ఏడు నగరాలు.. ‘మన స్థానం ఆరు’

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌(రెరా) అనుమతి పొందిన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో హైదరాబాద్‌ వెనుకబడింది. ఏడు అగ్రశ్రేణి నగరాల్లోని ప్రాజెక్టుల తీరుతెన్నులపై అనరాక్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్‌   ఆరో స్థానంలో నిలిచింది.

Updated : 09 Sep 2023 02:34 IST

నిర్మాణ ప్రాజెక్టుల పూర్తిలో నగరం వెనుకబాటు
కొవిడ్‌ కారణమంటున్న నిర్మాణ సంస్థలు
‘రెరా’ నమోదు ప్రాజెక్టులపై అనరాక్‌ నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌(రెరా) అనుమతి పొందిన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో హైదరాబాద్‌ వెనుకబడింది. ఏడు అగ్రశ్రేణి నగరాల్లోని ప్రాజెక్టుల తీరుతెన్నులపై అనరాక్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్‌   ఆరో స్థానంలో నిలిచింది. ఐదేళ్ల వ్యవధిలో అనుమతి పొందినవాటిలో 74 శాతం ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేయగలిగారని తెలిపింది.

కొనుగోలుదారులకు భరోసా కల్పిస్తూ 2017లో స్థిరాస్తి నియంత్రణ చట్టం-రెరాని కేంద్రం తీసుకొచ్చింది. ప్రత్యేకించి కొన్ని నగరాల్లో సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, ఒప్పంద సమయంలో నిర్మాణ సంస్థలు పేర్కొన్న సౌకర్యాలు కల్పించకపోవడం, నాణ్యత లోపాలు, నిధుల మళ్లింపుతో మధ్యలోనే ప్రాజెక్టులు ఆగిపోవడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో కొనుగోలుదారులకు రక్షణగా పారదర్శకతను పెంపొందించేలా రెరాను తీసుకొచ్చారు. ఇది 2017 మే 1, నుంచి అమల్లోకి వచ్చింది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రెరా పకడ్బందీగా పనిచేస్తోంది. తెలంగాణలోనూ ఇటీవల ఛైర్మన్‌ నియామకం అనంతరం నిబంధనలు ఉల్లంఘిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు నోటీసులను జారీ చేస్తున్నారు. తెలంగాణలో 2017 జులై 31న రెరా నోటిఫైడ్‌ చేసినా.. ఇటీవల వరకు పూర్తి స్థాయిలో అథారిటీ లేక రెరాను తేలిగ్గా తీసుకున్నారు. నమోదు చేయకపోవడం, చేసినా కట్టుబడి ఉండకపోవడం వంటి ఉల్లంఘనలు కనిపించాయి. ప్రీ లాంచ్‌ వ్యవహారాలు విచ్చలవిడిగా నడిచాయి. ఇకపై అలా వద్దని, రెరా నిబంధనలు పాటిస్తూ ప్రాజెక్టులు చేపట్టాలని క్రెడాయ్‌ వంటి సంస్థలు తమ సభ్యులకు సూచించాయి. ఫలితంగా మున్ముందు రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య పెరిగే అవకాశముంది. గడువులోపు పూర్తి చేసే ప్రాజెక్టుల శాతం మెరుగుపడనుందని అంచనా వేస్తున్నారు.

జాప్యం  ఎందుకంటే..?

నగరంలో ఆకాశ హర్మ్యాల వంటి పెద్ద ప్రాజెక్టులను మూడు నాలుగేళ్లలో బడా సంస్థలు పూర్తి చేస్తున్నాయి. ఏదైనా కారణంగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతో కొనుగోలుదారులకు, రెరా అథారిటీకి మాత్రం పూర్తయ్యే గడువు ఐదేళ్లుగా చెబుతున్నాయి. చాలా సంస్థలు అంతకంటే ముందే పూర్తిచేసి కొనుగోలుదారులకు అందజేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఐదేళ్లయినా 26 శాతం ప్రాజెక్టులు పూర్తి కాలేదని నివేదికలు చెబుతున్నాయి. ఆలస్యానికి కొవిడ్‌ వంటి కారణాలను బిల్డర్లు చూపుతున్నారు.

ఎన్ని కట్టారంటే..?

రెరా అమల్లోకి వచ్చాక 2017 ద్వితీయార్థం, 2018లో అనుమతి పొందిన ప్రాజెక్టులను అనరాక్‌ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో 1642 ప్రాజెక్టుల్లో 2.58 లక్షల యూనిట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందారు. 1409 ప్రాజెక్టుల్లో 1.83 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇది 86 శాతంతో సమానం. వాస్తవానికి వందశాతం పూర్తవ్వాలి. హైదరాబాద్‌లో చూస్తే ఏడు నగరాల సగటు కంటే పూర్తయిన ప్రాజెక్టులు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 110 ప్రాజెక్టుల్లో 24,125 ఇళ్లను ప్రారంభిస్తే.. 81 ప్రాజెక్టులే అంటే 74 శాతమే పూర్తయ్యాయి. ఆలస్యంపై ఇప్పటికే టీఎస్‌ రెరాకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 458 ఫిర్యాదులు అందాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని