టీడీఆర్‌తో ఖర్చు ఆదా

అమ్మేవారికే కాదు.. కొనేవారికీ లాభం చేకూర్చేలా టీడీఆర్‌ (ట్రాన్స్ఫ్‌రబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) కొత్త నిబంధనలు రూపుదిద్దుకున్నాయి.

Updated : 17 Dec 2022 05:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమ్మేవారికే కాదు.. కొనేవారికీ లాభం చేకూర్చేలా టీడీఆర్‌ (ట్రాన్స్ఫ్‌రబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) కొత్త నిబంధనలు రూపుదిద్దుకున్నాయి. గత నిబంధనలను సవరిస్తూ పురపాలకశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వు నిర్మాణదారులకు వరంలా మారనుంది. గతంలో అదనపు అంతస్తు నిర్మాణానికే టీడీఆర్‌తో అవసరముండేది. నిర్మాణ అనుమతుల ప్రక్రియలోని రెండు రకాల జరిమానాలనూ చెల్లించుకునేలా అవకాశం కల్పించింది. ఓఆర్‌ఆర్‌ వరకే కాకుండా హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్మాణదారులూ అదనపు లబ్ధి పొందే అవకాశం కలిగినట్లయింది. ఇప్పటివరకు రూ.4 వేల కోట్ల 1800 టీడీఆర్‌ సర్టిఫికెట్లను జీహెచ్‌ఎంసీ జారీ చేసింది.

కొత్త సవరణలతో లాభం..

భూమిని అమ్ముకున్నట్లే గజాల లెక్కన టీడీఆర్‌ను డిమాండ్‌కు తగ్గట్లు అమ్ముకోవచ్చు. కొత్త సవరణలతో అమ్మేవారితోపాటు కొనేవారికీ భారీ లాభం చేకూరనుంది.
* పరిమితికి మించి 1,2 అంతస్తులు అదనంగా నిర్మించుకోవచ్చు.
* నిర్మాణ విస్తీర్ణం 200 చ.మీ మించినా, నిర్మాణం ఎత్తు జీ+1కు మించినా.. సదరు భవనంలో 10 శాతాన్ని జీహెచ్‌ఎంసీ తాకట్టు పెట్టుకుంటుంది. ప్లాన్‌ ప్రకారం పూర్తయితే తనఖా పెట్టిన స్థలాన్ని విడుదల చేసి నివాసయోగ్యపత్రాన్ని (ఓసీ) జారీ చేస్తుంది. ప్లాన్‌కు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తే మూల్యం చెల్లించుకోవాలి. నిర్మాణ అనుమతి రుసుములో 33 శాతాన్ని జరిమానాగా చెల్లించాలి. అదీ ఉల్లంఘన గరిష్ఠంగా 10 శాతం మించితే ఓసీ మంజూరవ్వదు. ఈరకంగా 10 వరకు ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మాణం చేపట్టేవారు జీహెచ్‌ఎంసీలో కోకొల్లలు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లోని నిర్మాణదారులు ఒక్కో భవనానికి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల జరిమానా చెల్లిస్తుంటారు. అలాంటివారు టీడీఆర్‌ను రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలకు కొనుగోలు చేసి జరిమానా చెల్లించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.తక్కువ ధరకు కొనుగోలు చేసిన టీడీఆర్‌ సర్టిఫికెట్లతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

అందరికీ ఉపయోగకరం
- జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోయేషన్‌

టీడీఆర్‌ వినియోగం 50 శాతంకంటే తక్కువగా ఉంది. దీనికి డిమాండ్‌ కల్పించాలంటే జరిమానాలు, ఫీజు చెల్లింపులకూ అనుమతిస్తే డిమాండ్‌ పెంచినట్లు అవుతుందని గతంలో ప్రభుత్వానికి సూచించాం. ఇటీవల ఇచ్చిన జీవో ఉపయోగకరం. ఇప్పటికైతే జరిమానాలకే అవకాశం కల్పించారు. టీడీఆర్‌కు ఇంకా డిమాండ్‌ పెరగాలంటే ఫీజుల్లోనూ కొంత వీటితో చెల్లించే అవకాశం కల్పించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని