ఎప్పుడు కొంటే మేలు?

స్థిరాస్తి మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఆరంభంలో వీరు ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. మనం ఏ ప్రాంతంలో ఇల్లు కోసం చూస్తున్నామో.. అక్కడ ఒకసారి తిరిగినా కొత్త నిర్మాణాలు తెలిసిపోతాయి....

Updated : 24 Aug 2019 02:00 IST

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఎక్కడ చూసినా నిర్మాణాలే నిర్మాణాలు. ఇల్లు లేనివారు వాటిని చూసినప్పుడల్లా మనమూ కొంటే బాగుంటుందని అనుకోకుండా ఉండలేరు. మరీ నిర్మాణంలో ఉండగా కొంటే మేలా? పూర్తయిన ఇల్లు తీసుకోవడం ఉత్తమమా? చాలా అంశాలపై నిర్ణయం ఆధారపడి ఉంటుంది. మీ అవసరాల ఆధారంగా కొనుగోలు చేయవచ్చు.

స్థిరాస్తి మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఆరంభంలో వీరు ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. మనం ఏ ప్రాంతంలో ఇల్లు కోసం చూస్తున్నామో.. అక్కడ ఒకసారి తిరిగినా కొత్త నిర్మాణాలు తెలిసిపోతాయి.
* కొంటే కొత్త ఇల్లే కొనాలనుకునేవారికి నిర్మాణంలో ఉన్న వాటిని కొనుగోలు చేయడమే అత్యుత్తమం.
* ప్రాజెక్ట్‌ ప్రారంభంలో కాబట్టి నచ్చిన ఫ్లోర్‌, దిక్కుతో పాటు కాస్త తక్కువ ధరకే వస్తుంది.
* కొన్ని సంస్థలైతే వారి పూర్వ కొనుగోలుదారులకు ఇటువంటి సమాచారాన్ని ముందస్తుగా చేరవేస్తాయి. తద్వారా బుకింగ్స్‌ చేపడతాయి. రాయితీలు అందిస్తాయి.
* ఇల్లును తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలోనే ఇటువంటి వెసులుబాటు ఉంటుంది.
* ఇల్లు పూర్తయ్యేసరికి నగరంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా 30 శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ మేరకు కొనుగోలుదారి ఆస్తి విలువ పెరిగినట్లే.
* వీటిలో గడువులోపు ప్రాజెక్ట్‌ను పూర్తిచేయకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. నిర్మాణదారుడు ఎంతకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయగలడనేది కొనేముందు చూడాలి. చెప్పిన సమయానికి ఇచ్చే చరిత్ర ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
* గృహరుణం ద్వారా కొనుగోలు చేసినట్లయితే నిర్మాణ సమయం నుంచే ఈఎంఐ చెల్లించాల్సి రావడం చాలామందికి భారం. ప్రాజెక్ట్‌ ఆలస్యమయ్యేకొద్దీ ఒకవైపు ఈఎంఐ, మరోవైపు ఇంటి అద్దె చెల్లించాల్సి రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాటిని చూసుకోవాలి.

సిద్ధంగా ఉన్నవాటిలో..
* ఇల్లు కొన్నాక మూడేళ్లపాటు ఎదురుచూడాల్సిన పని లేదు. వెంటనే గృహప్రవేశం చేయొచ్చు.
* సిద్ధంగా ఉన్న ఇళ్లు ఆయా ప్రాజెక్ట్‌ల్లో పరిమితంగా ఉంటాయి కాబట్టి సహజంగానే ధర కాస్త ఎక్కువే ఉంటుంది.
* కొన్నిసార్లు ప్రాజెక్ట్‌లో ఒకటి అరా మిగిలిపోతుంటాయి. నిర్మాణదారు ఆర్థిక అవసరాలను బట్టి.. కొన్నిదఫాలు తక్కువ ధరకు కూడా వస్తుంది. అయితే ఇది చాలా అరుదు.
* అద్దె ఇంట్లో ఉన్నవారు కిరాయికి మరికొంత మొత్తాన్ని జోడిస్తే గృహరుణ వాయిదాలకు సరిపోతుంది.
* వీటిలో కొనుగోలుకు ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాలి. వాయిదాల అవకాశం ఉన్నా స్వల్పకాలం మాత్రమే.
* ఇంట్లో టైల్స్‌గానీ, ఇతరత్రా ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. ఒకవేళ మార్పులు చేసుకుంటే అదనపు ఖర్చు సొంతంగానే భరించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని