నిర్మాణంలో మినీ పట్టణాలు.. ప్రణాళికల్లో టౌన్‌షిప్‌లు

మహానగరం విస్తరిస్తోంది. ఇప్పటికే అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటి కొత్త కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌ తర్వాత ప్రాంతీయ రింగ్‌ రోడ్డు అందుబాటులోకి రానున్న దృష్ట్యా సమీకృత పట్టణాలు (ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌పిష్‌) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతనున్నాయి

Updated : 21 Oct 2023 09:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరం విస్తరిస్తోంది. ఇప్పటికే అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటి కొత్త కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌ తర్వాత ప్రాంతీయ రింగ్‌ రోడ్డు అందుబాటులోకి రానున్న దృష్ట్యా సమీకృత పట్టణాలు (ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌పిష్‌) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతనున్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సంబంధించి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు దరఖాస్తులు అందాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పరిధిలోని దామర్లపల్లి ప్రాంతంలో 533 ఎకరాల్లో టౌన్‌షిప్‌ నిర్మాణానికి సంబంధించి ఒక సంస్థ హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసింది. ఇదే జిల్లాలోని నందిగామ మండలం చేగూరు ప్రాంతంలో 100 ఎకరాల్లో మరో టౌన్‌షిష్‌ కోసం ఒక ప్రైవేటు సంస్థ దరఖాస్తు చేసింది. ప్రస్తుతం ఇవి హెచ్‌ఎండీఏ పరిశీలనలో ఉన్నాయి.

హెచ్‌ఎండీఏ విస్తీర్ణం 7200 చదరపు కిలోమీటర్లు ఉండగా... ఈ పరిధిలో జనాభా రెండు కోట్ల వరకు ఉంటుంది. భవిష్యత్తులో కొత్త నివాస సముదాయాలు రానున్నాయి. దీంతో మున్ముందు మరిన్ని టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో కొంత స్తబ్ధత కన్పిస్తున్నప్పటికీ.. ఇది తాత్కాలికమేనన్నది మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. జనవరి నుంచి మునుపటి కంటే మళ్లీ మార్కెట్‌ ఊపందుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మున్ముందు అనేక ప్రాజెక్టులకు హైదరాబాద్‌ కేంద్రం కానుంది. అందుకు తగ్గట్టు జనాభాకు వసతి సౌకర్యం, ప్రజారవాణా ఒక సవాలే. దీనివల్ల ప్రధాన నగరంపై ఒత్తిడి పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్పు నిర్మాణం ఒక పరిష్కార మార్గంగా కన్పిస్తోంది. ఇందుకు అనుగుణంగా స్థిరాస్తి, ఇతర ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవుటర్‌ చుట్టూ సమీకృత పట్టణాలు నిర్మాణాలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హెచ్‌ఎండీఏకు మాత్రమే వర్తించేలా 2020లో ప్రభుత్వం ‘తెలంగాణ కాంప్రెన్సివ్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ’ని తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా సమీకృత పట్టణాల నిర్మాణానికి తగిన విధివిధానాలకు అధికారులు రూపకల్పన చేశారు.  

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే...

2030 నాటికి కేవలం మహానగర జనాభానే కోటిన్నర దాటుతుందని అంచనా. అందుకు తగ్గట్లు ఆవాసాలు కల్పించడం చాలా అవసరం. ప్రస్తుతం ప్రధాన నగరంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే వ్యక్తిగత వాహనాల సంఖ్య అరకోటి దాటింది. మున్ముందు కాలుష్యం ఇంకా పెరిగితే దిల్లీ తరహాలో ఇబ్బందులు తప్పవు.

  •  ఈలోపే నగరంపై ఒత్తిడి తగ్గాలంటే అవుటర్‌ దాటి కొత్త కాలనీలు, టౌన్‌షిప్పులు ఇతర అన్ని కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలి. అందుకే టౌన్‌షిప్‌ పాలసీలో కొన్ని నిబంధనలు పొందుపరిచారు.
  •  అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటి 5 కిలోమీటర్ల తర్వాతే టౌన్‌షిప్పు ఉండాలి. అంతకంటే లోపల ఉంటే హెచ్‌ఎండీఏ అనుమతులు ఇవ్వదు. వీటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా భూ వినియోగ మార్పిడి(ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌) దరఖాస్తు దారులు చేయాల్సిన అవసరం లేదు. కన్జర్వేషన్‌ జోన్‌లో ఉన్నాసరే... ఎలాంటి ఫీజులు లేకుండానే హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ యూజ్‌ నిబంధలను మార్పు చేస్తుంది.
  •  సాధారణ లేఅవుట్‌లో ల్యాండ్‌ యూజ్‌ మార్చాలంటే భారీ ఎత్తున ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. టౌన్‌షిప్‌ల విషయంలో ఈ నిబంధన నుంచి హెచ్‌ఎండీఏ మినహాయింపు ఇచ్చింది. కన్వర్జేషన్‌ జోన్‌లో ఉన్నప్పటికీ ఎలాంటి ల్యాండ్‌ యూజ్‌లో ఎలాంటి మార్పు లేకుండానే అనుమతులు మంజూరు చేస్తారు.  
  •  టౌన్‌షిప్‌ల నిర్మాణ పాలసీ ప్రకారం కనీసం 100 ఎకరాల భూమి ఒకే చోట ఉంటేనే అనుమతులు మంజూరు చేయనున్నారు. రైతుల అనుమతితో సేకరించినా... నిబంధనల ప్రకారం వారికి అభివృద్ధి చేసిన స్థలాలు కేటాయించాల్సి ఉంటుంది.
  •  100 అడుగుల అప్రోచ్‌ రహదారి తప్పనిసరి. సాధారణ లేఅవుట్‌కు అప్రోచ్‌ రహదారి 30-40 అడుగులు ఉన్నాసరే... అదనపు ఫీజులు విధించి లేఅవుట్‌ మంజూరు చేసే అవకాశం ఉంది.
  •  టౌన్‌షిప్‌ల పాలసీ ప్రకారం కచ్చితంగా 100 అడుగులు ఉండాల్సిందే. అంతర్గత రహదారులు 30-60 అడుగులు వరకు ఉండొచ్చు. ఇందులో మల్టీపుల్‌ అవసరాలకు భూ కేటాయింపులు తప్పనిసరి.
  •  నివాస, వాణిజ్య, విద్యా, ప్రజా అవసరాలు, హెల్త్‌కేర్‌ అవసరాలు, మౌలిక వసతులు, ప్రజా రవాణా, ఎల్‌ఐజీ, ఈడబ్ల్యుఎస్‌ హౌసింగ్‌, రహదారులు, పార్కులు, ఆటస్థలాలు, ప్రమాదకరం లేని పరిశ్రమల యూనిట్లు... ఇలా ప్రతి అవసరానికి నిర్ణీత భూ కేటాయింపులు తప్పనిసరిగా ఉండాలి.

    ఓఆర్‌ఆర్‌ లోపల..

ప్రభుత్వం నిర్దేశించిన టౌన్‌షిప్పుల స్థాయిలో కాకపోయినా.. పలుచోట్ల ఇప్పటికే చిన్న టౌన్‌షిప్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఓఆర్‌ఆర్‌ లోపల, చుట్టుపక్కలనే వస్తున్నాయి. ఒక్కో దాంట్లో 5వేల యూనిట్లు ఉండేలా నిర్మాణం చేపడుతున్నారు. శంషాబాద్‌లో ఒక సంస్థ దాదాపు వంద ఎకరాల్లో 5 వేల గృహ నివాస సముదాయాలను కడుతోంది. బాచుపల్లి, ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల పలు బడా సంస్థలు వీటిని నిర్మిస్తున్నాయి. ఒక్కో కమ్యూనిటీలో మూడువేల నుంచి ఐదువేల యూనిట్లు ఉండబోతున్నాయి. అక్కడే సకల సౌకర్యాలు ఉంటాయి. రోజువారీ అవసరాలన్నీ ఈ మినీ పట్టణాలు తీర్చనున్నాయి. రాబోయే రోజుల్లో ఓటేసేందుకు కూడా బయటికి వెళ్లాల్సిన పనిలేదు. మినీ టౌన్‌షిప్పుల్లోనే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని