ఒప్పందం మీరితే అనైతికమే!

బిల్డర్లకు వినియోగదారుల మధ్య వివాదాలున్నాయా? ఒప్పందం చేసుకున్న సంస్థలు ఆఖరు నిముషంలో చేతులెత్తేస్తున్నాయా? ఇక భయం అక్కర్లేదు.

Updated : 17 Dec 2022 05:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: బిల్డర్లకు వినియోగదారుల మధ్య వివాదాలున్నాయా? ఒప్పందం చేసుకున్న సంస్థలు ఆఖరు నిముషంలో చేతులెత్తేస్తున్నాయా? ఇక భయం అక్కర్లేదు. వినియోగదారుల కమిషన్లు ఈ తరహా వివాదాల్లో కొరడా ఝళిపిస్తున్నాయి. ఫ్లాట్‌ కొనుగోళ్లలో బిల్డర్లు, వినియోగదారులకు ఇచ్చిన హామీలను గడువులోగా తీర్చకుండా, అడ్వాన్స్‌ మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడితే అది కచ్చితంగా అనైతిక వ్యాపారమే అంటూ వినియోగదారుల చట్టం తాజాగా స్పష్టం చేసింది. బేగంపేట్‌కు చెందిన సీహెచ్‌.మంజు, ఖాజాగూడ ప్రశాంతిహిల్స్‌లోని ‘లక్ష్య ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌’ మధ్య జరిగిన వివాదంలో హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌ తీర్పునిచ్చింది. మంజుకు, ప్రతివాద సంస్థకు మధ్య ఓ ఫ్లాట్‌ నిర్మాణ విషయంలో ఒప్పందం కుదిరింది. ఇందుకు సదరు సంస్థకు రూ.20 లక్షల అడ్వాన్స్‌ చెల్లించారు. మరో 17,70,000 నిర్మాణ పనుల పురోగతి ఆధారంగా చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. అయితే సదరు సంస్థ నిర్మాణ పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తుండటంతో అడ్వాన్సు మొత్తాన్ని చెల్లించాలని ఫిర్యాది డిమాండ్‌ చేశారు. దీంతో సదరు సంస్థ కేవలం రూ.5 లక్షలు చెల్లించి చేతులు దులుపుకొంది. మిగిలిన రూ.15 లక్షలు చెల్లించకుండా విసిగించడంతో హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం ఫ్లాట్‌ను వినియోగదారుకు ఇవ్వడంలో విఫలమవడంతోపాటు డబ్బు చెల్లించకపోవడం అనైతిక వ్యాపారం కింద పరిగణించామంటూ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈమేరకు రూ.15 లక్షలు, 10 శాతం వడ్డీతో ఇవ్వడంతోపాటు, రూ.లక్ష పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చులు 45 రోజుల్లో చెల్లించాలని లక్ష్య ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సంస్థను ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని