూడు రకాల మాల్స్‌ ఉన్నాయి. నిర్మాణం, అక్కడ కల్పించిన సౌకర్యాలను బట్టి వీటిని వర్గీకరించారు.  
  •  2010లో గ్రేడ్‌-ఏ మాల్స్‌ 39 శాతం ఉండగా.. 2018 నాటికి 45 శాతానికి పెరిగాయి.
  •  గ్రేడ్‌-బి 27 నుంచి 29 శాతానికి పెరగ్గా.. గ్రేడ్‌-సి   34 నుంచి 26 శాతానికి తగ్గాయి.

రీట్‌లలో...

రీట్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌)లకు కూడా అధికంగా పెట్టుబడులు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రీట్‌ల కింద ప్రస్తుతం మనదేశంలో 8.5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉంది. ఇది కాకుండా ప్రస్తుతం 2.13 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని రీట్‌లు నిర్మిస్తున్నాయి. ఈ కొత్త స్థలం వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.


అనూహ్యంగా విస్తరణ..

2047 నాటికి మనదేశం జీడీపీ 36.4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. ఇందులో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా అత్యంత క్రియాశీలకంగా ఉంటుంది. రెసిడెన్షియల్‌, ఆఫీసు, గోదాములు, పారిశ్రామిక రియల్‌ ఎస్టేట్‌ రంగాలు అనూహ్యంగా విస్తరిస్తాయి.
 రాజన్‌ బండేల్కర్‌ అధ్యక్షుడు నరెడ్కో 


పెట్టుబడుల వరద...

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో క్రమంగా పెరుగుతున్న పారదర్శకత, జవాబుదారీతనంతో భవిష్యత్తులో భారీఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

  •  ఇటీవల కాలంలో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థల పెట్టుబడులు బాగా పెరిగాయి. భవిష్యత్తు వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకొని పీఈ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు అంచనా. ఈ ఏడాదిలో 5.6 బిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులను ఈ రంగం ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది కంటే ఇది 5.3 శాతం అధికం.
  •  2022లో 5357 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు... 2047 నాటికి ఏకంగా 54,375   మిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
  • భారతీయ రియల్‌ ఎస్టేట్‌లో పీఈ పెట్టుబడులు మొత్తం జీడీపీలో 0.15 శాతంగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రకారం పాతికేళ్లలో 54.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2023 నుంచి 2047 నాటికి వార్షిక వృద్ధి 9.5 శాతంగా ఉంటుందని లెక్కకట్టారు.
  •  పీఈ పెట్టుబడులు ఎక్కువగా డాటా సెంటర్లు, ఆరోగ్య, అతిథ్య రంగం, కో లివింగ్‌ కార్యాలయాల్లో పెట్టుబడులు  పెట్టే అవకాశం ఉంది.

    సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి..

వచ్చే పాతికేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ, రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’కు తోడు ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రైవేటు రంగ పెట్టుబడులు దీనికి వీలు కల్పిస్తాయి. సుస్థిరమైన వృద్ధిపై రియల్‌ ఎస్టేట్‌ రంగం దృష్టి సారించాల్సి ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంతో పాటు మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి.
 శిశిర్‌ బైజాల్‌, సీఎండీ, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని