కొనాలి.. మురవాలి

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో ఇన్వెంటరీ(విక్రయించని ఇళ్లు) పెరుగుతోందా? అవునని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీలు అంటుంటే.. దాన్ని ఇన్వెంటరీగా చూడొద్దు అని డెవలపర్లు అంటున్నారు. హైదరాబాద్‌లో జూన్‌ 2022 నాటికి 82,220 విక్రయించని ఇళ్లు ఉన్నట్లు

Updated : 02 Jul 2022 09:53 IST

ఇళ్ల విక్రయానికి 37 నెలలు పడుతోంది

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో ఇన్వెంటరీ(విక్రయించని ఇళ్లు) పెరుగుతోందా? అవునని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీలు అంటుంటే.. దాన్ని ఇన్వెంటరీగా చూడొద్దు అని డెవలపర్లు అంటున్నారు. హైదరాబాద్‌లో జూన్‌ 2022 నాటికి 82,220 విక్రయించని ఇళ్లు ఉన్నట్లు తాజాగా ప్రాప్‌టైగర్‌ విడుదల చేసిన వేదికలో వెల్లడించింది. వీటి విక్రయానికి 37 నెలలు పడుతుందని అంచనా వేసింది.  
రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ప్రస్తుతం ఎలా ఉంది? క్రయ విక్రయాలు పెరిగితే మార్కెట్‌ బాగున్నట్టా? స్థిరాస్తుల విలువ పెరిగితే బాగున్నట్టా? మొదటిదని డెవలపర్లు అంటే..  రెండోదని కొనుగోలుదారులు అంటుంటారు. ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిన వ్యవహారం. సరఫరా డిమాండ్‌ ఆధారంగా మార్కెట్‌ పనిచేస్తుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకించి వ్యవస్థీకృత మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి ఇదివరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు. దశలవారీగా ప్రాజెక్టులను ప్రారంభించేవారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌ మార్కెట్లోకి కొత్త బిల్డర్లు రావడం, పెద్ద బిల్డర్లు దూకుడు పెంచడం, ఆకాశహర్మ్యాలు కడుతుండటంతో ఒక్కసారిగా సరఫరా పెరిగింది. విక్రయించని ఇళ్లు పెరిగిపోవడానికి ఇదొక కారణంగా కనబడుతోంది.

కొన్నేళ్ల క్రితం వరకు హైదరాబాద్‌లో 30వేల శ్రేణిలో ఇన్వెంటరీ ఉండేది. మూడు నాలుగేళ్లలోనే  ఇది కాస్త దాదాపు మూడింతలు పెరిగింది. బిల్డర్లలో ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. చిన్న బిల్డర్లు కట్టే స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లకు ప్రస్తుత పరిణామాలు ఇబ్బందిగా మారాయి. నిర్మాణం పూర్తయ్యేసరికి ఒకటి రెండు మినహా అన్ని ఫ్లాట్లు విక్రయించేవారు. ప్రస్తుతం పూర్తై ఏడాది గడుస్తున్నా చాలా ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి,  ప్రాజెక్టును బట్టి ఇందులో వ్యత్యాసాలు ఉన్నాయి. నగరం మొత్తం ఒకేగాటన కట్టలేమని నిపుణులు అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ను మైక్రో మార్కెట్‌గా చూడాలని చెబుతున్నారు. గచ్చిబౌలి ప్రాంతాన్ని పోచారంతో పోల్చకూడదని అంటున్నారు.

ధర అందుబాటులో లేక..

సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారు ఎందరో ఉన్నా ఇళ్ల విక్రయానికి మూడేళ్ల సమయం పట్టడం వెనక ప్రధానమైన కారణాల్లో ధర అందుబాటులో లేపోవడం. కొవిడ్‌ అనంతరం భూములు, ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రతి మూడునెలలకు ఒకసారి పెరుగుతూనే ఉన్నాయి.  ఫ్లాట్లలో వార్షిక ధరల వృద్ధి 7 శాతంగా ఉంది.  దీంతో సామాన్య, మధ్యతరగతి వాసులకు  ఇంటి ధరలు భారంగా మారాయి.  ఇది కూడా  విక్రయాలపై ప్రభావం చూపుతోంది.  బిల్డర్లు మాత్రం ధరలు తగ్గించడం లేదు. పైగా పెంచుతున్నారని కొనుగోలుదారులు అంటున్నారు. ‘భూముల ధరలు భారీగా పెరిగాయి. వీటితో పాటూ నిర్మాణ సామగ్రి, కూలీల వ్యయం పెరగడంతో నిర్మాణ వ్యయం 30 నుంచి 35 శాతంగా పెరిగింది. ధరలు తగ్గించే పరిస్థితి లేదు. తగ్గిస్తే నష్టానికి అమ్ముకోవాల్సిందే’ అని ఒక బిల్డర్‌ అన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా ఇన్వెంటరీ పెరగడానికి కారణాలు అవుతున్నాయి. ధరలు తగ్గిస్తే కొనగలమని కొనుగోలుదారులు అంటున్నారు.

ఇన్వెంటరీపై భిన్న వాదనలు

ఒక ప్రాజెక్ట్‌లో చేపట్టిన ఇళ్లలో (స్టాక్‌) విక్రయించని గృహాల(యూనిట్ల)ను ఇన్వెంటరీగా రియల్‌ ఎస్టేట్‌ కన్సెల్టెన్సీలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా నుంచి అనుమతి పొందిన ప్రాజెక్ట్‌ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఇన్వెంటరీని లెక్కిస్తున్నాయని ఇది సరికాదని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్‌ మొదలెట్టి  పూర్తిచేసేందుకు రెండు మూడేళ్లు పడుతుంది. నిర్మాణం పూర్తై అక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వచ్చిన తర్వాతి నుంచి అమ్ముడుపోని కాలాన్ని లెక్కించాలని అంటున్నారు. కొవిడ్‌ అనంతరం ప్రభుత్వం వాయిదాల్లో నిర్మాణ ఫీజులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వడంతో ఎక్కువ మంది బిల్డర్లు ఒకేసారి తమ ప్రాజెక్టులకు అనుమతి తీసుకున్నారు. గతంలో అయితే దశలవారీగా అనుమతి తీసుకునేవారు. ఇటీవల ఒకేసారి తీసుకోవడంతో యూనిట్ల సంఖ్య పెరిగి ఇన్వెంటరీ సంఖ్య ఎక్కువగా కనబడుతోందని అంటున్నారు.

కొత్తవి వస్తున్నాయ్‌

ఒక ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అమ్ముడుపోకుండా ఇళ్లు ఉండగా..  అదే చోట కొత్త నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు. దీంతోనూ ఇన్వెంటరీ పెరిగిపోతుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. కొనుగోలుదారులు గేటెడ్‌ కమ్యూనిటీల వైపు చూస్తుండటంతో అందుకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను డిజైన్‌ చేస్తూ విక్రయాలపై ధీమాతో ముందుకెళుతున్నారు బిల్డర్లు. ఇక్కడ సైతం ఆయా నిర్మాణ సంస్థల బ్రాండ్‌, మార్కెటింగ్‌పై ఆధారపడి విక్రయాలు ఉంటాయి. ప్రాంతం, ధరలు సైతం ప్రధాన పాత్ర పోషిస్తాయి.

అన్ని నగరాల్లోనూ..

దేశవ్యాప్తంగానూ ఇళ్ల విక్రయానికి 34 నెలలు పడుతోందని నివేదికలు చెబుతున్నాయి.  జాతీయ సగటు కంటే తక్కువ సమయంలోనే హైదరాబాద్‌లో ఇళ్లను విక్రయించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇళ్ల విక్రయ సమయం 37 నెలలకు పెరిగింది. దిల్లీలో 65 నెలలు పడుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని