వృద్ధి ప్రాంతాల్లో కొనుగోళ్ల జోరు

గృహ నిర్మాణం చేపట్టిన ప్రదేశం... చుట్టూ ఉన్న అభివృద్ధి.. భవిష్యత్తులో వృద్ధికి అవకాశం.. ఉపాధికి చేరువగా ఉండే ప్రాజెక్టులకు మార్కెట్‌తో సంబంధం లేకుండా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉందని నిర్మాణ సంస్థలు అంటున్నాయి.

Updated : 14 Oct 2023 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌

గృహ నిర్మాణం చేపట్టిన ప్రదేశం... చుట్టూ ఉన్న అభివృద్ధి.. భవిష్యత్తులో వృద్ధికి అవకాశం.. ఉపాధికి చేరువగా ఉండే ప్రాజెక్టులకు మార్కెట్‌తో సంబంధం లేకుండా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉందని నిర్మాణ సంస్థలు అంటున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ బుకింగ్‌లు అవుతున్నట్లు ఆ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ సమయంలో స్థిరాస్తి కార్యకలాపాలు స్తబ్దుగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లపై కూడా ఆ ప్రభావం కొద్ది నెలలుగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రీమియం గృహ నిర్మాణంపై ఆ ప్రభావమేమీలేదని నిర్మాణ సంస్థలు అంటున్నాయి. మియాపూర్‌లో ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌ చేపట్టిన ఒక నిర్మాణ సంస్థ.. రెండు నెలల్లో వెయ్యికి పైగా యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. ఐటీ కారిడార్‌లో నెలక్రితం కొత్త ప్రాజెక్ట్‌ను మొదలెట్టిన మరో సంస్థ మొదటి నెలలోనే రూ.500 కోట్ల విలువ చేసే యూనిట్ల బుకింగ్‌లు అయినట్లు వెల్లడించింది. ఈ తరహాలో పేరున్న సంస్థలు.. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు, మార్కెట్‌ వ్యూహాలు, ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులకు చేరువై మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా వ్యాపారం చేస్తున్నాయి.

ఊరిస్తున్న ఆఫర్లు..

ఆకాశహర్మ్యాల ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. ఒక పక్క ఉంటున్న ఇంటికి అద్దె కడుతూ.. కొన్న ఇంటికి ఈఎంఐ చాలామందికి భారం. మూడు పడక గదుల నివాసాలు కాబట్టి ఒక్కో యూనిట్‌ ధర రూ.కోటిపైనే ఉంటోంది. అధిక ఆదాయ వర్గాలు సైతం వారి ఆదాయంలో అధికశాతం ఈఎంఐలకే చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి. అందుకే కొన్నినిర్మాణ సంస్థలు.. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ప్రీ ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదంటున్నాయి. మరికొన్ని సంస్థలు మూడేళ్ల వరకు మినహాయింపు కల్పిస్తున్నాయి. కొనుగోలుదారు చెల్లిస్తే.. వారికి తాము తిరిగి చెల్లిస్తామని చెబుతున్నాయి. ఈ తరహా ఆఫర్లతో కొనుగోలుదారులకు కొన్ని సంస్థలు దగ్గర అవుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని