బెంగళూరు అనుభవం మనకొద్దంటే..

వానలు కురిస్తే మురవాలి..నగరాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి. వరదలతో ఎక్కడ ఇళ్లు మునుగుతాయోనని.. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీళ్లు వస్తాయని భయపడే పరిస్థితి.

Published : 10 Sep 2022 02:51 IST

ఇల్లు, స్థలం కొనుగోలులో అప్రమత్తం అంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: వానలు కురిస్తే మురవాలి..నగరాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి. వరదలతో ఎక్కడ ఇళ్లు మునుగుతాయోనని.. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీళ్లు వస్తాయని భయపడే పరిస్థితి. రూ.లక్షలు, కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఇళ్లలోనూ భారీ వర్షం కురుస్తుందంటే లోలోపల గుబులు చెందుతున్నారు. బెంగళూరులో ఇటీవల వరదల్లో విలాసవంతమైన విల్లాలు సైతం నీటిలో మునిగిపోయాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం మేలు. 

* కొత్తగా స్థలం, ఇళ్లు, ఫ్లాట్‌ కొంటుంటే ఆయా ప్రాంతాలను సందర్శించాకనే కొనుగోలు చేయండి. వాస్తు ప్రకారం ఉందా? తక్కువ ధరకు వస్తుందా అనే విషయాలతో పాటు లోతట్టులో ఉందా? వరద వస్తే వెంచర్‌ మునుగుతుందా? వంటివి స్వయంగా పరిశీలించాలి.

* స్థిరాస్తి వెంచర్ల అసలు రూపం, నిర్మాణ నాణ్యత, ఆ ప్రాంతం స్థితిగతులన్నీ వానాకాలంలోనే బయటపడతాయి. ఈ కాలంలో చూడటంద్వారా ఆయా స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.

* * చెరువు పరిధిలో,  కట్ట కింద, వరద కాలువ మార్గంలో, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చాలా వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. ఇలాంటి భూముల్లో కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముంపు తప్పదని తాజా పరిస్థితులు మరోసారి రుజువు చేస్తున్నాయి. బెంగళూరులో ఇదే జరిగింది.

నాణ్యత లోపాలుంటే.. వానాకాలంలో నిర్మాణ నాణ్యత.. మురుగు కారడం.. స్నానాల గదుల వద్ద పైకప్పు తడి వంటి నిర్మాణ లోపాలు బయటపడతాయి. అపార్ట్‌మెంట్లలో ఎక్కువగా ఇటువంటి సమస్యలు వస్తుంటాయి.  చివరి అంతస్తులో ఉండే వారికి వాన నీరు కారడం.. కింది అంతస్తులో ఉండేవారికి వరద వస్తే సెల్లారు మునుగుతుందా అనేది వానాకాలంలోనే బయటపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని