భవిష్యత్తు చిన్న నగరాలదే

ప్రపంచవ్యాప్తంగా 50 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటోంది. ప్రపంచ నగరాల నివేదిక ప్రకారం 2050 నాటికి ఈ సంఖ్య 68 శాతానికి పెరుగుతుందని అంచనా.

Updated : 21 Oct 2023 11:10 IST

2050 నాటికి రియల్‌ ఎస్టేట్‌ నగరాలను గుర్తించిన క్రెడాయ్‌
అక్కడ గృహ, కార్యాలయాల నిర్మాణాలకుపెరుగుతున్న డిమాండ్‌
తెలుగు రాష్ట్రాల్లో వరంగల్‌, విశాఖకు చోటు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా 50 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటోంది. ప్రపంచ నగరాల నివేదిక ప్రకారం 2050 నాటికి ఈ సంఖ్య 68 శాతానికి పెరుగుతుందని అంచనా. భారత్‌లో ప్రస్తుతం 36 శాతంగా ఉన్న పట్టణీకరణ.. ఈ దశాబ్దం ఆఖరు నాటికి 40 శాతం, 2050 నాటికి 50 శాతం చేరుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే 2025 నాటికే యాభై శాతానికి చేరుకుంటుందని అంచనా. ఈ పరిణామాలన్నీ నగరాల్లో గృహ డిమాండ్‌ పెరుగుతుందని.. కొత్తగా ద్వితీయ శ్రేణి నగరాలకు స్థిరాస్తి మార్కెట్‌ విస్తరణకు దోహదం చేస్తుందని ఇటీవల కుష్‌మన్‌ వేక్‌ఫిల్డ్‌, క్రెడాయ్‌ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత పదేళ్లలో కార్యాలయాల మార్కెట్‌ ముఖ్య నగరాల్లో ఎలా విస్తరించిందో పొందుపరిచారు.

హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలపై ఇప్పటికే బిల్డర్లు దృష్టి పెట్టారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు వస్తున్నాయి. మున్ముందు కార్యాలయాలు, మాల్స్‌ నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. నిర్మాణ సంఘాలు సైతం ఆయా నగరాల్లో తమ ఛాప్టర్లను విస్తరిస్తున్నాయి. క్రమబద్ధ అభివృద్ధిలో ఆయా సంఘాలు తమ సభ్యులకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. ఈ తరహాలోనే దేశంలోనే పది ద్వితీయ శ్రేణి నగరాలు 2050 నాటికి స్థిరాస్తి కేంద్రాలుగా ఉంటాయని క్రెడాయ్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ గృహ నిర్మాణాలకు డిమాండ్‌ పెరుగుతోంది.

* దిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి ఎనిమిది అగ్రశ్రేణి నగరాలతో పాటూ మరో పది నగరాలు భువనేశ్వర్‌, కోయంబత్తూరు, ఇండోర్‌, జయపుర్‌, కొచ్చి, లక్నో, నాగ్‌పుర్‌, సూరత్‌, తిరువనంతపురం, విశాఖపట్నంలో మున్ముందు రియల్‌ మార్కెట్‌ విస్తరిస్తుందని అంచనా వేశారు.

కార్యాలయాల పరంగా వరంగల్‌కు చోటు  

పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌ లాంటి మహానగరాలకు విస్తరించిన ఐటీ సంస్థలు ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వైపు చూస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో  తమ కార్యాలయ ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆయా నగరాలపై దృష్టి పెట్టింది. మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం వంటి ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఐటీ టవర్లను కూడా నిర్మించింది. కంపెనీల రాకతో ప్రైవేటు రంగంలో కార్యాలయాల నిర్మాణాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఆగ్రా, వడోదర, నాసిక్‌, వరంగల్‌, మధురై, తిరువనంతపురం, చండీగఢ్‌ నగరాల్లో కార్యాలయాల మార్కెట్‌ విస్తరిస్తోందని నివేదికలో పేర్కొంది.

రెండో స్థానంలో హైదరాబాద్‌

 * రియల్‌ ఎస్టేట్‌ ఇప్పటికే విస్తరించిన ఎనిమిది నగరాల్లో కార్యాలయాల నిర్మాణాల వార్షిక వృద్ధి అహ్మదాబాద్‌లో అధికంగా ఉంది. 2013 నుంచి 2023 ప్రథమార్థం తీసుకుంటే సగటున 19.6 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
 * హైదరాబాద్‌లో 13.4 శాతం, పుణె 7.7 శాతం, బెంగళూరులో 7.5 శాతం, దిల్లీ రాజధాని ప్రాంతంలో 7.3 శాతం, ముంబయిలో 5.8 శాతం, కోల్‌కతాలో  3.7 శాతం, చెన్నైలో అతి తక్కువగా 3.6 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని