మంచి తరుణం మించిపోలేదు

హైదరాబాద్‌ నగరం గత పదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. అందుకోలేకపోయామని దిగులు పడేవారు ఎందరో. ఇప్పటికీ మంచి తరుణం మించిపోలేదు.

Updated : 21 Oct 2023 07:26 IST

ఈనాడు, హైదరాబాద్‌  : హైదరాబాద్‌ నగరం గత పదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. అందుకోలేకపోయామని దిగులు పడేవారు ఎందరో. ఇప్పటికీ మంచి తరుణం మించిపోలేదు. ప్రణాళికతో వెళితే సొంతింటి వైపు అడుగులు పడటం ఖాయం. పెరుగుతున్న స్థిరాస్తుల ధరలు చాలామందికి సమస్యే అయినా దానికి పరిష్కారాలు ఉన్నాయి. రాజధాని నగరంలో జనాభాతో పాటు గృహ నిర్మాణానికి డిమాండ్‌ పెరిగింది.

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు నగరంలో పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇళ్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్‌ ఎస్టేట్‌లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

సమయం వచ్చింది..  

ఇళ్లు, స్థలాల ధరలు పదేళ్ల కాలంలో చాలా పెరిగాయి. మార్కెట్‌ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం.. ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్‌లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్‌ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు అలాంటి స్తబ్ధత మార్కెట్లో కన్పిస్తోంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీని బట్టి కాస్త ముందూ వెనక మార్కెట్‌ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు.

బడ్జెట్‌ను బట్టి ప్రాంతం ఎంపిక..

కొనేందుకు సిద్ధంగా ఉన్నా ధరలు అందుకోని స్థాయిలో ఉన్నాయని వాపోయేవారే ఎక్కువ. ఇలాంటి వారు తమ బడ్జెట్‌లో ఎక్కడ ఇళ్లు, స్థలం వస్తుందో అక్కడ   కొనుగోలు చేయాలని మార్కెట్‌లో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. పదేళ్ల    క్రితం చాలా మంది శివార్లలో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు వెచ్చించి ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేశారు. దశాబ్దకాలంలో ఆ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగై, జనావాసాలు        పెరిగి.. ఇప్పుడు రద్దీ ప్రాంతాలగా మారాయి. స్థిరాస్తుల విలువలు రెట్టింపు అయ్యాయి.   వచ్చే పదేళ్లలో జనావాసాలుగా మారేందుకు    అవకాశం ఉన్న ప్రాంతాలు ఎంపిక చేసుకుని అక్కడ కొనుగోలు చేయాలి.


ఇప్పుడు చేయాల్సిన పని..

  •  ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు.
  • ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు.
  •  మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా 14 చోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి.
  •  మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది.
  •  ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్‌ వేయండి.
  •  స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి.

    కోడ్‌ కూసిన వేళ..

ఎన్నికల కోడ్‌ స్తిరాస్తి రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంది తప్ప.. స్థిరాస్తి ఎంపిక చేసుకునే వారిపై కాదని రియల్టర్లు అంటున్నారు. వేర్వేరు ప్రాజెక్ట్‌లను సందర్శించి, నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుని, కుటుంబ సభ్యులతో చర్చించి కొనాలనే నిర్ణయానికి రావడానికి ఎంతలేదన్నా నెల నుంచి నెలన్నర పడుతుంది. దసరా పండగ మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అన్వేషణకు సరైన సమయమని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్‌లను సందర్శించి బుక్‌ చేస్తున్నారు. కోడ్‌ ముగిసిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ అంటున్నారు. అంతకంటే ముందు జరగాల్సిన వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే అడ్వాన్స్‌లు చెల్లించి ఒప్పందం చేసుకున్నవారు.. ఒప్పంద గడువు 30, 45 రోజులు ముగుస్తుండటంతో ఎన్నికలు ముగిసే వరకు గడువు పొడిగించమని అడుగుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని