Sanju Samson: సంజూ క్యాచ్‌ ఔట్‌ వివాదం.. కొత్త వీడియో వైరల్‌!

మ్యాచ్‌ ముగిసి రెండు రోజులు అవుతున్నా.. సంజూ శాంసన్‌ క్యాచ్‌ ఔట్‌పై మాత్రం చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Published : 09 May 2024 18:45 IST

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ - దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (Sanju Samson) క్యాచ్‌పై తీసుకున్న థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం వివాదాస్పదమైంది. ఆర్‌ఆర్‌ కెప్టెన్ సంజూ (86) కొట్టిన బంతిని దిల్లీ ఫీల్డర్‌ షై హోప్ (Shai Hope) అద్భుతంగా ఒడిసిపట్టాడు. కానీ, బౌండరీ రోప్‌ను అతడి పాదం తాకినట్లు రిప్లేలో కనిపించిందని సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. ఆ క్యాచ్‌తోనే తమ అభిమాన జట్టు ఓడిపోయిందని ఫ్యాన్స్‌ విమర్శలు చేశారు. రాజస్థాన్‌ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర కూడా మరికొన్ని కోణాల్లో చూసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తంచేశాడు. దిల్లీ జట్టు కూడా క్లియర్ క్యాచ్ అంటూ అప్పుడే పోస్టు పెట్టింది. అయినా, వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్‌ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ వీడియోను షేర్ చేసింది. 

షై హోప్‌ క్యాచ్‌ పట్టినప్పుడు బౌండరీ రోప్‌ కదిలినట్లు అనిపించలేదని ఆసీస్‌ మాజీ క్రికెటర్ టామ్‌ మూడీ వివరించాడు. ‘‘ఇక్కడ బౌండరీ లైన్‌కు చాలా దగ్గరగా ఫీల్డర్‌ వచ్చినట్లు అనిపించింది. కానీ, వివిధ యాంగిల్స్‌లో చూడటం వల్ల రోప్‌ను తాకాడేమోనని కొందరి వాదన. కానీ, క్లియర్‌గా వీడియోను గమనిస్తే అతడు రోప్‌ను తాకలేదనే విషయం తెలుస్తుంది. థర్డ్‌ అంపైర్‌ సరైన నిర్ణయమే తీసుకున్నాడనడంలో సందేహం లేదు’’ అని మూడీ వెల్లడించాడు. కానీ, ఈ వీడియోను చూసినప్పటికీ.. కొందరు నెటిజన్లు మాత్రం థర్డ్‌ అంపైర్‌దే పొరపాటు అంటూ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. 

‘‘అంపైర్లు చేసిన పొరపాటును కప్పిపుచ్చుకోవడాన్ని ఇకనైనా ఆపండి. ఇంతటి క్లిష్టమైన నిర్ణయాన్ని వెల్లడించడానికి కేవలం 7 సెకన్లు మాత్రమే సమయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’’

‘‘రోప్‌ వద్దకు పాదం దగ్గరగా వెళ్లినట్లు అనిపించినప్పుడు మీరు మరోసారి జూమ్‌ చేయలేదు. తాడుకు ఉన్న కుషన్స్‌ను పాదం తాకినట్లు ఉంది’’

‘‘క్లియర్‌గా నాటౌట్‌. సంజూ శాంసన్‌ను మోసం చేశారు. ప్లే చేస్తే మొత్తం వీడియోను పోస్టు చేయండి’’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని